ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణకు టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. అనపర్తి టీడీపీ అభ్యర్థిగా మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే అనపర్తి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో అనపర్తి సీటు బీజేపీకి వెళ్లింది.
అనపర్తి బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణ పేరు ఖరారైంది. మరోవైపు తనకు సీటు ఖరారు చేసిన తర్వాత బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పది రోజులుగా న్యాయం కోసం నల్లమిల్లి అంటూ నియోజకవర్గం వ్యాప్తంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి వినాయక గుడిలో పూజలు చేసి ప్రచారాన్ని ఇవాళ ప్రారంభించారు.
శివరామకృష్ణ తన మెడలో బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ కండువా వేసుకున్నారు. అలాగే బీజేపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు పట్టుకున్నారు. ఇది చూసి టీడీపీ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థితో పాటు కార్యకర్తల్ని అడ్డుకున్నారు. బీజేపీ అభ్యర్థి మెడలో నుంచి టీడీపీ కండువా తీసేయించారు. అలాగే టీడీపీ జెండాలను వారి నుంచి లాక్కున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ కండువాలు వేసుకోవద్దని, అలాగే జెండాలు పట్టుకోవద్దని హెచ్చరించారు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వకపోతే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల అడ్డగింతతో బీజేపీ అభ్యర్థితో పాటు వెంట ఉన్న కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఈ విషయమై తమ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.