ఏపీలో విచిత్ర రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ నిత్యం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదని అంటుంటారు. జగన్ లాంటి దుర్మార్గుడిని ఇంటికి సాగనంపుతామని హెచ్చరికలు సరేసరి.
మరి ప్రతిపక్షాల నేతలు ఎలాంటి పాలన తీసుకొస్తారో చెప్పడం లేదు. ఫైనల్‌గా జగన్ పాలనే తీసుకొస్తామని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సందర్భాల్లో పొరపాటున చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే… వాలంటరీ వ్యవస్థను తొలగించి, మళ్లీ జన్మభూమి కమిటీలు తీసుకొస్తారని ఘాటు విమర్శ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ ఉన్నాయి.
చంద్రబాబు తాజాగా వాలంటీర్లపై యూటర్న్ తీసుకున్నారు. అబ్బే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెబుతున్నారు. జన్మభూమి కమిటీలపై నోరెత్తడం లేదు. అలాగే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి, నిబంధనలు కొంచెం అటూఇటూ సడలించి ప్రజల ముందుకు వెళుతున్నారు. ఆ పథకాలను కూడా బలంగా ప్రచారం చేసుకోలేని దయనీయ స్థితి.
తాను అధికారం నుంచి దిగిపోవడానికి జన్మభూమి కమిటీలే కారణమని చంద్రబాబుకు ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇదే జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, మరోసారి జగన్‌ను అధికారంలో కూచోబెట్టేలా వుందని బాబు భయపడుతున్నారు. అందుకే తన మార్క్ యూటర్న్ తీసుకుని, తాను కూడా జగన్ తీసుకొచ్చిన వ్యవస్థను కొనసాగిస్తానని నమ్మబలుకుతున్నారు. జగన్ పాలననే తీసుకొస్తానంటే, ఇక ఆయన్నే కొనసాగిస్తే పోలా అని జనం అనుకోరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా జగన్ పాలన చాలా శక్తివంతమైందని చంద్రబాబే అంగీకరిస్తున్న పరిస్థితి.