కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ వ్యాప్తంగా విపక్షాల్లో జోష్ నింపింది. బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గుతోందన్న అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున వ్యాపింపజేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం కంటే, సీఎం అభ్యర్థి ఎంపికపై నెలకున్న ఉత్కంఠ ఆందోళన కలిగిస్తోంది. సీఎం పదవిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే చందంగా కర్నాటకలో తాజా రాజకీయ పరిణామాలున్నాయి. సీఎం పదవిపై ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని తీసుకున్న ఏఐసీసీ పరిశీలకులు, నివేదికను కాంగ్రెస్ అగ్రనేతలకు అందించారు. దీంతో కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. సీఎం పదవి తమకే దక్కుతుందని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వ్యక్తిగతంగా చాలా ధీమాగా ఉన్నారు. ఇద్దరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు బెంగళూరులో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశానన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఒంటరిగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని డీకే వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు.
డీకే శివకుమార్ దృష్టిలో సరైన నిర్ణయం అంటే… తనకు సీఎం పదవి ఇవ్వడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒంటిచేత్తో తాను గెలిపించానని డీకే అంటున్నారంటే, కర్నాటకలో అధికారం పూర్తిగా తన కష్టార్జితమని ఆయన చెప్పకనే చెబుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఏదైనా కారణంతో సీఎం పదవి డీకేకి దక్కపోతే, తప్పక తీవ్ర అసంతృప్తికి లోనవుతారని, అనంతరం ఆయన అడుగులు ఎలా ఉంటాయో అనే కోణంలో కర్నాటక రాజకీయాల్ని అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు కర్నాటక పరిణామాలపై తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి ఎంపిక సజావుగా సాగితే మంచిదే. లేదంటే విపక్షాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పక తప్పదు.