ప‌వ‌న్ చిత్త‌శుద్ధికి సీబీఐ ప‌రీక్ష‌

ఒక‌వేళ సుగాలి ప్రీతి కేసు విష‌యంలో ప‌వ‌న్ చొర‌వ తీసుకోక‌పోతే, ఆయ‌న మాట‌ల మ‌నిషే త‌ప్ప‌, చేత‌లేమీ ఉండ‌వ‌నే మ‌చ్చ ప‌డుతుంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్త‌శుద్ధికి సీబీఐ ప‌రీక్ష పెట్టింది. సుగాలి ప్రీతి కేసు గురించి ఎన్నోసార్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు హ‌యాంలో సుగాలి ప్రీతి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందగా, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. తాము అధికారంలోకి వ‌స్తే, 100 రోజుల్లోనే సుగాలి ప్రీతి కుటుబానికి న్యాయం చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనేక సంద‌ర్భాల్లో గొప్ప‌లు చెప్పుకున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత డిప్యూటీ సీఎంను ప్రీతి త‌ల్లిదండ్రులు క‌లిశారు. త‌మ కూతురి కేసును త్వ‌ర‌గా తేల్చాల‌ని విన్న‌వించారు. అయితే జ‌గ‌న్ హ‌యాంలో ప్రీతి కేసు దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాశారు. తాజాగా సీబీఐ చావు క‌బురు చ‌ల్ల‌గా న్యాయ‌స్థానానికి చెప్పింది. ఈ కేసును తాము ద‌ర్యాప్తు చేయాల్సినంత క‌ష్ట‌త‌ర‌మైంది కాద‌ని, పైగా త‌మ ద‌గ్గ‌ర త‌గిన‌న్ని నిధులు కూడా లేవ‌ని హైకోర్టులో సీబీఐ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

దీంతో సుగాలి ప్రీతి కేసు మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్టైంది. క‌ర్నూలు న‌గ‌ర శివార్ల‌లోని రెసిడెన్సియ‌ల్ స్కూల్ హాస్ట‌ల్‌లో వుంటూ సుగాలి ప్రీతి టెన్త్‌ చ‌దువుకునేది. 2017, ఆగ‌స్టు 19న అనుమానాస్ప‌ద స్థితిలో సుగాలి ప్రీతి మృతి చెందింది. నాడు చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కేసులో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌ని లేఖ రాయ‌గా, నింపాదిగా విచారించ‌లేమ‌ని ఇప్పుడు కోర్టుకు తెల‌ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ శ‌క్తివంచ‌న లేకుండా ప‌నిచేశారు. ఇప్పుడు తాను ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా వుండ‌డంతో పాటు కేంద్రంలో ప‌లుకుబ‌డి క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఈ నేప‌థ్యంలో కేసు ద‌ర్యాప్తున‌కు సీబీఐ వెనుకంజ వేయ‌డం అంటే, ప‌వ‌న్ చిత్త‌శుద్ధికి ప‌రీక్ష పెట్ట‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో సుగాలి ప్రీతి కేసుపై ప‌వ‌న్ స్పంద‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక‌వేళ సుగాలి ప్రీతి కేసు విష‌యంలో ప‌వ‌న్ చొర‌వ తీసుకోక‌పోతే, ఆయ‌న మాట‌ల మ‌నిషే త‌ప్ప‌, చేత‌లేమీ ఉండ‌వ‌నే మ‌చ్చ ప‌డుతుంది.

8 Replies to “ప‌వ‌న్ చిత్త‌శుద్ధికి సీబీఐ ప‌రీక్ష‌”

  1. 2017 లో అంటే పట్టాలు వెయ్యలేదు, ఇప్పుడు కేంద్రం తో చెప్పి AP సం -పద సృష్టి లో భాగంగా నేరస్తుల గుండెల్లో పట్టాలు వేయించారు. ఇంక రైళ్లు పరిగెత్తడమే తరువాయి.ఒకటి గాలి పట్టా ఇంకోటి పసుపు పట్టా. చూస్కో నా రాజా.

    1. గాలి పసుపు పట్టా ఒకసారి ఫ్యాన్ గుండెలో దూసుకుపోయింది….ఆల్రెడీ చూసేసాం రాజా

      1. ఫ్యాన్ గుండెల్లో కాదు, జనం గుండెలు చిల్చి వున్న కాస్త రక్తాన్ని తాగిన చంద్రముఖి గవర్నమెంట్ ఇది

Comments are closed.