ఎప్పుడైతే సోనీ గ్రూప్ తో విలీన ప్రక్రియ విఫలమైందో అప్పుడే జీ గ్రూప్ లో అందరికీ భయం పట్టుకుంది. ఏ క్షణానైనా ఉద్యోగాలు ఊడతాయని ఉద్యోగులు బిక్కుబిక్కుమన్నారు. ఊహించినట్టుగానే వారం రోజుల కిందటే జీ గ్రూప్ లో లే-ఆఫ్స్ మొదలయ్యాయి. అయితే అవి అక్కడితో అయిపోలేదు. మరికొన్ని రోజుల్లో సెకెండ్ రౌండ్ ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
కాస్ట్-కటింగ్ ప్రాసెస్ లో భాగంగా గ్రూప్ లో ఉద్యోగుల సంఖ్యను 15 శాతం తగ్గించుకొని సంస్థను గాడిలో పెట్టాలని ఛైర్మన్ సుభాష్ చంద్ర భావించారు. అనుకున్నదే తడవుగా ఆఘమేఘాల మీద కొందరకు మెయిల్స్ వచ్చాయి. గత శుక్రవారం రాత్రి మెయిల్స్ పంపించి, శనివారానికి ఆఫీసుల నుంచి వెళ్లగొట్టారు.
అలా ప్రపంచవ్యాప్తంగా వందల మంది ఉద్యోగాల్ని తొలిగించిన జీ గ్రూప్.. త్వరలోనే రెండో రౌండ్ లే-ఆఫ్స్ ను మొదలుపెట్టనుందని తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వీకెండ్ మరికొంతమంది ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలా దశలవారీగా 15శాతం మంది ఉద్యోగుల్ని తగ్గించుకొని, 2024లో ఖర్చులు తగ్గించుకోవాలని జీ భావిస్తోంది.
2023 చివరి త్రైమాసికంలో విడుదల చేసిన నివేదికలోనే లే-ఆఫ్స్ పై పరోక్షంగా సంకేతాలిచ్చింది ‘జీ’. నాణ్యమైన కంటెంట్ తో పాటు ఆప్టిమైజేషన్ అనే పదం వాడింది. అప్పట్లో అది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎప్పుడైతే సౌత్-ఏషియా బిజినెస్ హెడ్ తో పాటు, టెక్నాలజీ అండ్ డేటా ప్రెసిడెంట్ రోజుల వ్యవథిలో తమ ఉద్యోగాలు వీడారో, అప్పుడు మెల్లగా మేటర్ అర్థమైంది.
ఈ ఏడాది మొదటి వారంలో, స్వయంగా కంటెంట్ హెడ్, గ్రూప్ లో అత్యంత కీలకమైన పునీత్ మిశ్రా తప్పుకోవడంతో అంతా భయపడ్డారు. అందరి భయాల్ని నిజం చేస్తూ, ఆ వెంటనే కిందస్థాయి ఉద్యోగుల్ని కూడా తొలిగించింది జీ గ్రూప్. హైదరాబాద్ ఆఫీస్ లో కూడా పదుల సంఖ్యలో ఉద్యోగులపై వేటు పడింది. మరో 2 వారాలు ఈ ‘వేటు’ ప్రక్రియ కొనసాగవచ్చని సమాచారం.