కెవి: ఆత్మారాముడికి ఆషామాషీ నైవేద్యం పెడితే ఎలా?

మనుషులందరికీ ఒకే రకమైన చికిత్స అనేది అసంబద్ధం. తనకు ఏ మందు, ఎంత డోసులో పని చేస్తుందో ప్రతి వ్యక్తి తనకు తానుగా తెలుసుకోవలసినదే!

ఒక మనిషి ఎటువంటివాడో తెలుసు కోవాలంటే అతని అభిరుచులేమిటో – అంటే అతని మిత్రులెవరో, ఏయే పుస్తకాలు చదువుతాడో తెలుసుకుంటే చాలని పెద్దలన్నారు. అభిరుచులే కాదు, రుచులు తెలుసుకున్నా మనిషి గురించి అంచనాకు వచ్చేయవచ్చని నేను అనుకుంటాను. ఎందుకంటే మనిషి మనుగడ సాగిస్తున్నది ఈ దేహంతోనే కదా! ‘శరీర మాద్యం ఖలు’ అన్నారు సంస్కృతంలో! బుద్ధికైనా, మనసుకైనా ఆధారం దేహమే కదా! ఈ దేహానికి మనం ఏం అందిస్తే ఆ ప్రకారమే దేహమూ, బుద్ధి, మనసు రూపు దిద్దుకుంటాయి. వాటి వికాసానికి అనువైనవి నోటికి అందిస్తే అవి ఆ విధంగా రూపు దిద్దుకుంటాయి. చెత్త అందిస్తే చెత్తనే సృష్టిస్తాయి. కంప్యూటర్‌ పరంగా చెప్పాలంటే ‘గార్బేజ్‌ ఇన్‌ గార్బేజ్‌ ఔట్‌’ ! ఈ సూక్తి కంప్యూటర్‌కే కాదు, మనిషికీ వర్తిస్తుంది.

గార్బేజ్‌ అన్నానని కించపడవద్దు. ‘జంక్‌ ఫుడ్‌’ అని వాళ్లే అంటున్నారు కదా! ‘జంక్‌ ఫుడ్‌’ అంటూనే అతిప్రియంగా ఆరగిస్తున్నాం. వీధికి రెండు పిజ్జా హట్‌లు, కాఫీ డేలు వెలుస్తున్నాయి. బట్టలు మార్చుకుని అక్కడిదాకా వెళ్లడానికి బద్ధకించేవాళ్లు ఫోను కొడితే చాలు, వాళ్లే ఇంటికి పట్టుకువచ్చి పడేస్తున్నారు. ప్రముఖ గాస్ట్రో ఎంటరాజలిస్టు, ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రాలజీ చైర్మన్ డా. నాగేశ్వర రెడ్డి అక్టోబరు నెలాఖరులో ఒక పత్రికకు యింటర్వ్యూ యిస్తూ గత పదేళ్లలో ఫ్యాటీ లివర్ కేసులు జనాభాలో 5% నుంచి 35% కు పెరిగాయని, దీనికి కారణం ఫాస్ట్ ఫుడ్సే అనీ అన్నారు. ఈ పదేళ్లలో హృద్రోగాలు, మధుమేహం వంటివి 15% పెరిగితే గ్యాస్ట్రిక్ కేసులు 35% పెరిగాయట. పదేళ్ల తర్వాత 60%కు చేరినా ఆశ్చర్యం లేదన్నారాయన.

బాధాకరమైన విషయమేమిటంటే పదేళ్ల వయసు పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ కేసులు, గ్యాస్టిక్ సమస్యలు వస్తున్నాయట. ‘ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లలో ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, కృత్రిమ రంగులు ఎక్కువగా వాడడం వలన మన కడుపులో మంచి బాక్టీరియో పోయి చెడు బాక్టీరియా పెరుగుతోంది. వాటిలో వాడే నూనెలు హాని కలిగిస్తున్నాయి. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి. కొబ్బరి నూనె వంటి శాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచివి కావు. వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్ అస్సలు మంచివి కావు. కానీ మన బేకరీల్లో బిస్కట్స్, కేకులతో సహా ఎక్కువ వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌నే వాడుతున్నారు. న్యూయార్కులో ట్రాన్స్‌ఫాట్స్ ఉండే ఆహారాన్ని బ్యాన్ చేశారు. గుడుల వద్ద, బడుల వద్ద మద్యం షాపులను అనుమతించనట్లే, మన ప్రభుత్వాలు కూడా స్కూళ్ల వద్ద యీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిషేధిస్తే మన పిల్లలు రక్షింపబడతారు.’ అన్నారాయన.

