సినిమాల్లో సింపతీ వర్కవుట్ అవుతుంది. మరి రాజకీయాల్లో అదే సింపతీ వర్కవుట్ అవుతుందా? పరిస్థితుల బట్టి అది ఆధారపడి ఉంటుంది. గతంలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు ఆ సంపతీని క్యాష్ చేసుకోవాలని చూశారు చంద్రబాబు, కానీ నిలువునా ఓడిపోయారు. ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా సింపతీ కార్డు వాడే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నుంచి సింపతీ సంపాదించే ప్రయత్నం చేశారు పవన్. తన సొంత ఆస్తులన్నీ రాజకీయాల కోసం పెడుతున్నానని, కోట్ల రూపాయల పారితోషికం వదిలి ప్రజల కోసం రోడ్లపైకి వచ్చానని, లగ్జరీ లైఫ్ వదిలి ఎండలో తిరుగుతున్నానని.. ఇలా చాలా రకాలుగా సింపతీ కొట్టే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ ఫలితాన్నివ్వలేదు.
ఇప్పుడు ఏకంగా తనపై హత్యయత్నం జరుగుతోందనే ఆరోపణలతో తెరపైకొచ్చారు పవన్. పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొంతమంది బ్లేడ్స్ పట్టుకొచ్చి తన శరీరంపై గాయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనను కలవడానికి ఎక్కువమంది వచ్చినప్పుడు, అందులో కొంతమంది కిరాయి మూకలు కూడా కలిసిపోతున్నారని, సన్నని బ్లేడ్ తో సెక్యూరిటీపై, తనపై దాడులు చేస్తూ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తనతో ఫొటో దిగడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతానని, కానీ ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని కామెంట్స్ చేసిన పవన్, తనకు తగిలిన బ్లేడ్ గాయాన్ని చూపిస్తే బాగుండేది. బ్లేడ్స్ తో కట్ చేస్తున్నారని అన్నారు, కట్ అయిన గాయాన్ని మాత్రం చూపించరు.
చూస్తుంటే.. ఎన్నికల వేళ ఇదో పెద్ద సింపతీ గేమ్ లా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ సందర్భంగా ఇలానే జనంలోకి వచ్చిన వేళ.. సొమ్మసిల్లి పడిపోయి చేతికి సెలైన్ ఎక్కించుకున్నారు పవన్. దాన్ని జనసేన, జనసైనికులు బాగా హైలెట్ చేశారు. సెలైన్ ఎక్కించడం కోసం చేతికి గుచ్చిన సూదిని అలానే ఓ 2 రోజుల పాటు పవన్ మెయింటైన్ చేశారు, ఫొటోలకు పోజులిచ్చారు.
ఇప్పుడు ఎన్నికల వేళ, ఏకంగా తనపై బ్లేడుతో దాడులు జరుగుతున్నాయని, హత్యాయత్నం జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ను ప్రజలు ఎలా చూస్తారో!