టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తరంధ్ర టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకూ మూడు రోజుల పాటు ఇద్దరు నేతలూ ఉత్తరాంధ్రలో ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. గాజువాకలో ఈసారి చంద్రబాబు ఎన్నికల సభ జరగనుంది. ఇది ఒక విధంగా ఆసక్తికరం ప్రత్యేకం అని అంటున్నారు.
సరిగ్గా చూస్తే ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా ఉంటూ ఏపీలో ఎన్నికలను ఫేస్ చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో ప్రతీ నియోజకవర్గం తిరిగారు. ఒకటికి రెండు సార్లు ఎన్నికల సభలను నిర్వహించారు. కానీ ఆయన గాజువాక వైపు చూస్తే ఒట్టు అన్నట్లుగా వ్యవహరించారు అని నాడు చెప్పుకున్నారు.
అప్పట్లో టీడీపీ జనసేనల మధ్య పొత్తులు లేవు. పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తూంటే టీడీపీ కూడా తన పార్టీ అభ్యర్ధిని నిలబెట్టింది. తమ అభ్యర్ధిని గెలిపించాలంటూ చంద్రబాబు పార్టీ అధినేతగా గాజువాకలో అడుగుపెట్టలేదు. దాంతోనే చాలా మందికి ఆనాడు డౌట్లు వచ్చాయి. పవన్ కోసం లోపాయి కారీ ఒప్పందంలో భాగంగానే ఇలా బాబు వ్యవహరించారా అన్న ప్రచారం కూడా సాగింది. వైసీపీ అయితే ఇదే అంశాన్ని పట్టుకుని విమర్శలు చేసింది.
కాలం అలా తిరిగి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎన్నికల ప్రచారం కోసం ఉత్తరాంధ్రలో మొదట గాజువాకనే చంద్రబాబు ఎంచుకోవడం విశేషం అంటున్నారు. ఆనాడూ ఈనాడూ టీడీపీ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావే. కానీ అప్పుడు ప్రచారం చేయని బాబు ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు. తేడా ఏమిటి అంటే ఈసారి పవన్ అక్కడ పోటీలో లేరు. అంతే కాదు జనసేన నుంచి ఎవరూ లేరు. అఫీషియల్ గా పొత్తు కుదిరింది కూడా.
అందుకే బాబు గాజువాకలో ప్రచారానికి సిద్ధపడుతున్నారని ప్రత్యర్ధి పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈసారి బాబుకు గాజువాకలో ఉక్కు కార్మికుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తామని ఘంటాపధంగా చెబుతున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని గాజువాకకు వస్తున్న బాబుని ఈ విషయంలో స్టీల్ కార్మికులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.