ఘోరమేమిటంటే పల్లె ప్రజల్లో కూడా అల్సర్స్, ఐబిఎస్ (ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్), అజీర్తి సమస్యలు పెరిగినట్లు వాళ్ల సర్వేలో తేలిందట. ఎందుకంటే వాళ్లూ కూరగాయలు, అన్నం మానేసి చిప్స్, నూడుల్స్ మీద పడ్డారట. ఫాస్ట్ ఫుడ్ పాశ్చాత్య సంస్కృతికి నగర వాసులం మనం పూర్తిగా బానిసయలయ్యాం. మనని చూసి పల్లె ప్రజలూ అనుకరిస్తున్నారు. ఎందుకలా అవ్వాలన్నదే నా ఘోష. విదేశీయులు తింటున్నారంటే వాళ్ల కష్టాలు వాళ్లకున్నాయి. భార్యా భర్తా వందలాది మైళ్ల దూరం వెళ్లి ఆఫీసుల్లో పని చేస్తూంటారు. ఇంట్లో పెద్దవాళ్లుండి వండిపెట్టే సమిష్టి కుటుంబ వ్యవస్థ లేదు, వంటమనిషిని, పనిమనిషిని పెట్టుకునే తాహతు లేదు. పదికీ, పరక్కీ అక్కడ పనిమనుషులు దొరకరు. అందువల్ల వాళ్లు ఇటువంటి తిండి అలవాటు చేసుకోవలసి వచ్చింది. దాని దుష్ఫలితం వాళ్లు అనుభవిస్తున్నారు కూడా! అమెరికాలోని సగం జనాభా స్థూలకాయంతో బాధపడుతున్నవాళ్లే!

అది చూసి కూడా మనం వాళ్లను అనుసరిస్తున్నామంటే ఏమనుకోవాలి? వాళ్ల ఇబ్బందులు మనకు లేవే! ఇండియాలో లోకాస్ట్‌ లేబర్‌ దొరుకుతుంది. అమ్మా నాన్నలను మనతో ఉంచుకునే సంప్రదాయం ఉంది. వేలాది సంవత్సరాలుగా రూపొందిన ఆహార నియమాలు ఉన్నాయి. మన సంప్రదాయంలో ‘ఫుడ్‌ ఈజ్‌ మెడిసిన్‌’! శరీరానికి కావలసిన సమగ్ర ఆహారం తింటాం. పప్పు ద్వారా ప్రొటీన్స్‌, అన్నం ద్వారా కార్బోహైడ్రేట్స్‌, ఆకు కూరల ద్వారా మినరల్స్‌ – అన్నీ లభిస్తాయి. మన ఆహారపు టలవాట్లు కూడా మన వాతావరణానికి అనుగుణంగా ఏర్పాటయినవే! కూర ఉడికించేటప్పుడు పసుపు వేసి ఉడికించమంటారు, కంద తినేటప్పుడు బచ్చలికూర కలిపి వండమంటారు, చారులో జీలకర్ర వేయమంటారు, ధనియాలు వేయమంటారు. అన్నంలో కరివేపాకు పొడి కలుపుకు తినమంటారు. మొదట్లో ఉసిరికాయ పచ్చడి తినమంటారు.

