రెండేళ్ల క్రితం విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఆయనను పార్టీ పిలిపించుకుని వేరే జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అది లగాయితూ ఆయన మళ్లీ విశాఖ వైపు చూడలేదు. ఈ ఊసు ఎత్తలేదు. తాజాగా ఆయన ఒక టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ తాను విశాఖ నుంచి వెళ్లిపోవడానికి టీడీపీతో పాటు సొంత పార్టీ నేతలు కొందరు చేతులు కలిపి చేసిన కుట్ర అని అన్నారు.
విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన కామెంట్స్ తో ఎవరు సొంత పార్టీ నేతలు టీడీపీతో చేతులు కలిపిన నేతలు ఎవరు అన్నది బిగ్ డిబేట్ గా మారిపోయింది. అంతే కాదు తాను విశాఖ నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేద్దామనుకున్నాను అని మనసులో మాటను బయటపెట్టారు. దాని కోసం తాను గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసుకున్నాను అని చెప్పారు.
విజయసాయిరెడ్డి టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ సిటీలో మేయర్ ఎన్నికల్లో కష్టపడి వైసీపీని గెలిపించారు. విశాఖలో ఫ్యాన్ గాలి జోరుగా తిరిగేలా చేశారు. విశాఖలో కరోనా టైం లో ఆయన చాలా సర్వీస్ అందించానని చెప్పుకున్నారు. విశాఖలో గల్లీ గల్లీ తనలా తిరిగిన మరో నేత లేరని కూడా అన్నారు.
అయితే తన మీద అనేక ఆరోపణలు చేసి విశాఖ నుంచి తప్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి మీద ఉత్తరాంధ్ర వైసీపీలో కొందరు సీనియర్ నేతలు అధినాయకత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు అని ఆనాడు ప్రచారం సాగింది. ఆయన ఉంటే ఇబ్బంది అనుకున్న వారు అలా చేశారు అని విజయసాయిరెడ్డి వర్గం నేతలు అప్పుడు అంటూండేవారు.
విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాక ఆయన వ్యతిరేక వర్గం బయటకు వచ్చింది. వారిలో చాలా మందికి ఎన్నికల్లో టికెట్లు మళ్లీ వచ్చాయి. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన ఒక నేత విజయసాయిరెడ్డి వర్గమే. ఇక విశాఖ సౌత్ లో వైసీపీని వీడి పోయిన వారు కూడా విజయసాయిరెడ్డి వర్గంలో ఉండేవారు.
ఇవన్నీ పక్కన పెడితే విశాఖ నుంచి ఎంపీగా చేయాలని ఉండేది అన్న కోరికను కీలక సమయంలో విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఇపుడు ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు బొత్స ఝాన్సీ లక్ష్మికి దక్కింది. ఇంతకీ విజయసాయిరెడ్డి మీద సొంత పార్టీలో కుట్ర చేసిన వారు ఎవరు అంటే ఈ రోజు విశాఖలో హవా చలాయిస్తున్న నేతలను చూస్తే జవాబు అదే దొరుకుతుంది అని అంటున్నారు.