Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇంతటి చాణక్యం చంద్రబాబుకే సాధ్యం

ఇంతటి చాణక్యం చంద్రబాబుకే సాధ్యం

చంద్రుడికి స్వయంగా వెలిగే శక్తి లేదు. సూర్యుడి వెలుగు తన మీద పడితేనే తాను వెలిగినట్టు కనిపిస్తాడు. అలా ఎవరి వెలుగునో లాక్కుని తన సొంత వెలుగులాగ భ్రమింపజేస్తూ దానికి "వెన్నెల" అని పేరు పెట్టి మరీ భూమి మీదకి పంపుతాడు.

కవులు కూడా అస్సలు తగ్గకుండా, సూర్యుడికి ఈ విషయంలో ఏ క్రెడిట్టూ ఇవ్వకుండా.. చంద్రుడి వెన్నెల మీద లక్షలాది కవితలు రాసేసి "చల్లని రాజా ఓ చందమామా" అంటూ పొగుడుతూ వచ్చారు శతాబ్దాలుగా. 

ఇప్పుడితంతా ఎందుకంటే చంద్రబాబు కూడా సార్ధకనామధేయుడు కనుక. 

తాను సొంతగా వెలగలేడు. ఒంటరిగా ఎన్నికల్లో పోరాడలేడు. పక్కవాడి నుంచి మద్దతు కూడగట్టుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. చంద్రబాబు చరిత్రంతా అంతే. ఇప్పుడు కూడా అంతే. 

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కనిపించిన ప్రతి పార్టీ మద్దతు కావాలంటున్నారు బాబుగారు.

పైగా దానికి "చాణక్యం" అని పేరు కూడా పెట్టారు సానుకూల మీడియా వారు. కవులు చందమామని పొగిడినట్టు సానుకూల మీడియా చంద్రబాబుని కూడా పొగిడి పొగిడి ఆకాశానికెత్తి ఆ చందమామ పక్కన నిలబెడుతుంటారు. 

పదవిలో లేనప్పుడల్లా చంద్రబాబు "వసుధైక కుటుంబకం" టైపులో అన్ని పార్టీలు తన కుటుంబమే అనే ధోరణిలో ఉంటారు. 

ప్రస్తుతానికి పదవి లెదు కనుక అన్ని పార్టీల మద్దతూ ప్రస్తుతానికి అడుగుతున్నారు. 

అయితే ప్రతీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక తత్వం ఉంటుంది. అన్నిటినీ కలిపేసుకుని ఘటబంధనమో, గట్టిబంధమో అని పేరు పెట్టేస్తే ఎలా? అసలు ఇన్నేసి పార్టీలు ఎలా కలిసిపోతాయి? కలిసేలాగ చంద్రబాబు ఎలా చేయగలరు? అందుకే ఆయనకి చాణక్యుడు లాంటి చిన్న పేరు కాదు. ఇంకా పెద్దదేదో పెట్టాలి. 

చాణక్యుడు చేసిందేమిటి? తనను అవమానించిన నందరాజుల్ని ఓడించి తన శిష్యుడైన చంద్రగుప్తమౌర్యుడిని రాజుని చేసాడు. 

కానీ ఇక్కడ చంద్రబాబు ఇన్నాళ్లూ సక్సెస్ఫుల్ గా చేస్తున్నది అంత చిన్న విషయం కాదు. చాణక్యుడికి నందరాజులు శాశ్వత శత్రువులు. కానీ చంద్రబాబుకి అలా ఎవ్వరూ లేరు. 

తాను కొన్నాళ్లు బీజేపీతో సఖ్యంగా ఉన్నారు. తర్వాత ఎదురు తిరిగి మోదీని అనరాని మాటలు అన్నారు. 

మోదీ కూడా బహిరంగంగానే చంద్రబాబు వెన్నుపోటులో సిద్ధహస్తుడు అని 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అయినా ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం ఐదేళ్లుగా తపస్సు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు.

ఇదంతా దేనికంటే..ఏదో రకంగా జగన్ మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కేంద్రం నుంచి ఫండ్స్ అందకుండా చేయడానికట!. 

ఇక కమ్యూనిస్టుల్ని అడ్డం పెట్టుకుని అంగన్వాడీ గొడవ లేపగలిగారు బాబుగారు. ఇది మామూలు టైమింగ్ కాదు. అసలు కమ్యూనిస్టులు బాబు గారు చెప్పినట్టు ఎలా చేసేస్తారో అర్ధమవ్వదు. ఏ మాత్రమిస్తారో! ఏం మంత్రమేస్తారో! 

