జనసేనాని పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండడంతో సహజంగానే ముద్రగడ అక్కడ వాలిపోయారు. ఆయనకు వైసీపీ కీలక బాధ్యతలు కూడా అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ముద్రగడ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పవన్‌కు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశంలో ముద్రగడ ప్రసంగిస్తూ పవన్‌కల్యాణ్‌కు మద్దతు ఇవ్వాలనే వారికో ప్రశ్న… అసలు ఎందుకు ఇవ్వాలి అని ఆయన అడిగారు. తనను చంద్రబాబు వేధించినప్పుడు పవన్‌కల్యాణ్ ఎక్కడున్నారని నిలదీశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదంటున్న పవన్‌కల్యాణ్‌కు తనకు వయసై పోయిందని చెప్పానని వ్యంగ్యంగా అన్నారు. పవన్‌కల్యాణ్ తెరచాటు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు. దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి తనను విమర్శించాలని పవన్‌కు ముద్రగడ మరోసారి సవాల్ విసిరారు. పవన్ వల్లే చంద్రబాబుకు గ్రాఫ్ పెరిగిందని, అందుకే 80 అసెంబ్లీ సీట్లు, అలాగే పవర్ షేరింగ్ అడగాలని పవన్‌కు సూచించినట్టు ముద్రగడ తెలిపారు.
దయచేసి కాపు యువతతో ఆడుకోవద్దని పవన్‌కు ముద్రగడ సూచించారు. కాపు యువత నాశనం అవుతున్నారని వాపోయారు. ప్రజాసేవ అనే మాటే పవన్ నోటి నుంచి రావడం లేదన్నారు. తన బద్ధ శత్రువైన చంద్రబాబుతో వెళుతూ, రమ్మని తనను పిలిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.