భోజనంలో పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు, నెయ్యి – ఇన్ని ఎందుకు తినమన్నారు? మన ఆహారం సమతుల్యంగా ఉండేట్లు మనవాళ్లు జాగ్రత్త పడమన్నారు. ఫలానా పండగ నాడు ఫలానా పండు, ఫలానా పిండివంట తిని తీరాలి అని ఆచారాలలో భాగంగా పెట్టేశారు. అంటే ఆ సీజన్లో మన శరీరంలో కలిగే మార్పులను తట్టుకునేందుకు ఇలా చేయాలి అని చెప్పారన్నమాట! ఈ పద్ధతులన్నీ మనం విస్మరిస్తున్నాం. సమతుల్య ఆహారానికి గుడ్‌బై చెప్పేశాం. యువతరం పిజ్జాలు, కోక్‌ల తోనే బండి లాక్కొచ్చేస్తోంది. కాలేజీరోజుల్లో సరదాగా తిన్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఉద్యోగంలో చేరాక కూడా, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నవారు, ఈ జంక్‌ఫుడ్‌నే స్టేపుల్‌ ఫుడ్‌గా చేసుకుని ఆరోగ్యసమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 30 యేళ్లు దాటకుండానే గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నారు.

శారీరక ఆరోగ్యం చెడిపోయినప్పుడు బుద్ధి సరిగా పనిచేస్తుందా? మనసు మాట వింటుందా? ఐక్యూ, ఈక్యూ దెబ్బ తినవా? కుటుంబ సంబంధాలపై, సహచరులతో సంబంధాలపై దీని దుష్ప్రభావం పడదా? మనిషి తనకూ, కుటుంబానికి, దేశానికి పనికి వస్తాడా? హెల్దీ మైండ్‌ ఇన్‌ హెల్దీ బాడీ అని అందరకూ తెలుసు. దేహం ఒక దేవాలయం, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని తెలుసు. ఆత్మారాముడికి ఆషామాషీ నైవేద్యం పెడితే ఎలా? మంతెన సత్యనారాయణ రాజు గారంటారు – సాత్విక ఆహారం, బయోఫుడ్‌ తింటే విమానంలో వాడే రిఫైన్డ్‌ పెట్రోలు వేసిన బండిలా శరీరం దూసుకుపోతుందట. మసాలాలు, జంక్‌ ఫుడ్‌ తిన్న శరీరం కిరోసిన్‌తో నడిచే బండిలా డుక్కుడుక్కు లాడుతుందట!

ఇన్ని తెలిసి కూడా ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఎందుకు తింటున్నారు? సగం నాలుక కోసం, సగం డాక్టర్లను పోషించడానికి! వయసు పెరిగినా తిండి యావ చావనివారి పరిస్థితి మరీ ఘోరం. నిజానికి వయసు పెరిగి, యాక్టివిటీ తగ్గిన కొద్దీ శరీరం తక్కువ ఆహారంతో సరిపెట్టుకుంటుంది. కానీ ఖాళీగా ఉన్నాం కదాని ఎక్కువ తిని ఒళ్లు చెడగొట్టుకుంటాం. కంప్యూటర్‌పై పని చేసే వాళ్లయినా అంతే! వాళ్ల కళ్లకు, బుర్రకు తప్ప శరీరానికి పని ఏది? వాళ్లు మధ్య మధ్యలో కుర్చీలోంచి కాస్త లేచి నాలుగడుగులు వేశారంటే అర్థం – అటూ ఇటూ నడవడానికని కాదు, కాంటీన్‌కి వెళ్లడానికని! తెల్లవారేదాకా కంప్యూటర్‌ ముందు కూచోడం, పగలు కాగానే నిద్రపోవడం. ఇక వ్యాయామం ఎక్కడ? తిన్న తిండి అరిగేందుకు ఛాన్సెక్కడ? అందుకే అంటారు ‘ఈ దేశంలో కొన్ని వర్గాల్లో ఆకలిచావుల కంటె, తిన్నది అరక్క తెచ్చుకునే చావులే ఎక్కువ’ని!

