విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై మొదటి రోజే నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. డైలీ సీరియల్ లా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. అయితే మేకర్స్ వీటిని కొట్టిపారేశారు. తమ సినిమా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కడతారని ప్రకటించింది.
కానీ మేకర్స్ అంచనాలు నిజమవ్వలేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా థియేటర్లలోకి వచ్చి వారం గడిచింది. ఈ 7 రోజుల్లో సినిమా ఏమాత్రం పుంజుకోలేకపోయింది. అంటే మేకర్స్ ఊహించినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదన్నమాట.
నిజానికి బాక్సాఫీస్ బరిలో ఎన్నో అనుకూలతల మధ్య విడుదలైంది ఫ్యామిలీ స్టార్. టిల్లూ స్క్వేర్ తో పోటీని మినహాయిస్తే.. మరో సినిమాతో పోటీ లేదు. పైగా లాంగ్ వీకెండ్. ఉగాది, రంజాన్ పండగలు. ఇలా అన్నీ కలిసొచ్చినప్పటికీ ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో మెరవలేకపోయాడు.
ఉగాది రోజున వసూళ్ల పరంగా కూసింత పుంజుకున్న ఈ సినిమా, నిన్నటి రంజాన్ రోజున మాత్రం ఏమాత్రం బాక్సాఫీస్ పై ప్రభావం చూపించలేకపోయింది.
ఇక ఈ సినిమాకు ఉన్న ఏకైక అవకాశం ఈ వీకెండ్ మాత్రం. రేపు, ఎల్లుండి ఈ సినిమాకు వచ్చే వసూళ్లను దాదాపు క్లోజింగ్ కలెక్షన్లుగా పరిగణించవచ్చు. ఎందుకంటే, మొదటి వారం థియేటర్ల వైపు రాని ప్రేక్షకులు, రెండో వారంలో వచ్చినట్టు చరిత్రలో లేదు.
విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించాడు. తెలుగులో మృణాల్ కు ఇది తొలి ఫ్లాప్.