మెయింటెనెన్స్ చార్జీలు, ఫైన్స్ పేరుతో జనాల్ని దొంగదెబ్బ కొట్టే బ్యాంకులు డీమానిటైజేషన్ టైమ్ లో ఎలాంటి నాటకాలాడాయో మనకు అనుభవమే. ఏటీఎంలను సరిగా మెయింటెన్ చేయకుండా, నామమాత్రం నగదుతో సరిపెట్టి.. జనాలకు నరకయాతన చూపాయి. ఇప్పుడు మరోసారి కరోనా ఎఫెక్ట్ తో అలాంటి చావు తెలివితేటల్నే ప్రదర్శిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో సహా.. దేశవ్యాప్తంగా కరోనా భయంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు పనిచేస్తున్నాయి. పోనీ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనుకుందాం. కనీసం ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు బ్యాంకులు. కొన్నిచోట్ల ఏటీఎం మిషన్లు ఔటాఫ్ సర్వీస్.
కరోనా లాంటి విపత్తు సమయాల్లో ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంచేందుకు ప్రత్యేక సమయం కూడా ప్రభుత్వాలు కేటాయించాయి. నగదు పెట్టి వెళ్లే వాహనాలకు వెసులుబాటు ఇచ్చాయి. కానీ బ్యాంకులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. ఏ ఏటీఎం నుంచి అయినా ఫైన్ లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోండి అంటూ కేంద్రం వరాలిస్తుంటే.. ఇక్కడ క్షేత్ర స్థాయిలో చాలా ఏటీఎం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.
అయితే ఏటీఎం వ్యవహారాలు ఇప్పటివరకు ఒకెత్తు, రాబోయే రోజుల్లో మరో ఎత్తు. అవును.. నాలుగు రోజుల్లో ఒకటో తేదీ వస్తోంది. జీతాలు విత్ డ్రా చేసుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున ఏటీఎంల ముందు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊరికొక ఏటీఎం పనిచేస్తుంటే.. దాని వద్దే జనాలు గుమికూడిపోతారు. ఇది మరింత ప్రమాదం.
కరోనా టెన్షన్స్ వెంటాడుతుంటే.. బ్యాంకులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఇకనైనా బ్యాంక్ ల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఏటీఎం పనిచేసేలా చూడాలి, ఏటీఎంలలో కచ్చితంగా నగదు నిల్వలు ఉండాలన్న నిబంధన విధించాలి. అప్పుడే ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించగలుగుతారు.
దీనికితోడు కరోనా జాగ్రత్త చర్యలు కూడా అత్యంత అవసరం. ప్రతి ఒక్కరు మెషీన్ పై ఉన్న బటన్స్ మాత్రమే నొక్కుతారు. ఒకటే డోర్ వాడతారు. అందరి వేళ్లు, చేతులు వాటిపైనే పడతాయి. కాబట్టి ఏటీఎంలలో పరిశుభ్రత అత్యంత అవసరం. సోషల్ డిస్టెన్స్ తో పాటు ఈ ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టినప్పుడు మాత్రమే ఏటీఎంలు సురక్షితం. లేదంటే లాక్ డౌన్స్, కర్ఫ్యూల లక్ష్యమే పూర్తిగా దెబ్బతింటుంది.