Advertisement

Advertisement


Home > Politics - Opinion

వ్యూహం.. బలమా? బలహీనతా?

వ్యూహం.. బలమా? బలహీనతా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునర్విజయ ప్రాప్తికోసం పథకరచనలో నిమగ్నం అయ్యారు. అంచెలవారీ ఎత్తులను ఆయన ఆరంభించారు. అసంతృప్తులు రేగితే.. తత్ క్షణమే వాటిని బుజ్జగించే వ్యవస్థను రూపుదిద్దుతున్నారు. మూడునెలల దూరంగల ఎన్నికల సమరాంగణంలో పై చేయి సాధించడానికి ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. రాజకీయంలో ఎప్పుడూ కూడా అంతిమలక్ష్యం విజయం మాత్రమే.

నిర్దయ, నిర్మొహమాటత్వం, ప్రజల మనసులను గెలవలేకపోయిన నాయకులు ఎంతటివారైనా సరే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడం అనేదే.. జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఆ వ్యూహం అమలు చేయడంలో దూకుడు కనిపిస్తోంది. ఇంతకూ ఆ వ్యూహం ఆయనకు బలమా? బలహీనతా? ఈ కోణంలో సాధికార విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

‘గాంబెట్టో’ అని ఇటాలియన్ భాషలో ఒక పదం ఉంటుంది. ఎదుటివారిని బోల్తా కొట్టించేలా వేసే ఎత్తుగడను ఇలా అంటారు. ఆ ఇటాలియన్ పదం నుంచి గాంబిట్ అనే ఇంగ్లిషు పదం పుట్టింది. ఆ పదం చదరంగం క్రీడలో ఒక రకమైన ప్రారంభానికి తగిన పేరుగా స్థిరపడిపోయింది. తెల్లపావులతో ఆటను ప్రారంభించే వాళ్లు కొన్ని పావులను ప్రారంభంలోనే పోగొట్టుకోవడం ద్వారా.. తర్వాత్తర్వాత పైచేయి సాధించే వ్యూహంతో ఆడడాన్ని గాంబిట్ ఓపెనింగ్ అంటారు. ముందు కొన్ని పావులు పోతాయి. ప్రత్యర్థి పావులను పోగొట్టుకుంటున్నాడనుకుని.. అవతలి ఆటగాడు దూకుడు పెంచేలోగా ఉచ్చు బిగించేస్తారు. సులువుగా ఆధిక్యంలోకి వచ్చేస్తారు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడును గమనిస్తోంటే.. ఈ తరహా ఎత్తుగడ జ్ఞప్తికి వస్తోంది. 151 ఎమ్మెల్యే సీట్లతో అసామాన్యమైన బలాన్ని కలిగిఉన్న జగన్మోహన్ రెడ్డి.. తన పావులను కొన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. మనం ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. ఆయన సీట్లను వదులుకోవడం లేదు. వ్యక్తలను మాత్రమే వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు వైఎస్సార్  కాంగ్రెస్ లో ముమ్మరంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో పోటీచేయబోయే అభ్యర్థులను జగన్ దాదాపుగా ఖరారు చేస్తున్నారు. పలుచోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా బరిలోకి దించబోతున్నారు.

