జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయించలేదు. ఇంతకాలం జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్‌గా పేర్కొనడం గమనార్హం. జనసేన పార్టీ కేవలం రిజస్టర్డ్ పార్టీ కావడం వల్లే గాజు గ్లాస్‌ను ఆ పార్టీకి కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఏది ఏమైనా గాజు గ్లాస్ పగిలింది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ, అలాగే గుర్తింపు లేని పార్టీల జాబితాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, అలాగే టీడీపీ, వైసీపీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తిస్తూ ఈసీ గెజిట్‌లో పేర్కొంది. ఇదే సందర్భంలో జనసేనను రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించింది.
పార్టీల గుర్తులను కూడా ఇందులో ఈసీ స్పష్టంగా పేర్కొంది. వైసీపీకి ప్యాన్, టీడీపీకి సైకిల్ గుర్తుల్ని కేటాయించింది. అయితే జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా పేర్కొనడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఎన్నికల్లో ఫ్రీ సింబల్‌గా గ్లాస్ గుర్తును ఉంచింది.
దీంతో నిబంధనల ప్రకారం ఆ గుర్తును కోరుకున్న వారికి కేటాయించే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన జాతీయ స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి, తిరిగి గాజు గ్లాస్ గుర్తును దక్కించుకుంటారనే నమ్మకంతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అంత వరకూ టెన్షన్ మాత్రం తప్పదు. చూడాలి ఏమవుతుందో!