వీరందరూ చెప్పేదొకటే! మాకు సరైన ఆహారం వండుకునే టైము లేదు, భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి వండించుకునే టైమూ లేదు, అందుకని దొరికినది తింటున్నాం అని. ఇలా చేసి, చేసి ఒన్ నాట్-సో ఫైన్ డేన డాక్టరు దగ్గరకు వెళితే, ఆయన ఒళ్లు తగ్గించకపోతే, శరీరమనే కొంప త్వరలోనే మునగబోతోందని, ఏదైనా అర్జంటుగా చేయమని చెప్తాడు. ఇక అప్పణ్నుంచి ఎవేర్‌నెస్ కాదు, ఆదుర్దా ప్రారంభమౌతుంది. వ్యాయామాలు చేసి తగ్గించుకోవడమనే రెగ్యులర్ దారి నచ్చక, రాత్రికి రాత్రి బరువు తగ్గే అడ్డ దారి కోసం వెతకనారంభిస్తారు. తినే ఆహారంలో ఫలానా మార్పులు చేయమని, ఆహారపు వేళలు మార్చమని, అలా ఐతే కొన్ని వారాల్లోనే అద్భుత ఫలితాలు సంభవిస్తాయని వాట్సప్‌ల ద్వారా అనేక సూచనలు వస్తూంటాయి. కొందరు వీడియోలు కూడా చేసి పెడుతూంటారు. మరి కొందరు తాము అలా చేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నామని, బరువు తగ్గించు కున్నామని చెప్తారు. దాంతో ఫస్టాఫ్ అంతా అతివృష్టి, భుక్తాయాసం, సెకండ్ హాఫ్ అంతా అనావృష్టి, నీరసం!

‘ఈ సిద్ధాంతాల్లో ఏది నమ్మాలి? ఎంతవరకు నమ్మాలి? నిజంగా అవి గుణాన్ని యిస్తాయా?’ అని నన్ను ఎందరో అడుగుతారు. ‘జీవనసరళిని (లైఫ్‌ స్టయిల్‌) మార్చుకుని, మితంగా మనదైన సాత్వికమైన ఆహారమే ఎప్పుడూ తింటే మంచిది కదా’ అని చెప్తే వారికి నచ్చదు. ఫలానా విధంగా చేస్తే ఫలితాలు ఖచ్చితం అని బల్ల గుద్ది చెప్పేవారిని డేటా గురించి అడిగితే ‘వందలాది మంది నా సలహా విని బాగుపడ్డార’ని చెప్తారు. వేల మందికి అది దుష్ఫలితం యిచ్చిందేమో వీరికి తెలియదు. ఎందుకంటే వారు వచ్చి వీరికి చెప్పరు. మామూలుగా మనం కూడా అంతే కదా, ఎవరైనా డాక్టరు యిచ్చిన మందు పని చేయకపోతే ఆయన దగ్గరకి వెళ్లి ఫిర్యాదు చేయం. వేరే డాక్టరు దగ్గరకి వెళ్ళిపోతాం. లేదా వేరే వైద్యవిధానానికి మారిపోతాం. అందువలన మా విధానం కరక్టని చెప్పేవారు కూడా అబద్ధం చెప్తున్నారని అనలేము. వారి వద్ద ఉన్న పరిమితమైన డేటాతో చెప్తున్నారనే అనాలి.

ఏ విధానమైనా సరే, ఏ ఔషధమైనా సరే నిరూపించబడడానికి కొంత సమయం పడుతుంది. వివిధ వర్గాల రోగులపై విస్తృతమైన పరిశోధనలు జరపవలసి వుంటుంది. మా ఫార్మా రంగంలో ఏదైనా కొత్త మందు ప్రవేశపెట్టినపుడు మొదట జంతువులపై ప్రయోగాలు చేసి, తర్వాత మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి చూస్తారు. అది కూడా రకరకాల వయసుల వారిని, వృత్తుల వారిని, రోగతీవ్రతలో వైవిధ్యం వున్నవారిని తీసుకుని పరీక్షలు జరుపుతారు. ఇస్తున్న మందు గురించి కొన్ని సందర్భాల్లో రోగికి చెప్పరు, కొన్ని సందర్భాల్లో డాక్టరుకూ చెప్పరు. ఇంత ప్రయాస పడి, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ నుంచి అనుమతులు తెచ్చుకుని మార్కెట్‌ చేసిన తర్వాత కూడా పోస్ట్‌`మార్కెటింగ్‌ సర్వియలెన్స్‌ స్టడీస్‌ జరుపుతారు. అవసరమైతే ఔషధాన్ని వెనక్కి తీసుకుని, మళ్లీ ప్రయోగాలు జరిపిస్తారు. ఇటువంటి రంగం నుంచి వచ్చిన నేను దేన్నీ గుడ్డిగా ఆమోదించ లేను. అనేక ప్రశ్నలు వేసుకుంటాను, వేస్తాను.

