ఏపీ బీజేపీది దయనీయ స్థితి. పేరుకు బీజేపీ తప్ప, ఇప్పుడా పార్టీలో టీడీపీ వలస నేతలు అధికారం చెలాయిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీకి టీడీపీ వీర విధేయురాలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండడం గమనార్హం. అందుకే తమకు కావాల్సిన నాయకులకు సీట్లు సర్దుబాటు చేసుకుని, నిఖార్సైన బీజేపీ నేతలకు మొండి చెయ్యి చూపారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి చిలక్కు చెప్పినట్టు చెప్పినా, పట్టించుకోనప్పుడు తమకెందుకులే అని ఆ పార్టీ నిజమైన నాయకులు మౌనవ్రతంలో ఉన్నారు.
జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితర నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల జీవీఎల్ మెరుపులా అలా మెరిసి, మళ్లీ మాయమయ్యారు. జీవీఎల్‌కు విశాఖ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ కొంత మంది హడావుడి చేసినా పట్టించుకునే దిక్కులేదు.
రక్షణ నిమిత్తం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు సీట్లను సర్దుబాటు చేశారు. సీఎం రమేశ్, సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్‌రాజు, సత్యకుమార్, రోశన్న, కొత్తపల్లి గీతలతో పాటు దగ్గుబాటి పురందేశ్వరి తదితర చంద్రబాబు శ్రేయోభిలాషులకు టికెట్లు దక్కాయి. దశాబ్దాల తరబడి బీజేపీలోనే వుంటూ, పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా కష్టపడి పని చేసిన జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి, శాంతారెడ్డి తదితర నేతలెవరికీ టికెట్లు దక్కకపోవడం గమనార్హం.
ఏపీ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలను జీర్ణించుకోలేక, అలాగని పక్క పార్టీల్లోకి వెళ్లలేక మౌనాన్ని ఆశ్రయించారు. ఎవరెవరో బీజేపీలోకి చొరబడి ప్రయోజనాలు పొందుతుంటే, నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతున్నారు. ఇలాగైతే ఏపీలో బీజేపీ బాగుపడేదెట్టా? అని ప్రశ్నించుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదని వారు ఆవేదనతో అంటున్నారు. నిఖార్పైన బీజేపీ వాలకం చూస్తుంటే …అసలు వీళ్లంతా పార్టీలో ఉన్నారా? అనే అనుమానం ప్రజానీకంలో కలుగుతోంది.