అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీని రెబల్ అభ్యర్థి బత్యాల చెంగల్రాయులు భయపెడుతున్నారు. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ అయిన తనను కాదని రాయచోటి నుంచి తీసుకొచ్చి సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇవ్వడాన్ని బత్యాల జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సుగవాసితో ముందే కుదుర్చుకున్న ఆర్థిక ఒప్పందంతో చంద్రబాబుకు టికెట్ ఇవ్వక అనివార్య పరిస్థితి.
ఐదేళ్లుగా రాజంపేట టీడీపీకి కాపలా ఉన్న తనను కాదని, సుగవాసికి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇటీవల బత్యాల చెంగల్రాయులు భారీ నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా నిలబడాలని బత్యాల నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన పసుపు కండువాతోనే ఇంటింటికి వెళ్లి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. జిల్లా కేంద్రం సెంటిమెంట్‌ను రగిల్చేందుకు బత్యాల ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా వైసీపీ ప్రభుత్వం చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజంపేటలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటలో కాకుండా, రాయచోటిలో జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ రాయచోటి నుంచి సుగవాసిని తీసుకొచ్చి అభ్యర్థిని చేశారంటూ బత్యాల తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సుగవాసికి ఓటు వేస్తే రాయచోటికి వెళ్లాల్సి వస్తుందని బత్యాల భయపెడుతున్నారు.
దీంతో టీడీపీకి దిక్కుతోచని స్థితి. రాజంపేటకు కాదని రాయచోటికి జిల్లా తరలించుకుపోయిన వైసీపీపై నియోజకవర్గ కేంద్రంలో కొంత కోపం వుంది. అది కాస్త బత్యాల పుణ్యమా అని టీడీపీ సొమ్ము చేసుకోలేకపోతోంది. ఎందుకంటే రాయచోటిలో జిల్లా కేంద్రం ఏర్పాటును స్వాగతించిన సుగవాసి టీడీపీ అభ్యర్థి కావడం ఆ పార్టీకి నష్టదాయకం. ప్రస్తుతం రాజంపేట రాజకీయం ఇలా సాగుతోంది.