ప్రధానంగా ఏ పార్టీ అయినా గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఆధునికతరంలో పార్టీలు నాయకుల చరిష్మా గురించి, బలసంపత్తుల గురించి తాము ఆనోటా ఈనోటా వినే కబుర్ల కంటె, తాము ప్రత్యేకంగా నియోగించుకున్న సంస్థలు నిర్వహించే సర్వే నివేదికల మీదనే, అంటే- తమకు రహస్యంగా అందుతున్న ప్రజాభిప్రాయం మీదనే ఆధారపడుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అతీతమైనదేమీ కాదు. ప్రశాంత్ కిషోర్ సంస్థలు వైసీపీకోసం ఏపీలో సేవలందిస్తున్నాయి. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల నాడిని గమనిస్తున్నారు. సర్వేలు చేస్తూ ఎవరికి సానుకూలత ఉందో కూడా గమనిస్తున్నారు. వారి నివేదికలే ప్రధాన ప్రాతిపదికగా అభ్యర్థుల మార్పు జరుగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పుల నిర్ణయాల ద్వారా..కొందరు నాయకులను కోల్పోవడానికి సిద్ఢపడుతున్నట్టే అనుకోవాలి. ఆయన మళ్లీ తమకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వరు అని చాలా కాలం కిందటే గ్రహించిన ఉండవిల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి లాంటివాళ్లు ఎన్నడో తెలుగుదేశం పంచకు చేరుకున్నారు. తాజా పరిణామాల్లో పార్టీ ఇన్చార్జిగా మరో నాయకుడిని ప్రకటించగానే.. జగన్ కు ఎంతో సన్నిహితుడైన ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికే కాదు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు.

గాజువాకలో కూడా రాజీనామా మాట వినిపించినా.. తర్వాత బుజ్జగింపులు ఫలించాయి. మరికొన్ని నియోజకవర్గాలకు కూడా పార్టీ ఇన్చార్జిలను మారుస్తూ నిర్ణయాలు వెలువడుతున్నాయి. అలాగే.. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆశలు భంగపడుతున్న ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యేలు, అలాగే ఈ నాలుగేళ్లుగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా  సేవలందిస్తున్న నాయకులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.

కేవలం బుజ్జగింపుల కోసం జగన్ ప్రత్యేకంగా కొన్ని బృందాలనే నియమించుకుంటున్నారు గానీ.. వాటివల్ల గొప్ప ఫలితం ఉంటుందని అనుకోవడం భ్రమ. కనీసం కొన్ని వికెట్లు అయినా రాలుతాయి. కొందరు నాయకులైనా పార్టీని వీడుతారు. అలా జరిగినా, జగన్మోహన్ రెడ్డికి అది అనూహ్య పరిణామం కాకపోవచ్చు. కొన్ని పావులను కోల్పోవడానికి సిద్ధపడే, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా.. ఆయన తెల్లపావులతో.. పైన చెప్పుకున్నట్టుగా గాంబిట్ వ్యూహంతో ఆట ప్రారంభిస్తున్నారు.

విజయంపై ధీమా.. ఏ పునాది మీద?

వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దల్లో ఎవ్వరిని పలకరించినా ఈసారి జగన్ మరింత రికార్డు మెజారిటీతో విజయం సాధిస్తారని చాలా ధీమాగా చెబుతున్నారు. కాస్త అతిశయంగా అనిపించవచ్చు గానీ.. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు మీడియా ముందుకు వస్తే చాలు.. కుప్పం సహా మొత్తం 175 స్థానాలు తామే గెలవబోతున్నామని అంటున్నారు. తెదేపా- జనసేన కూటమికి సున్న స్థానాలు దక్కుతాయని జోస్యం చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం పెద్ద విశేషం కాకపోవచ్చు గానీ.. మొత్తం 175 గెలవడం చోద్యం అనిపిస్తుంది. పోనీ హైప్ కోసం అలా చెప్పారని అనుకున్నప్పటికీ.. వాటిలో కొన్ని సీట్లయినా ప్రత్యర్థులకు తప్పకుండా దక్కుతాయి. ఇంతకూ అంత ధీమాగా 175 అనే మాట ఎలా అనగలుగుతున్నారు?

