ఈనెల 19వ తేదీన ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో ఎన్నికల పర్వం ముగుస్తుంది. అయిదు విడతల్లో జరగనున్న పోలింగ్ కు అది ఆఖరిరోజు. ఆ రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే.. దేశవ్యాప్తంగా ఈ అయిదు విడతల్లో పోలింగ్ సరళి ఎలా సాగిందనే విషయమై.. ఎవరు విజయం సాధించబోతున్నారనే జోస్యాలతో పలువురు సెఫాలజిస్టులు బుల్లితెర వేదిలకమీదికి వేంచేస్తారు. దేశవ్యాప్తంగా తమ అంచనా ఫలితాలను ప్రకటిస్తూ ఉంటారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ… ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ వైఎస్ జగన్మోహన రెడ్డికి అనుకూలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల ముందు సాగిన పలు సర్వేలు కూడా జగన్ అనుకూల ఫలితాలను వెల్లడించాయి. సాధారణంగా సర్వేలకంటె ఎగ్జిట్ పోల్స్ కొంత ఖచ్చితమైన సమచారాన్ని వెల్లడిస్తుంటాయి. 19న రాబోయే ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్ అనుకూల ఫలితాలనే వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల్లో కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.
మంగళవారం నాడు కేబినెట్ భేటీకి ముందు మంత్రులు, కీలక నాయకులతో చంద్రబాబునాయుడు మధ్యాహ్నం విందు సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయాల గురించి అనేక అంశాలు అందులో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘‘19న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీవీల్లో చూసి మీరెవ్వరూ గందరగోళానికి గురికావొద్దు. నూరుశాతం తెదేపా గెలవబోతోంది’’ అని నాయకులకు సూచించారు. అంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో తెదేపా గెలవడం లేదని స్పష్టంగా రిజల్టు రాబోతున్నట్లు అర్థమవుతోంది.
విషయం ఏంటంటే.. వివిధ సెఫాలజిస్టులు టీవీ ఛానెళ్ల వారు చేయించుకున్న ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాల విషయం చంద్రబాబుకు ఇప్పటికే తెలుసునని కూడా అర్థమవుతోంది. ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయో తనకు తెలుసు గనుకనే ఆయన పార్టీని ముందుగా అలర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. పైగా ఫలితాలకు నాలుగురోజుల ముందు తమ ఓటమిని ఛానెళ్లు కళ్లకు కట్టినట్టుగా ప్రజలకు వివరిస్తే తమ పరిస్థితి కష్టమని.. అందుకే గెలుస్తామనే భరోసాను నాయకులకు కల్పించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని పలువురు అంటున్నారు.