Advertisement

Advertisement


Home > Politics - Analysis

వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?

వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?

రాజకీయ నాయకులంటే రాజకీయాలే చేస్తారు. దాన్ని అంటిపెట్టుకునే అవినీతి కూడా ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు.. ఇలా అవినీతికి ఎవరూ అతీతులు కారు. కాకపొతే పదవుల్లో ఉన్నవారు భారీ ఎత్తున అవినీతి చేస్తే లేనివారు చిన్నా చితకా అవినీతి పనులు చేస్తారు.

మొత్తం మీద ఎవరి స్థాయిలో వారు అవినీతికి పాల్పడతారనేది నిజం. ఈ లిస్టులో అధికారులూ ఉంటారనుకోండి. రాజకీయ నాయకులు కావొచ్చు, అధికారులు కావొచ్చు అవినీతి పనులు చేస్తుంటారు. అక్రమంగా సంపాదిస్తుంటారు. మరోపక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. గుళ్ళకూ గోపురాలకు వెళుతుంటారు. యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు. చండీ హోమాలు చేస్తుంటారు.  దేవుడికి సంబంధించిన దీక్షలు చేస్తుంటారు. దీక్షలో ఉంటూనే బూతులు మాట్లాడతారనుకోండి. అది వేరే సంగతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని కబుర్లు చెబుతుంటారు. 

వాస్తవానికి ఇవన్నీ మతంతో ముడిపడిన కార్యక్రమాలేగానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావని చెప్పొచ్చు. చేసే పాపాలన్నీ పోతాయనే ఉద్దేశంతో కావొచ్చు ఇవన్నీ చేస్తుంటారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్రధారులైన అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ ముద్దుల తనయ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే కదా. 

కవిత ముందు జైలుకు వెళితే కేజ్రీవాల్ తరువాత వెళ్ళాడు. జైలు అధికారులు తనకు సౌకర్యాలు కల్పించడంలేదని, తాను అడిగినవి ఇవ్వడంలేదని కోర్టును ఆశ్రయించింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఇంటి భోజనం అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు పెన్నులు, నోట్ బుక్స్, ఆమె చదువుకునే కొన్ని ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు, వార్తా పత్రికలు ఇవ్వాలని చెప్పింది. 

ఇవి కాకుండా ఆమె రోజూ జపం చేసుకోవడానికి జపమాల, ఆధ్యాత్మిక పుస్తకాలైన నరసింహ శతకం, గజేంద్ర మోక్షం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే తనకు రామాయణం, భగవద్గీత కావాలని కేజ్రీవాల్ అడిగాడు. దీన్నిబట్టి వీళ్ళ ఇద్దరిలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని అర్థమవుతోంది. కవిత జపం కూడా చేస్తుందన్నమాట.  ఏం జపం చేస్తుందో తెలియదు.  కేజ్రీవాల్ కు ఆ అలవాటు ఉందో లేదో తెలియదు. 

కవిత తండ్రి కేసీఆర్ ఎప్పుడూ భారీ ఎత్తున పూజలు పునస్కారాలు, యాగాలు, హోమాలు చేస్తుంటాడు కాబట్టి కవితలో కూడా ఆధ్యాతిక లక్షణాలు ఉండొచ్చు. కానీ కొడుకు కేటీఆర్ కు ఈ లక్షణాలు అంతగా ఒంటబట్టినట్లు కనబడదు. గుళ్ళు గోపురాలకు వెళ్లినట్లు ఎప్పుడూ వార్తలు రాలేదు. కవిత వెళుతుంది. కవితకుగాని, కేజ్రీవాల్ కు గాని ఆధ్యాత్మికత మంచిదే. అదే సమయంలో పాప భీతి కూడా ఉండాలి కదా.

ఒకప్పుడు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడు. కవిత అమెరికాలో రాజకీయాల ఊసు లేకుండా ప్రశాంతంగా ఉంది. కానీ కేజ్రీవాల్ పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చాడు. తండ్రి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయగానే కవిత అండ్ కేటీఆర్ హడావుడిగా ఇండియాకు వచ్చేశారు. రాజకీయాల్లోకి దిగారు. ఆశ పెరిగింది. అవినీతికి పాల్పడ్డారు. కవిత బయట పడింది. కేటీఆర్ పడలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?