Advertisement

Advertisement


Home > Politics - Opinion

చైనా రియల్ ఎస్టేట్ భారీ పతనం

చైనా రియల్ ఎస్టేట్ భారీ పతనం

మొన్నటికి మొన్న శ్రీలంక ఆర్ధికపతనం చూసాం. నిన్నటికి నిన్న పాకిస్తాన్ చతికిలపడడం, భిక్షపాత్ర పట్టుకుని ఐ.ఎం.ఎఫ్ వద్ద అడుక్కోవడానికి వెళ్లడం కూడా చూసాం. అవి చిన్న దేశాలు, తక్కువ వనరులున్న రాజ్యాలు, అంతర్జాతీయంగా మహాశక్తివంతమైనవి కావు కనుక అర్ధం చేసుకున్నాం. 

కానీ ఇప్పుడు వంతు శక్తివంతమైన పెద్ద దేశానిదా?  

మనకి ఈశాన్యాన ఉన్న అతిపెద్ద దేశం చైనా. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్ధికశక్తి. అక్కడ ఆర్ధికపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ ఆశాజనకంగా లేదు. దానికి తోడు కంపెనీల్లో జీతాలపై వేటు, రకరకాల పెట్టుబడుల్లో పెరుగుదలలేని పరిస్థితి. వీటికితోడు అన్నిటికంటే పెద్ద సమస్య కుప్పకూలిన రియల్ ఎస్టేట్ మార్కెట్.

పరిస్థితులు ఇలా ఉన్నా అందరూ పంటి బిగువున ఓర్చుకుని జీవిస్తున్నారు. ఏ కంపెనీ జీతంలో కోత విధించినా నోరెత్తి ప్రశ్నించని వాళ్ళే ఎక్కువగా ఉన్నారట. ఎందుకంటే ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుంది. తక్కువ మొత్తానికి పని చేసేవాళ్లు ఆల్రెడీ లైన్లో ఉన్నారు. అలాగని సదరు కంపెనీలు భారీగా సంపాదిస్తూ ఇలా ఉద్యోగుల్ని బాధిస్తున్నాయా అంటే కాదు. పైన చెప్పుకున్నట్టు స్టాక్ వేల్యూస్ పడిపోవడం వల్ల అన్ని కంపెనీలకీ ఆదాయం తగ్గిపోయింది. 

ఒక సగటు కుటుంబం ఆస్తుల్లో 70% రియల్ ఎస్టేట్ మీద, స్టాక్స్ మీద ఉన్నాయట. అవి కుదేలయ్యేసరికి గుండెలు బాదుకుంటున్నారు. మరీ గత్యంతరం లేని వాళ్లు మార్కెట్ వేల్యూ కంటే సగం రేటుకి, తాము పెట్టిన పెట్టుబడి కంటే నష్టానికి అమ్మేసుకుని జీవిస్తున్నారు. 

చైనా దేశం మూసిన పిడికిలి లాంటిది. అక్కడి వార్తలు వివరంగా బయటికి రావు. అందునా నెగటివ్ వార్తల్ని అక్కడి నుంచి బయటకు చెరవేయడానికి ఎవ్వరూ సాహసించరు. ఎందుకంటే అక్కడ మీడియా అంతా ప్రభుత్వం కనుసన్నల్లో ఉంటుంది. ప్రపంచమంతా ఉన్న సోషల్ మీడియా అక్కడ ఉండదు. వాట్సాప్ పనిచెయ్యదు. వాళ్ల యూట్యూబ్ వేరు, సోషల్ మీడియా వేరు...ఆఖరికి వాళ్ల సర్చ్ ఇంజిన్ కూడా గూగుల్ కాదు! అన్నిటికీ వారి ప్రత్యామ్నాయాలున్నాయి. ముందుగా తమ ప్రజలు ఏమి వినాలి, ఏది తెలుసుకోవాలి అనేది ప్రభుతమే నిర్ణయిస్తుంది. 

