చంద్రబాబుని నమ్మి తన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్ అమాయకుడా?
లేక పవన్ కళ్యాణ్ ని నమ్మి నిండా మునిగిన జనసైనికులు అమాయకులా?
నమ్ముకున్న జనసైనికుల్ని ముంచేసి తెదేపా అధినేతతో తన “లెక్కలేవో” తాను చూసుకున్న పవన్ కళ్యాణ్ తెలివైనవాడా?
రాజకీయంగా కాపుల బలాన్ని నిర్వీర్యం చేయాలనే ఎత్తుగడతో పవన్ ని ఏమార్చి తన బానిసగా మార్చుకున్న చంద్రబాబు తెలివైనవాడా?
ఇంతకీ తెదేపాతో జనసేన పొత్తు వైకాపాని కూల్చేంత పటిష్టంగా ఉందా?
లేక వైకాపాకి మరింత బలం చేకూర్చేంత బలహీనంగా తయారయ్యిందా?
ప్రస్తుత రాజకీయ చక్రవ్యూహంలో ఈ ప్రశ్నలు చక్కెర్లు ఉన్నాయి.
ఎవరికి నచ్చింది వాళ్లు నమ్ముతున్నారు. ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు.
కానీ ఒకటి మాత్రం వాస్తవం.. ఈ మొత్తంలో అనుమానం లేకుండా అమాయకులుగా మిగిలిపోయి, కసాయిని నమ్మిన గొర్రెల మాదిరిగా పూర్తిగా దగా చేయబడ్డవాళ్లు మాత్రం జనసైనికులే. ఏమి చేయాలో తోచక, అసలీ సారి ఓటెవరికి వెయాలో కూడా తెలీక అయోమయంలో ఉన్నది వీళ్లే.
“నేను పవన్ అభిమానిని, జనసైకుడిని. కానీ మా నియోజకవర్గంలో జనసేన పోటీలో లేదు. ఆ స్థానంలో తెదేపా అభ్యర్థి ఉన్నాడు. అతనంటే నాకు ఇష్టం లేదు. మా పవన్ పొత్తులో ఉన్నాడు కదా అని నేను కూడా తెదేపా పట్ల సానుకూలంగా మారిపోయి ఓటేయాలంటే ఎలా? నాకు వేయాలని లేదు. ఈ సారి అసలు ఓటే వేయను” అని చెప్పాడు ఒక జనసైనికుడు.
“పవన్ ని సీఎంగా చూడాలని నా కల. గత కొన్నేళ్లుగా జనసేన జెండా మోస్తున్నాను. ఇక అలసిపోయాను. ఈ పొత్తు గెలిచినా పవన్ సీఎం అవ్వడం జరిగే పని కాదు. అయినా కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేటంత చిన్న పార్టీలో మానసికంగా ఇమడలేకపోతున్నాను. పార్టీకే కాదు రాజకీయాలకే గుడ్ బై”, అన్నాడు మరొక జనసైనికుడు.
“జగన్ అంటే నాకు ఇష్టం లేదు. కానీ ఈమధ్యన రాజకీయ నాయకుడిగా అతనంటే గౌరవం కలుగుతోంది. ఎందుకంటే ముందునుంచీ సోలోగా పోరాడుతున్నాడు. పొత్తులు పెట్టుకోలేదు. అలాంటివాడి వెనుకే జనం ఉంటున్నారేమో అనిపిస్తోంది. మా పవన్ లో ఆ హీరోయిజం లేదు. అది నాకు నచ్చట్లేదు. అందుకే జనసేనలో ఇమడలేను”, అని చెప్పాడు మరొక జనసైనికుడు.
లోపాయికారిగా కదిలిస్తే దాదాపు ప్రతి జనసైనికుడు ఇలానే మాట్లాడుతున్న పరిస్థితి.
పాలకుండలో సత్తిబాబు అనే టీ వ్యాపారి. పవన్ మీద అభిమానంతో వ్యాపారం మానేసి జనసేనలో చేరాడు. పవన్ కూడా అతనిని ఎప్పట్టికప్పుడు పొగిడేవాడు. కానీ పొత్తులో ఆ స్థానం తెదేపాకి చెందిన నిమ్మకాయ జయకృష్ణకి దక్కడంతో సత్తిబాబు భంగపడ్డాడు. పార్టీని వదిలేసి మళ్లీ టీ వ్యాపారం చేసుకోవడానికి వెనుదిరిగాడు.
