తునిలో నాలుగోసారైనా ఎన్నిక జ‌రిగేనా?

కాకినాడ జిల్లా తుని మున్సిపాల్టీలో వైస్ చైర్మ‌న్ ఎన్నిక అత్యంత ఉత్కంఠ‌త‌ను త‌ల‌పిస్తోంది.

కాకినాడ జిల్లా తుని మున్సిపాల్టీలో వైస్ చైర్మ‌న్ ఎన్నిక అత్యంత ఉత్కంఠ‌త‌ను త‌ల‌పిస్తోంది. ఇప్ప‌టికే మూడుసార్లు వైస్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. టీడీపీకి తుని మున్సిపాల్టీలో బ‌లం లేక‌పోయిన‌ప్ప‌టికీ, దౌర్జ‌న్యం, బెదిరింపుల‌తో వైస్ చైర్మ‌న్ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో వుంది.

సోమ‌వారం తునిలో వైస్ చైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడికి ప్ర‌య‌త్నించాయి. కోరం లేక‌పోవ‌డంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా ప‌డింది.

తుని మున్సిపాల్టీలో మొత్తం 30 వార్డులున్నాయి. వీటిలో ఒక వార్డు స‌భ్యుడు మృతి చెంద‌గా, 29 మంది ఉన్నారు. వీరిలో 10 మంది టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌స్తుతానికి వైసీపీకి 17 మంది స‌భ్యుల బ‌లం వుంది. ఇప్ప‌టికే మూడుసార్లు వైస్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా ప‌డిన నేప‌థ్యంలో నాలుగోసారైనా స‌జావుగా సాగుతుందా? లేదా? అనే టెన్ష‌న్ నెల‌కుంది.

కాకినాడ క‌లెక్ట‌ర్‌తో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫోన్‌లో మాట్లాడారు. త‌మ వాళ్ల‌ను ఎన్నికలో ఓటు హ‌క్కు స‌జావుగా వినియోగించుకునేలా చూడాల‌ని కోరారు. బ‌స్సు పంపుతామ‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ, ఇంత వ‌ర‌కూ రాలేద‌ని మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ సుధారాణి తెలిపారు. అయితే మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఇంటిచుట్టూ భారీ సంఖ్య‌లో టీడీపీ రౌడీలు ఉన్నార‌ని చైర్‌ప‌ర్స‌న్ ఆరోపించారు. ఓటింగ్‌కు వెళ్లాలంటే భ‌యంగా వుంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌పై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

2 Replies to “తునిలో నాలుగోసారైనా ఎన్నిక జ‌రిగేనా?”

Comments are closed.