నేను సైన్సు, ఇంజనీరింగు విద్యార్థిని. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో సైంటిస్టును. దేన్నయినా సరే గుడ్డిగా అనుసరించకుండా, అలా అని మొండిగా కొట్టి పారేయకుండా ప్రయోగించి చూడడం నా కలవాటు. ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి.. యిలా అన్నీ నేనే నాపై ప్రయోగించి చూసుకుంటూంటాను. నాకు నప్పినది, నచ్చినది అనుసరిస్తాను, కొనసాగిస్తాను. సిసిఎంబి వ్యవస్థాపకులు కీ.శే. డా. పి.ఎం. భార్గవ గారు నాకు ఆత్మీయులు, వారిపై అత్యంత గౌరవభావం ఉంది. ఆయన హోమియోపతి అశాస్త్రీయం అని వాదించేవారు. కానీ ఫలితాల నిస్తోంది కదాని నేను అనేవాణ్ని.

ఇలా నా దృష్టికి వచ్చిన విధానాలను ప్రయోగించి, ఫలితాలు గమనించి, ఆ ఫలితాల పరిమితులు గుర్తించి, ఒక శాస్త్రవేత్త తరహాలో బేరీజు వేస్తూ ఉంటాను. మందులతో నా చక్కెర వ్యాధి మేనేజ్‌మెంట్‌ సాధ్యం కావటం లేదు. మందు డోసు పెంచుకుంటూ పోవాల్సి వస్తోంది. ‘ఇది మందు వేసుకుంటే తగ్గే రోగం కాదు, శారీరకమైన ఒక డిజార్డర్‌, ఒక అపశ్రుతి. దాన్ని సవరించడానికి ఆహారం తీసుకునే విధానంలో మార్పు తీసుకు రావాలి.’ అనే భావనతో నేను కొన్ని ప్రయోగాలు చేశాను. అవన్నీ నేను పబ్లిగ్గా చెప్పదలచుకోలేదు. ఎందుకంటే వెంటనే కొందరు దాన్ని అవలంబించడం ప్రారంభించవచ్చు. కొందరికి మంచి చేయవచ్చు, కొందరికి వికటించవచ్చు.

మన శరీరంలో ముందు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్‌ ఉన్నాయి. తరతరాలుగా మన శరీరం ఒక రకమైన ఆహారానికి, ఒక రకమైన భోజనవేళకు అలవాటు పడి ఉంది. ఇప్పుడెవరో వచ్చి యితర ప్రాంతాల్లోనో, యితర దేశాల్లోనో పండే ధాన్యాన్నో, నూనెనో వాడితే మంచిది. రోజు మొత్తంలో ఒక్క గంట మాత్రం తిని మిగతా గంటల్లో ఉపవాసం ఉంటే రెండు, మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గిపోతారని, బిపి షుగర్‌ మందులు విసిరి అవతల పడేయవచ్చు అని చెప్తే, ఎగిరి గంతేసి వెంటనే మొదలు పెట్టేస్తారు. ఇలా చేయకూడదు. కదిలే రైలు నుంచి ప్లాట్‌ఫారంపైకి దిగేటప్పుడు కాస్త రైలు వెంట పరుగు పెట్టి క్రమేపీ మందగిస్తూ అప్పుడు ఆగాలి. ఒకేసారి నిల్చిపోదామని చూస్తే పడిపోతాం.

