Advertisement

Advertisement


Home > Movies - Reviews

Geethanjali Malli Vachindi Review: మూవీ రివ్యూ: గీతాంజలి మళ్లీ వచ్చింది

Geethanjali Malli Vachindi Review: మూవీ రివ్యూ: గీతాంజలి మళ్లీ వచ్చింది

చిత్రం: గీతాంజలి మళ్లీ వచ్చింది
రేటింగ్: 2.25/5
తారాగణం: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, సునీల్, ఆలి, రవి శంకర్, రాహుల్ మహదేవ్ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కెమెరా: సుజాత సిద్ధార్థ
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: ఎం.వి.వి సత్యనారాయణ
దర్శకత్వం: శివ తుర్లపాటి
విడుదల: 11 ఏప్రిల్ 2024 

2014లో వచ్చిన అంజలి, శ్రీనివాస్ రెడ్డి కాంబినెషన్‌లో వచ్చిన "గీతాంజలి" ఏవరేజ్ టాక్ తో మొదలయ్యి హిట్టయ్యింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీం తో ఈ చిత్రం వచ్చింది. హారర్ సినిమాలంటే ఒక సెట్- ప్యాటర్న్ లో ఉంటుంటాయి. అదే ప్యాటర్న్ ఇందులో కూడా ఉందా..లేక ఏదైనా వెరైటీ తోడయ్యిందా అనేది చూదాం. 

కథలోకి వెళ్తే.. శ్రీనివాస్ (శ్రీనివాస్ రెడ్డి) ఒక ఫెయిలైన సినీ దర్శకుడు. అతని టీంలో ఇద్దరు రచయితలు ఆత్రేయ (సత్యం రాజేష్), ఆరుద్ర (షకలక శంకర్). ఈ శ్రీనివాస్ కి అనుకోకుండా ఒక పెద్ద వ్యాపారవేత్త విష్ణు (రాహుల్ మహదేవ్) నుంచి సినిమా తీయమని ఫోనొస్తుంది. తాను, తన రచయితలు, హీరో అవ్వాలని కలలుగనే అతని ఫ్రెండ్ ఆయాన్ (సత్య) కలిసి ఊటీకి వెళ్తారు. అక్కడ విష్ణు సిఫార్సుతో అంజలి (అంజలి) అనే అమ్మాయిని హీరోయిన్ గా ఒప్పించి పెట్టుకుంటారు శ్రీనివాస్ రెడ్డి అండ్ టీం. ఇంతకీ సినిమా షూటింగ్ ఒక భూత్ బంగ్లాలో. అందులో దెయ్యాలుంటాయి. వాటితో వీళ్లు ఏ ఇబ్బందులు పడతారు? ఈ సినిమా అవకాశం ఇవ్వడంలో విష్ణుకి హిడెన్ అజెండా ఏమిటి? ఇందులోని కథానాయిక అంజలి, పాత గీతాంజలి కథకి లింకేంటి అనేది కథ. 

సినిమాకి కథ ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ రాసుకున్నదల్లా తెర మీదకి ఆసక్తికరంగా ఎక్కేయదు. దానికి చాలా కసరత్తు చెయ్యాలి. మెయిన్ కాన్సెప్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెడితే తక్కిన భాగం ఆటోమేటిక్ గా పాసైపోదు. దాని మీద కూడా తగిన శ్రద్ధ పెట్టాలి. ఏ సీన్ వర్కౌటవ్వదో, ఏ డైలాగ్ పేలదో, ఏ నటీనటులు ఆశించిన ఔట్ పుట్ ఇవ్వట్లేదో అనేవన్నీ పరిశీలించుకోవాలి. అవేమీ చూసుకోకుండా ప్రధామార్ధాన్ని తెరకెక్కించేసారు. 

ఇందులో సునీల్ డైలాగ్ ఒకటుంది- "ఈ రోజుల్లో కథ ఎవడు అడుగుతున్నాడు, కాన్సెప్ట్ బాగుంటే చూసేస్తున్నారు" అని. బహుశా అదే ఓవర్ కాంఫిడెన్స్ తో ఈ సినిమా కథ- కథనం మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా కాన్సెప్ట్ ని నమ్ముకుని తీసిపారేసినట్టుంది. 

