తన రాజకీయ అనుభవం అంత వయసు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పదేపదే తప్పు పట్టే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ఎన్నికల వేళ ఆయన సంక్షేమ రూట్‌లోనే ప్రయాణించడం చర్చకు తెరలేచింది. వైఎస్ జగన్ తనది సంక్షేమ బాట అని ఆచరణలో చూపించారు. ఇంత కాలం వైఎస్ జగన్ సంక్షేమ పాలనను తప్పు పడుతూ వచ్చిన చంద్రబాబు, తాజాగా ప్రధాన ప్రత్యర్థి కంటే మించి లబ్ధి కలిగిస్తానని, నమ్మాలని వేడుకోవడం విశేషం.
జగన్ సంక్షేమ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా దివాళా తీస్తాయని విమర్శించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే బతుకులు మారుస్తానంటూ విపరీతమైన హామీలివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో భారీ వరాలతో టీడీపీ మొదటి మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున అంద జేస్తారు. ఇంట్లో ఎంత మంది మహిళలు వుంటే అంతమందికి లబ్ధి కలిగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.90 వేలు అందజేస్తామని ప్రకటించారు.
తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు, అది కూడా ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకంగా 600 హామీలిచ్చారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి అందజేస్తామని గొప్పలు చెప్పారు. బాబు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెర వేరాయో ప్రజానీకాన్ని అడిగితే కథలుకథలుగా చెబుతారు. అందుకే బాబును 23 సీట్లకే పరిమితం చేశారు. జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.
జగన్, చంద్రబాబు మధ్య తేడా ఏంటంటే… విశ్వసనీయతే. చంద్రబాబుకు అధికారం ఇస్తే చెప్పింది చేయని పాలకుడిగా గుర్తింపు పొందారు. కానీ జగన్ మాత్రం మాట ప్రకారం అన్నీ అమలు చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు విశ్వసనీయ కోల్పోగా, జగన్ మాత్రం సంక్షేమ పథకాల లబ్ధిదారుల హృదయాల్లో గూడు కట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా, నమ్మకమే ప్రధాన సమస్య. ఎందుకంటే నమ్మకానికి , చంద్రబాబుకు ఎప్పుడూ పొత్తు పొసగదు.
అధికారం కోసం చంద్రబాబు ఎన్నైనా హామీలిస్తారని, చివరికి టీడీపీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగిస్తారనే టాక్ వినిపిస్తోంది. విపరీతమైన సంక్షేమ లబ్ధి కలిగిస్తానని చంద్రబాబు వరాలు కురిపిస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలు కురుక్షేత్ర సమరాన్ని తలపించనున్నాయి. ఈ ఎన్నికలు విశ్వసనీయత, వెన్నుపోటుకు మధ్య జరగనున్న పోరుగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏం జరగనుందో చూడాలి.