అలాగే అక్కడి స్థితిగతుల్లో ఏవైనా మరీ నెగిటివ్ విషయాలు బయట ప్రపంచానికి తెలిసేలా ప్రాక్సీ ఐడీలు, వీపీయెన్ లు పెట్టుకుని అప్లోడ్ చేస్తే శిక్షలుంటాయి. కనుక అక్కడినుంచి దాదాపుగా నెగటివ్ వార్తలు రావు. అయినప్పటికీ ఈ విషయాలు వినిపిస్తున్నయాంటే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

కరోనా కాలం ముందు వరకు బాగానే ఉన్న ఈ దేశం పరిస్థితి, ఆ తర్వాత నుంచి దిగజారుతూ వచ్చింది. ప్రపంచమంతా లాక్డౌన్స్ నుంచి బయటపడినా చైనా అధ్యక్షుడి నియంతృత్వ పోకడల వల్ల చాలా నెలలు అక్కడ లాక్డౌన్ కంటిన్యూ చేసారు. దాంతో ప్రజలు మానసికంగా కృంగడమే కాకుండా పనులు కూడా చేయలేకపోయారు. అలవికాని లాక్డౌన్స్ వల్ల అన్ని రంగాలూ కుదేలయ్యాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ కి బయ్యర్లు లేక చతికిలపడ్డాయి. ఇప్పటికీ కోలుకోకపోగా ఇంకా పతనమవోంది. 

బ్లూంబర్గ్ ఎకనామిక్స్ కి చెందిన ఎరిక్ జు అనే నిపుణుడి ప్రకారం రానున్న సంవత్సరాల్లో చైనా మార్కెట్ మరింత కుదేలయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. ఏదో మిరాకిల్ జరిగి స్టాక్ మార్కెట్ బూం వస్తే తప్ప చిన్న స్థాయిలో లాభాలు చూడ్డం కూడా కష్టమంటున్నాడు. 

అధికారికంగా చైనా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్వల్పమైన తగ్గుదలే అని చెప్పినా అక్కడి వ్యాపారవేత్తల ప్రకారం 15%-20% వరకు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల మరింత దయనీయంగా కూడా ఉన్న పరిస్థితి. 

చైనాలో అత్యంత ధనికులు కూడా డబ్బుని బయటకు తీయట్లేదని, స్లంపులో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడమనే ప్రాధమికమైన లాజిక్ ని కూడా పక్కన పెట్టేసారని, దానికి కారణం సమీపభవిష్యత్తులో ఆర్ధికపరిస్థితి బాగుపడే సూచనలు వారికి కనపడకపోవడమే అని చెప్తున్నారు. 

అమెరికాలో ఉన్న కొన్ని చైనా కంపెనీల షేర్స్ లో పెట్టుబడులను కూడా ట్రెండుని గమనించి చాలా కాలం క్రితమే ఇతర పెట్టుబడులకు మళ్లించిన వాళ్లున్నారు. 

కనీసం 2026కన్నా దేశీయ మార్కెట్ పరిస్థితి మెర్గుపడుతుందేమోనని ఆశాభావంతో ఉన్నట్టు కొందరు చెప్తున్నారు. అంటే ఈ లోగా పరిస్థితి కుదుటపడుతుందన్న నమ్మకాలు లేవనేగా!

ఏ దేశపరిస్థితికైనా పాలకులు, వారి విధివిధానాలే ప్రధమ కారణం. ఎంతటి కాకలుతీరిన దేశాలైనా పాలన గతితప్పితే సర్వం పతనమవుతుంది. 

అయితే చైనా ఎంత కుదేలైనా, ఎగుమతుల్లో అగ్రగామి కనుక, అంతర్జాతీయ విపణిలో పెద్దచేయి కనుక అనుకున్నదానికంటే ముందుగానే కుదుటపడవచ్చు. పాకిస్తాన్, శ్రీలంకలే కోలుకుంటున్నాయి. చైనాకి కష్టమా! అయితే ఒకరి నష్టం మరొకరికి లాభం చేకూరుతుంది కనుక, చైనా వీక్ అయిన ఈ సమయంలో భారతదేశ ఆర్ధికనిపుణులు సరైన పావులు కదిపి దేశీయ మార్కెట్టుకి మరింత ఊపు తీసుకురాగలరేమో చూడాలి. 

- పద్మజ అవిర్నేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?