బాబుగారూ మీ మాట నమ్మిన వారి కష్టాలు చూస్తున్నారా?

చంద్రబాబు నాయుడు లిక్కర్ వ్యాపారం విషయంలో తన అభిప్రాయాలనుకున్న బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే ఎవ్వరూ లిక్కర్ వ్యాపారాల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎవరైనా వ్యాపారులను బెదిరించడం…

చంద్రబాబు నాయుడు లిక్కర్ వ్యాపారం విషయంలో తన అభిప్రాయాలనుకున్న బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే ఎవ్వరూ లిక్కర్ వ్యాపారాల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎవరైనా వ్యాపారులను బెదిరించడం వంటి పనులకు పాల్పడితే.. వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కేవలం అది మాత్రమే కాదు, లిక్కర్ తో పాటు ఇసుక వ్యాపారంలో ఎమ్మెల్యేలు, అధికార కూటమి పార్టీల నాయకులు జోక్యం చేసుకుంటే గనుక రాజకీయంగా పార్టీలు భ్రష్టు పట్టి పోతాయని కూడా ఆయన హెచ్చరించారు. దీనివలన ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతుందని ప్రభుత్వానికి అది చేటు చేస్తుందని ఆయన విశ్లేషించారు.

ఈ మాటలన్నీ వ్యాపారులు నమ్మారు. ఏ ఒత్తిడులూ ఉండవని అనుకున్నారు. నమ్మి, లిక్కర్ వ్యాపారం లోకి దిగిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు హెచ్చరికల నేపథ్యంలో లిక్కర్ వ్యాపారాలలో రాజకీయ జోక్యం ఉండదని ఆశపడి దరఖాస్తు చేసిన వారు, అదృష్టం వరించి లాటరీలో అవకాశం పొందిన వారు ఇప్పుడు కంగారుపడుతున్నారు. అసలు ఈ వ్యాపారాన్ని కొనసాగించగలమా లేదా అనే భయం లో గడుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వారి మీద వాటాల కోసం తీవ్రమైన ఒత్తిడి తెస్తుండగా నియోజకవర్గాలలో గందరగోళం నెలకొంటోంది.

లిక్కర్ వ్యాపార విషయంలో తొలి నుంచి కూడా అన్నీ హంసపాదులే జరుగుతున్నాయి. ఎందుకంటే లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని పూర్తి పారదర్శకంగా మార్చాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఆ విషయమే చెబుతూ వచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న లిక్కర్ దుకాణాలను ప్రైవేటు రంగంలోకి మార్చాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే విషయంలో లిక్కర్ వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు.

ఎమ్మెల్యేలు ఎవరైనా లిక్కర్ సిండికేట్లలో జోక్యం చేసుకుంటే వారి మీద కఠిన చర్యలు ఉంటాయన్నారు. అయితే దరఖాస్తుల సమయంలోనే చంద్రబాబు నాయుడు మాటలు బేఖాతరు అయ్యాయి. ఆయన సూచనలను ఆదేశాలను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలే స్వయంగా వ్యాపారులను సిండికేట్ చేయించి వారితో దరఖాస్తు చేయించడం జరిగింది. చాలాచోట్ల ఒకటి రెండు దరఖాస్తులే పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి నేపథ్యంలో తీరా లాటరీ సమయం వచ్చేసరికి దరఖాస్తు చేసిన వారికి విపరీతంగా బెదిరింపులు రావడం మొదలైంది. 20 నుంచి 30శాతం లాభాలలో వాటా ఇస్తే తప్ప వ్యాపారాలు చేసుకోనివ్వబోం అంటూ ఎమ్మెల్యేలు హెచ్చరించడం జరిగింది. లాటరీ పర్వం పూర్తయింది కానీ వాటాల దగ్గర పేచీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

చాలా నియోజకవర్గాల పరిధిలో 30 నుంచి 40 శాతం లాభాల వాటా తమకు ఇవ్వాలని లేదా ఏడాదికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారాలు అనువైన స్థలాలు, భవనాలు వారికి దొరకకుండా భవనాల యజమానులను బెదిరిస్తున్నారు. రకరకాల చికాకులు సృష్టిస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసింది.

అక్టోబరు 16వ తేదీ నుంచి అనేకచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ లైసెన్స్ జారీ చేస్తారు. సాధారణంగా 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ గడువు మూడుసార్లు పెంచినా దుకాణాలు ప్రారంభమై దాదాపు నెలరోజులవుతున్నా 489 దుకాణాలు ఇంకా ప్రొవిజనల్ లైసెన్స్ పైనే కొనసాగుతున్నాయి. వారికి రెగ్యులర్ లైసెన్సులు అందడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో వాటాల దగ్గర తగాదా రావడం మాత్రమే అని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా అధికారులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు వాటాల కోసం ఇంత ఘోరంగా చెలరేగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు సర్కారు ఎందుకు సైలెంట్ గా ఉంటోందో అనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. మరి బాబు గారు ఏం చేస్తారో చూడాలి!!

6 Replies to “బాబుగారూ మీ మాట నమ్మిన వారి కష్టాలు చూస్తున్నారా?”

  1. చాలా చొట్ల ఇలా ఉంది, అలా ఉంది అని కాదు. నిజం మాట్లాడాలి అంటె ఆ MLA ల పెర్లు రాయి.

Comments are closed.