ఇక మరొక ఎత్తుగడ షర్మిలతో జగన్ కి చెక్ పెట్టించే ప్రయత్నం. ఆ రకంగా కాంగ్రెస్ తో కూడా అఫీషియల్ గానో, అనఫీషియల్ గానో పొత్తే ఈయనకి. 

అందరికీ తెలిసింది జనసేనతో పొత్తు విషయం. ఇది దేనికయ్యా అంటే కాపు వోట్లు వైకాపాకి పడకుండా చేసేందుకు. 

ఈ ఎత్తుగడలతో ఎంతవరకూ సఫలీకృతమవుతారో తెలీదు కానీ ఆయన ప్రయత్నానికి మాత్రం జీవనసాఫల్య పురస్కారం ఇవ్వాల్సిందే. 

ఇలా అన్ని పార్టీలని వాడుకుంటున్న చంద్రబాబు ఎన్నారైలని, ప్రజల్ని కూడా వదలలేదు. 

నిజమెంతో గానీ ఎన్నారైలని మనీ ట్రాన్సాక్షన్స్ కి వాడుతున్నారని సమాచారం. తనకు మద్దతిస్తున్న ఫలానా వారికి ఫండ్స్ ఇవ్వాలంటే అవి అమెరికా నుంచి ఆ ఫలానావరి అకౌంట్స్ లో పడుతున్నాయట. చేతికి మట్టి అంటకుండా వ్యవసాయమంటే ఇదే. 

ఇక ఆ మధ్యన ఒకానొక ప్రచారంలో భాగంగా ప్రజల్ని రూ 5000 కట్టి తెదేపా సభ్యత్వం తీసుకోమని కోరారు. ఇది మామూలు వాడకం కాదు. పార్టీ ఫండ్స్ కోసం వ్యాపారుల్నో, పారిశ్రామకవేత్తల్నో కాకుండా నేరుగా ప్రజలనే అడగొచ్చన్న ఆలోచన స్వతంత్రభారతదేశ చరిత్రలో ఎవ్వరికీ వచ్చి ఉండకపోవచ్చు. 

ఇంత రాజకీయరంగులరాట్నాన్ని తిప్పే చంద్రబాబు ఒకవేళ నెగ్గితే తన మద్దతుదారులందరికీ ఎలా న్యాయం చేస్తారో తెలుసా? ఒక్కసారి ఎం.ధర్మరాజు ఎం.ఏ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి... 

తాను గెలుస్తున్నాడన్న వార్త వింటున్న మోహన్ బాబుకి మొదట తన ప్రేయసి కనపడకుండా మసకబారుతుంది.

తర్వాత తనకు మద్దతిచ్చి గెలిపించిన సత్యనారాయణని బానిసగా మార్చుకుంటాడు.

అదే సత్యనారాయణ పక్కన ఉండే ఆడమనిషి మీద చేతులేసి స్పాటులో సొంతం చేసుకుంటాడు.

సింపుల్ గా చెప్పాలంటే సాంబారులో ములక్కాడల్ని నమిలి గుజ్జంతా మింగేసి ఉమ్మేసినట్టు తన గెలుపుకి ఉపయోగపడిన అందర్నీ వాడేసుకుని వదిలేస్తాడు.

చంద్రబాబు గతచరిత్ర కూడా అంతే. రేవు దాటే వరకు ఓడ మల్లన్నలా కనిపించే వాళ్లంతా, రేవు దాటాక బోడి మల్లన్నలైపోతారు ఆయనకి. 

గతం, వర్తమానం చెప్పుకున్నాం కనుక భవిష్యత్తుని ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆ ఊహలన్నీ చంద్రబాబు గెలిస్తేనే. జగన్ ఒక్కడిని ఒకవైపున పెట్టి మిగిలిన అందర్నీ తనవైపుకి తిప్పుకునే చంద్రవ్యూహం ఫలిస్తే సరే. ఫలించకపోతే మాత్రం తెదేపా చంద్రుడికి నిత్య అమావాస్యే. ఆ భయం ఆయనకీ ఉంది. అందుకే ఆయన తపస్సు, తపన, తపత్రయం. ఇక్కడ ఎవరు మంచి, ఎవరు చెడు అనేది కాదు పాయింటు. ఎవరు యుక్తితో ఆడితే వాళ్లు గెలుస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?