ప్రకటించిన అభ్యర్థులనే వివిధ కారణాలతో పక్కన పడేస్తున్న చంద్రబాబునాయుడు… ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్న రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చేందుకు మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడిని మెచ్చుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా నరసాపురం ఎంపీ టికెట్‌నే రఘురామకు ఎలాగైనా ఇప్పించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
కొన్ని సీట్లు ఇటూఇటూ మార్చుకునేందుకు కూటమి నేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉండి సీటు బీజేపీకి, నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. ఉండి నుంచి నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మను బరిలో దింపాలని చంద్రబాబు సూచించినట్టు వార్తలొచ్చాయి.
ఒకవైపు ఉండి సిటింగ్ ఎమ్మెల్యే, సుదీర్ఘ కాలంగా పార్టీనే నమ్ముకున్న మంతెన రామరాజు గురించి చంద్రబాబునాయుడు ఏ మాత్రం ఆలోచించకపోవడం గమనార్హం. చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి. నమ్ముకున్నోళ్లను కాదని, రాజకీయ అవకాశవాదంతో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు రఘురామకృష్ణంరాజు వైపు నుంచి చూస్తే …చంద్రబాబు ప్రయత్నాలు ప్రశంసనీయం. బహుశా చంద్రబాబు ఇంతలా మరే నేత కోసం పోరాటం చేసి వుండరనే చర్చ నడుస్తోంది.
రఘురామ కోరుకున్నట్టే నరసాపురం టికెట్ ఇప్పించేందుకు చంద్రబాబు తన ప్రయత్నాల్ని తీవ్రతరం చేశారు. చంద్రబాబు ప్రతిపాదనల్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పురందేశ్వరి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ కంటే చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురందేశ్వరి పని చేస్తున్నారని ఆమెపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శ వుంది. కావున బాబు ఎస్ అంటే, పురందేశ్వరి నో అనరని బీజేపీలో ఒక అభిప్రాయం వుంది.
రఘురామ కోసం సిటింగ్ ఎమ్మెల్యేని సైతం పక్కన పెట్టడానికి బాబు సిద్ధమైనట్టే, నరసాపురం అభ్యర్థిని మార్చడానికి బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.