పీతల మూర్తి యాదవ్ అని విశాఖ జనసేన నాయకుడు. వాగ్ధాటి ఉన్నవాడు. పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనదే. అందరూ మూర్తికే సీటొస్తుందని అనుకున్నారు. కానీ వైకాపాలో భంగపడి పార్టీ మారి జనసేనలోకి చేరిన వంశీ కృష్ణ యాదవ్ అనే అతనికి సీటిచ్చేసాడు పవన్. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అన్న చందాన పవన్ చేసిన ఈ పనికి పీతల మూర్తి యాదవ్ బాధపడుతున్నాడు.
మూర్తి యాదవ్ అభిమానులంతా “మా సపోర్ట్ పవన్ కే తప్ప ఆయన నిలబెట్టిన ఈ వ్యక్తికి కాదు” అంటున్నారు. అంటే రిబెల్ అయ్యారన్నమాట. కానీ పీతల మూర్తి యాదవ్ మాత్రం తమ పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తన సపోర్ట్ వంశీ కృష్ణకి ఉంటుందని చెబుతున్నాడు. ఎంతవరకు నమ్మాలో తెలీదు.
పవన్ నిలబెట్టిన వ్యక్తులకి, నిలబెట్టని వ్యక్తులకి మాత్రమే కాదు… పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. పిఠాపురంలో బలమైన నాయకుడు వర్మని పక్కకు నెట్టి ఎక్కడా దిక్కులేక పవన్ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు. వర్మ మైకు ముందు పవన్ కే సపోర్ట్ అంటున్నాడు. కానీ పవన్ గెలిస్తే తానిక పిఠాపురంపై ఆధిపత్యాన్ని మర్చిపోవాలి వర్మ. కనుక పైకి మద్దతు నటిస్తూనే లోపాయికారిగా వైకాపా అభ్యర్థి గెలుపుకి పనికొచ్చే పనులు చేస్తున్నాడని వినిపిస్తోంది.
నాయకుడిగానే కాకుండా అభ్యర్థిగా కూడా దయనీయ స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. చూస్తూ చూస్తూ సొంత పార్టీని చంపేసుకుంటున్నాడు. పవన్ ని నమ్ముకుంటే జీవితం నాశనమే అనే సత్యాన్ని జనసైనికులు తెలుసుకుంటున్నారు. పార్టీ పెట్టి ఇన్నేళ్ళైనా సొంతంగా 175 – 25 స్థానాల్లో పోటీ చేయలేని బలహీన స్థితిలో తమ పార్టీ ఉన్నందుకు సిగ్గుతో కుంచించుకుపోతున్నారు.
మరో పక్క సొంత పార్టీ పెట్టుకుని ఏ పొత్తూ లేకుండా ఎన్నికల్లో పోరాడి తొలి ప్రయత్నంలో ఓడినా మలి దఫాలో దర్జాగా సీఎం కుర్చీ ఎక్కేసిన జగన్ మోహన్ రెడ్డిలోని నాయకత్వ లక్షణాలను, ధైర్యాన్ని, తెగింపుని సమీక్షించుకుంటూ ఆ నేతతో తమ పార్టీ నాయకుడిని పోల్చుకుని చిరాకుపడుతూ నిట్టూరుస్తున్నారు.
పవన్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా జీవకళ లేదు. అనుచరుల్ని ఉత్సాహపరిచే సన్నివేశం లేదు.
ఓడిపోయే యుద్ధానికి జయభేరీలు ఊదే ఓపిక లేదన్నట్టుగా కూర్చుంటున్నారు జనసైనికులు.
ఎన్నికల ముందే జనసేన పార్టీ జనసైనికుల్ని వెక్కిరిస్తున్నట్టుగా అరనవ్వు నవ్వి మంచానపడింది.
ఎన్నికలయ్యాక ఆలయాన హారతిగా జనసైనికులు భావించిన జనసేన దీపం ఆఖరి చితిమంటల్లో కలిసిపోయేలా ఉంది.