తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లబరచడంలో చంద్రబాబునాయుడు విఫలం అయ్యారు. భాజపాకు కేటాయించిన ఆ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు ఆ సీటు తెలుగుదేశానికి కావాలి. అడిగారు.. ఇవ్వడానికి వదినమ్మ పురందేశ్వరి ఒప్పుకున్నారు. మరి అందుకు కుండమార్పిడిగా బిజెపి ఏ సీటు అడిగితే ఆ సీటు ఇవ్వాలి కదా! వీరు కోరుకున్నది వీరు అడిగినప్పుడు.. వారు కోరినది వారికి ఇవ్వాలి కదా..! అది మాత్రం కుదరదు. వాళ్లు ఏ సీటు తీసుకోవాలో కూడా చంద్రబాునాయుడు ‘డిక్టేట్’ చేస్తారు.
అనపర్తికి బదులుగా తంబళ్లపల్లె నియోజకవర్గం ఆఫర్ చేస్తున్నారు. వదినమ్మ చేసేదేం లేదు.. చక్కగా మరిదిగారు చెప్పిన డిక్టేషన్ రాసుకుని.. ‘మా అధిష్ఠానం పెద్దలకు చెప్పి ఆతర్వాత మీకు తెలియజేస్తా’ అనడం మాత్రమే. అదీ- వదిన- మరిదిల మధ్య అప్రకటిత రాజకీయ అవగాహన.
ఉండవిల్లిలో తాజా హైడ్రామా ఎపిసోడ్ లో సీట్ల పునఃపంపకాల గురించి చంద్రబాబునాయుడు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ లు వారితో బిజెపి జాతీయ నాయకులు కూడా కలిసి భేటీ అయ్యారు. ఇప్పటికే తన పార్టీకి చెందిన కోవర్టులందరికీ బిజెపిలో టికెట్లు దక్కేలా చేసుకున్నారు చంద్రబాబునాయుడు. అలాగే, తన పార్టీ వారిని జనసేనలోకి పంపించి అక్కడ వారికి టికెట్లు ఇప్పించారు.
ఇప్పుడు సీట్ల మార్పు చేర్పుల్లో కూడా మిత్ర పక్షాల అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ లేదు. అంతా తానే డిసైడ్ చేస్తున్నారు. తాను డిక్టేషన్ చెప్పినట్టుగా రాసుకోవాలి.. తాను డైరక్షన్ చేసినట్టుగా నడుచుకోవాలి- అన్నట్టుగా ఆయన వ్యవహార సరళి ఉంది.
అనపర్తి సీటును చంద్రబాబు వత్తిడి మేరకు వదులుకోవచ్చు గానీ.. దానికి బదులుగా ఏదో ఒక గెలిచే సీటును బిజెపి అడగవచ్చు. కానీ బాబు ఆ చాన్స్ ఇవ్వడం లేదు. తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాధ రెడ్డి పోటీచేస్తున్నారు. అక్కడ గెలుపు కష్టం. ఆ సీటును వారికి కట్టబెడుతున్నారు.
అలాగే రఘురామక్రిష్ణ రాజు నుంచి చంద్రబాబునాయుడుకు పెద్ద ఆబ్లిగేషన్ ఉంది. ఆయనతో బాబుకు ఏం డీల్ కుదిరిందనేది ప్రపంచానికి తెలియదు. కానీ.. ఆయనకోసం చాలా ఆరాటపడిపోతున్నారు. ఎంతగా అంటే.. పొత్తుల్లో బిజెపికి దక్కిన నరసాపురం ఎంపీ సీటును తిరిగి తెలుగుదేశానికి ఇవ్వాలట. అందుకు బదులుగా ఉండి ఎమ్మెల్యే సీటును తీసుకోవాలట.
ఇంకా తమాషా ఏంటంటే.. ఉండిలో బిజెపి ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస వర్మకే ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలట. ఆ రకంగా వారి పార్టీ నిర్ణయాలన్నిటినీ కూడా చంద్రబాబునాయుడే డిసైడ్ చేసేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి బిజెపి ఎలా స్పందిస్తుందో.. ‘బాబుకు లాభం- భాజపాకు భారం’ అన్నట్టుగా ఉన్న ఈ మిత్రబంధం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.