అలాగే ఆహారవిధానం కూడా ఒకదాని నుంచి మరొక దానికి మారేటప్పుడు క్రమేపీ, కొద్దికొద్దిగా మారాలి తప్ప ఒకేసారి మందులు మానేయడమో, తిండి మార్చేయడమో చేస్తే శరీరం ఎడ్జస్టు కాదు, యిబ్బంది పడుతుంది. రెండు, మూడు నెలల్లోనే అద్భుతాలు జరిగిపోతాయని, ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉండవచ్చని అనుకోవడం అత్యాశకు పరాకాష్ఠ. ఎందుకంటే ఆ విధానం, ఆ ఆహారం ఏ వయసు వారికి అనువైనదో, ఏ వ్యాధిగ్రస్తుడు దాని జోలికి పోకూడదో, ఎన్ని రోజులకు మించి చేయకూడదో మనకు పూర్తి సమాచారం ఉండదు. ప్రయోగం చేసి చూద్దాం అంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు కాకూడదు. పైగా ఆహారపు తీరులో యీ మార్పులు, వాటి వలన శారీరకంగా జరుగుతున్న మార్పులు, పెరామీటర్స్‌లో హెచ్చుతగ్గులు… యివన్నీ రోగి నిరంతరం గమనించుకోవాలి. ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి.

కొన్ని శారీరక రుగ్మతల చికిత్స కోసం ప్రకృతి వైద్యాలయాలకో, ఆయుర్వేద శాలలకో వెళ్లినపుడు వాళ్లు ఆహారవిధానాల్లో మార్పులు చేస్తారు. అది స్వల్పకాలమే. పైగా వైద్యులు నిరంతరం నిఘా వేసి చూస్తూ, అవసరమైతే ఆ మార్పులకు సవరణలు చేస్తారు. ఆ ఏర్పాట్లు ఏమీ లేకుండా, మనంతట మనం ప్రయోగాలకు దిగితే శరీరానికి సరిదిద్దుకోలేని డ్యామేజి జరిగే ప్రమాదం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త! ‘మనిషి మనిషికి తేడా ఉంది, తేడాలోనే ఒక పోలిక ఉంది’ అని ఒక సినిమా పాట ఉంది. ఆ పోలికను సరాసరిగా తీసుకుని వైద్యుడు మందు యిస్తాడు. కానీ ఆ తేడా కారణంగా అది కొందరికి పని చేయదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనకు ప్రత్యేకమైన శారీరక పరిస్థితి ఉంటుంది. వర్షంలో తడిసిన వాళ్లందరికీ జలుబు రాదు. పెన్సిలిన్‌ యింజక్షన్‌ యిచ్చిన ప్రతి వ్యక్తికి రియాక్షన్‌ రాదు.

వ్యక్తి శరీరమే కాదు, మానసిక స్థితిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వారిదే! హోమియోపతి వ్యక్తులను వర్గీకరించి, మందులు యిమ్మంటుంది. అలోపతి ఔషధాల్లో కూడా కొన్ని కొందరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ యిస్తాయి, కొందరికి యివ్వవు. ఫలితాలలో కూడా హెచ్చుతగ్గులు కనబడతాయి. అవి చూసుకునే వైద్యుడు మందులు మారుస్తూ, చికిత్స చేస్తాడు. ఇలాటి పరిస్థితుల్లో ఏ పరిశోధనా జరపకుండా, ఏ పరీక్షా జరపకుండా ఏ రకమైన డైట్‌ ఐనా సర్వరోగనివారిణి అవుతుందనుకోవడం కేవలం భ్రమ.

2024 సెప్టెంబరులో హైదరాబాదులో జరిగిన జీనోమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాపులో డా. సోమరాజు వంటి కార్డియాలజిస్టులు, యితర వైద్యులు మాట్లాడుతూ మనిషి మనిషికీ జన్యుపరంగా తేడా ఉంటుందని, ఆ ప్రకారమే మందులు అవసరం ఉంటుందని అన్నారు. ఆ తేడా గుర్తించకపోవడం వలన కొందరికి మందులు సరిగా పని చేస్తే, మరి కొందరికి పని చేయటం లేదని, యింకొందరికి దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయని అన్నారు. అపోలో స్పెక్ట్రా చైర్మన్‌ డా. ప్రసాదరావు మాట్లాడుతూ డాక్టర్లు రాసిచ్చే మందుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పని చేయడం లేదన్నారు. అందుకే జన్యుపరీక్షలు అవసరమన్నారు. జన్యుపరీక్ష చేస్తే రోగికి మందు అవసరం ఉందో లేదో, ఉంటే ఏ డోసులో వాడాలో స్పష్టత వస్తుందని డాక్టర్లందరూ అంగీకరించారు.

