టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రచారంలో అసలు కనిపించడం లేదు. కానీ ప్రచారం నిమిత్తం ఆయన తమిళనాడుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం చేయడానికి లోకేశ్ వెళ్లారు.
కోయంబత్తూరులో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారని, వాళ్లందరినీ లోకేశ్ ప్రభావితం చేస్తారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నమ్మకం. ఏపీలో మాత్రం లోకేశ్‌ను కూటమి దూరంగా పెట్టిన సంగతి బహుశా అన్నామలైకి తెలిసినట్టు లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం, లోకేశ్‌ను సెలబ్రిటీగా భావించి ఆయన్ను ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో తెలుగు వారు ఎక్కువగా జీవించే పీలమేడులో గురువారం సాయంత్రం నిర్వహించే సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. అలాగే సింగనల్లూరులో తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ శుక్రవారం సమావేశం కానున్నారు. లోకేశ్ ప్రసంగాలు, రోడ్‌షోలతో తనకు రాజకీయంగా లాభిస్తుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నమ్మి ఆయన్ను ఆహ్వానించారు. పొత్తులో భాగంగా ఏపీలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన పెద్దమ్మ అయిన దగ్గుబాటి పురందేశ్వరికి మద్దతుగా కూడా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం వుంది.
రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్దమ్మను గెలిపిస్తే, మోదీ కేబినెట్‌లో మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. పురందేశ్వరి మంత్రి అయితే రాజకీయంగా టీడీపీకి ఎంతో ప్రయోజనం. కావున రాజమండ్రి లోక్‌సభ పరిధిలో కూడా లోకేశ్ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటే బాగుంటుందనే అభిప్రాయం బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. లోకేశ్ సిద్ధమా? అయితే ఆలస్యం ఎందుకు? పదండి రాజమండ్రికి… ప్రచారం కోసం.