Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ ఓట్లు నాకే అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్ధి సంచలనం!

టీడీపీ ఓట్లు నాకే అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్ధి సంచలనం!

తాను గెలిచేది వేయి శాతం నిజం. ఇదే సత్యం అంటున్నారు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు. తనకు లక్షకు తగ్గకుండా భారీ మెజారిటీ వస్తుదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎలా గెలవబోతున్నానో ఆ సీక్రెట్ చెప్పేశారు. అనకాపల్లి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో పాటు ఎంపీ ఓటు తమ పార్టీ నుంచి తనకే వస్తుందని అన్నారు.

ఇది విశేషం కాదు కానీ ఎంపీ ఓటు విషయంలో టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున తనకు ఓట్లు రాబోతున్నాయని ఆయన గుట్టు విప్పి చెప్పారు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఆయన మాటల ద్వారా చెప్పేశారు అని అంటున్నారు. ఎంపీ అన్న వారు లోకల్ గా ఉండాలని తమ మనిషిగా ఉండాలన్నది అనకాపల్లి వాసుల భావన మాత్రమే కాదు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతల అభిప్రాయం కూడా అని బూడి అంటున్నారు.

తాను సర్పంచు పదవి నుంచి మొదలెట్టి ఎంపీపీగా జెడ్పీటీసీ మెంబర్ గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగాను అని ఆయన వివరించారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అణువణువూ తనకు తెలుసన్నారు. తనది మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఓటమి ఎరగని హిస్టరీ అని చెప్పారు.

కూటమి అభ్యర్ధిగా ఉన్న సీఎం రమేష్ తనకు అసలు పోటీయే కాదు అన్నారు. ఆయనను ఎన్నికల్లో ఖర్చు బాగా పెడతారు అని తీసుకుని వచ్చారు అని సెటైర్లు వేశారు. చార్టర్ ఫ్లైట్లలో తిరిగే సీఎం రమేష్ కి గ్రామాలు వాటి సమస్యలు ఏమి తెలుస్తాయని ఎద్దేవా చేశారు.

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా అని నిలదీశారు. ఆయన ప్రజా సేవ చేయడానికే అయితే కడప నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. అనకాపల్లికి ఎందుకు ఫ్లైట్ వేసుకుని వస్తున్నారో చెప్పాలని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తూంటే ఆ పార్టీ మెంబర్ గా నిన్నటి దాకా ఎంపీగా ఉన్న సీఎం రమేష్ చేసిందేంటి అని నిలదీశారు. ఆయన పరిశ్రమలు పెడతాను అంటున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ ని ముందు రక్షిస్తే అదే పదివేలు అని బూడి ఎద్దేవా చేశారు. సీఎం రమేష్ పేరుకు బీజేపీ అయినా ఆయన చంద్రబాబు మనిషి అని అందరికీ తెలుసు అని బూడి కామెంట్స్ చేశారు.

ఆయన దగ్గర డబ్బు ఉంటే తన దగ్గర జనం బలం ఉందని అన్నారు. గతంలో బడా నేతలుగా బరిలో ఉన్న అల్లు అరవింద్ నూకారపు సూర్యప్రకాశరావులను ఓడించి పంపించిన చరిత్ర అనకాపల్లిది అని ఆయన చెప్పారు. లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అన్నది జనం నినాదం అన్నారు.

సీఎం రమేష్ ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి పార్సిల్ చేసి పంపించే బాధ్యతను అనకాపల్లి ప్రజలు తీసుకుంటారని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన గెలుపు మెజారిటీ ఇప్పటికే డిసైడ్ అయిపోయాయని అన్నారు. ఏపీలో మరోమారు జగన్ సీఎం అవుతారని మాడుగులలో తన కుమార్తె ఈర్లె అనూరాధ భారీ మెజారిటీతో గెలుస్తుందని బూడి ధీమా వ్యక్తం చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?