అందువలన నేననేదేమిటంటే – మనుషులందరికీ ఒకే రకమైన చికిత్స అనేది అసంబద్ధం. తనకు ఏ మందు, ఎంత డోసులో పని చేస్తుందో ప్రతి వ్యక్తి తనకు తానుగా తెలుసుకోవలసినదే! దానికి గాను ప్రయోగాలు చేయవలసినదే, పరీక్షలకు గురి కావలసినదే! చికిత్స అవసరమే పడకుండా ఉండాలంటే ఆహారవిహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనవి కాని ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి. చిన్నప్పుడు మామూలు తిండి తిని, పెద్ద వయసు వచ్చాక వీటికి అలవాటు పడిన వాళ్లే ఉదర సమస్యలతో బాధపడుతున్నరు. ఇక చిన్నప్పటి నుంచే వీటికి అలవాటు పడుతున్న వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తోంది.

– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)

16 Replies to “కెవి: ఆత్మారాముడికి ఆషామాషీ నైవేద్యం పెడితే ఎలా?”

  1. డాక్టర్ లు, తమ దగ్గరకి వచ్చే రోగికి నోరు తెరిచి ప్రశ్న లు అడగటానికి కూడా టైమ్ ఇవ్వడం లేదు, అంత ఫీస్ కట్టిన సరే.

    మీరు చెప్పిన రోగిని పరీక్షించే మందులు మార్చడం లాంటి పనులు చేయరు సర్.

  2. పిజ్జా, బర్గర్లు వచ్చిన కొత్తలో ఒక్కసారి మాత్రమే రుచి చూసి వదిలేశాం. టేస్ట్ నచ్చలేదు. ఇహ దాని జోలికి పోలేదు.

  3. As a frequent traveller I can tell you Indian food is less nutritious and full of carbohydrates and Pizza burger pasta are junk food but have more nutrients then Idly dosa biryani and mudda pappu charu avakaya

  4. చాలా చాలా చాలా మంచి ఆర్టికల్ సార్..మేం thirty plus లో ఉండి..మన పెసరట్టు full ప్రోటీన్ ఉంటుంది మన దిబ్బరొట్టి మంచిది అని చెప్తే aunty s.uncles.over thinking అని ఎక్కిరిస్తున్నారు..మీలాంటి వరైన ఇలా negotiate తీసుకుని మంచి గా చెప్పండి సార్ కొద్దిమంద్యనా మరతరేమో..ఇక్కడ ఒక డాక్టారమ్మ చెప్పారు అన్నం సారం పడక పోతే నిర్వీర్యం అయిపోతారని. మీలాంటి వాల్లే లాజికల్ గా చెప్పాలి ..

  5. చాలా మంచి ఆర్టికల్ సార్…మీలాంటి వాళ్ళు చెప్పడం వాళ్లా కొద్ది మందికైన అర్థం అవుతుందేమో..

  6. గుడ్ వన్. అంతే కాకుండా ఇప్పటి యువత ఉద్యోగ రీత్యా, ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లడం మూలంగా అక్కడి వాతావరణం, ఆహారం మన శరీరానికి మేలు కాకుండా కీడు చేస్తుంది. ఆయా దేశాల్లో ఉపయోగించే స్టాటిస్టికల్ యావరేజెస్ మన ఇండియన్స్ కి సరిపోవు, 90 ఏళ్ళు బ్రతికిన మన పూర్వీకుల లా కాకుండా మనం 70 ఏళ్లకే తనువు చలించే ప్రమాదం లో వున్నాం.

Comments are closed.