నిజానికి కాన్సెప్ట్ బాగుంది ఇందులో.. దెయ్యాలతో షూటింగ్ అనేది నిజంగా మునుపెన్నడూ చూడని వెరైటీ కామెడీ కాన్సెప్ట్. ఆ ఎపిసోడ్ వరకు పర్ఫక్ట్ గా నవ్వించగలిగారు. ఆ 20 నిమిషాలు తప్ప తక్కిన రెండు గంటల సినిమా మాత్రం నీరసంగా ఉంది. కొని చోట్ల షార్ట్ ఫిలింకి ఎక్కువ- ఫీచర్ ఫిలిం కి తక్కువ అన్నట్టుంది. హారర్ కామెడీ అన్నాక అయితే భయపెట్టాలి, లేకపోతే నవ్వించాలి. ఈ రెండూ చేయకుండా విసిగిస్తే ఎలా ఉంటుంది? ప్రధమార్థం, క్లైమాక్స్ అలాగే ఉన్నాయి... ఒక్క ద్వితీయార్థంలో మధ్యభాగం తప్ప! 

సెకండాఫ్ లో నటీనటుల్లో సత్య హైలైట్ అయ్యాడు. అతనితో సునీల్ కాంబినేషన్ కూడా బాగా నవ్వించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సునీల్ కి కం- బ్యాక్ చిత్రమని చెప్పుకోవచ్చు. తనకంటూ సరైన ట్రాక్ రాయాలే కానీ కడుపుబ్బ నవ్వించే స్పార్క్ సునీల్ నుంచి పోలేదని అర్ధమవుతోంది. 

శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ ఓకే. వాళ్ల నుంచి ఇంకా ఎక్కువ కామెడీ ఆశించడం సహజం. కానీ ఈ ముగ్గరితో ప్రధమార్ధంలో పెద్దగా డెప్త్ లేని రొటీన్ కృష్ణనగర్ కష్టాలు అవీ పెట్టి, ఎప్పుడో పాత చింతకాయ నాటి "ఎందుకే రవణమ్మా.." స్టైల్లో "రెంటుకి డబ్బు లేదు.. స్నానానికి సబ్బు లేదు..." అంటూ రుద్ది వదిలిపెట్టారు. అదంతా ల్యాగయినట్టు అనిపిస్తుంది. ఆలి ట్రాక్ జస్ట్ పర్వాలేదు. 

మెయిన్ విలన్ గా చేసిన రాహుల్ మహదేవ్ కి అనవసరమైన బిల్డప్ ఇంట్రోలు, స్లో మోషన్లు పెట్టారు. ప్రధాన నటి అంజలి గుంపులో గోవింద అన్నట్టు ఉంది తప్ప ఆమె మీద డ్రామా ఏమీ పెద్దగా నడవలేదు. 

ఫస్టాఫులో చాలా భాగం నవ్వాలో, భయపడాలో అర్థం కాని నీరసమైన కథనాన్ని అనుభవించాక, సెకండాఫ్ లో సుమారు 20 నిమిషాలు నవ్వుకుని, పేలవమైన క్లైమాక్స్ తో చిరాకు పడాల్సిన పరిస్థితి ప్రేక్షకులది. 

కథని భూత్ బంగ్లాకి తీసుకెళ్లడానికి నేపథ్యం ఆకట్టుకునే విధంగా లేదు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరమ వీక్ గా ఉండడంతో అవసరమైన అనుభూతి కలగలేదు. హారర్ జానర్ కి ఆయువుపట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే. ఎందుకోమరి ఆ విభాగం పూర్తిగా ఫెయిలయింది. సంగీత దర్శకుడు ఇవ్వలేదో లేక దర్శకుడు రాబట్టుకోలేదో వారికే తెలియాలి. 

ఈ హారర్ కామెడీలో భయమనేది రవ్వంత కూడా లేదు. ఇక కామెడీ కాస్తే ఉంది. అంచనాలకు తగ్గట్టుగా లేదు. అంచనాలేవీ లేకుండా వెళ్లినా పూర్తి సంతృప్తినైతే ఇవ్వదు. గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ ఆ పాత అనుభూతి మాత్రం మళ్లీ రాలేదు. 

బాటం లైన్: అనుభూతి మళ్లీ రాలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?