జగన్ సర్కారుకు తమ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత.. ప్రజలను శాశ్వతంగా సమ్మోహన పరిచే అద్భుత పథకాలను అమలు చేస్తున్నాం అని ఒక నమ్మకం ఉంది. తమ పథకాలు ఎలాంటివంటే.. రాష్ట్ర ప్రజలు యావత్తూ.. మరో ముప్ఫయ్యేళ్లపాటూ జగన్ నే సీఎంగా కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో పార్టీ ముద్ర మీద ఎవరిని నిలబెట్టినా గెలిచేస్తారని వారికి ఒక బీభత్సమైన నమ్మకం. అభ్యర్థులకు ఎలాంటి  ప్రత్యేకమైన విలువ లేదని, జగన్ బొమ్మ చూసే జనం గెలిపిస్తారని వారు అంటున్నారు. ధీమా గురించి మాట్లాడాల్సి వస్తే.. ఇలా ఘనంగానే చెబుతున్నారు గానీ.. వారి పథకాల మీదనే అంత నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్చార్జిలు ఎందుకు? కొందరు ఎమ్మెల్యేలను పక్క ఊర్లకు మార్చడం ఎందుకు? మంత్రుల్ని కూడా మార్చడం ఎందుకు? ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి?

ఆఫ్ ది రికార్డ్ మాటల్లో పార్టీ పెద్దలు చెబుతున్న మాట ఏంటంటే.. ‘పథకాలకు అద్భుత ప్రజాదరణ ఉంది.. ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. కానీ ఎమ్మెల్యే గ్రాఫ్ బాగాలేదు. కేండిడేట్ ను మారిస్తే మనదే విజయం’ అనే! నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన ఆత్మవంచన! జగన్ కు, పథకాలకు అంత బీభత్సమైన ప్రజాదరణ ఉంటే గనుక.. ఎమ్మెల్యేలపై నెగటివిటీ ఏమాత్రం పనిచేయదు. దారినపోయే దానయ్యను నిలబెట్టినా గెలిచేతీరాలి. కానీ.. విజయావకాశాలు తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తున్న  ప్రతిచోటా.. ఆ పరిస్థితుల్ని ఎమ్మెల్యేల మీదకు నెట్టేసి, వారిని మార్చేసి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నారా?

ఏదో కాస్త గౌరవం ప్రకటిద్దాం అని పైన గాంబిట్ పద్ధతిలో వదులుకోదలచుకున్న పావులుగా కొందరు ఎమ్మెల్యేలను చేజార్చుకుంటున్నారని చెప్పుకున్నాం. నిజానికి పావులుగా కాదు, వారిని బలిపశువులుగా మారుస్తున్నారు. ఒకవేళ స్థానిక సమీకరణాల్లో పార్టీకి సానుకూల అంశాలు కనిపించకపోవచ్చు. కానీ.. అందుకు కారణం మొత్తం అక్కడి ఎమ్మెల్యే లేదా అక్కడి పార్టీ ఇన్చార్జిమీదనే నెట్టేయడం సబబేనా అనేది ప్రశ్న. ఎమ్మెల్యేల మీద నియోజకవర్గాల్లో నెగటివ్ ఆదరణ ఉన్నమాట నిజమే కావచ్చు. కానీ, సూటిగా చెప్పాలంటే.. ఆ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం మాత్రం ప్రభుత్వమే అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట.

ఎమ్మెల్యేలు ప్రజల్లో నేరుగా తమ గ్రాఫ్ పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏం సహకరించింది.. అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఎమ్మెల్యేల నిర్ణయాధికారం మేరకు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడానికి ఈ నాలుగేళ్లలో విడుదల చేసిన నిధులు ఎంత? అంటే సరైన సమాధానం వినిపించదు. తమ చేతికి నిధులేమీ లేకుండా.. నియోజకవర్గంలో ప్రజలు తమను ఆశ్రయించే సమస్యలవిషయంలో వారు ఏమీ చేయలేనిస్థితిలో ప్రజాదరణ పెంచుకోమంటే ఎలా పెంచుకుంటారు. జగన్ సర్కారు నేరుగా జనం ఖాతాల్లోకి ప్రతి నెలా వేలకు వేల కోట్ల రూపాయలు బదిలీచేసేస్తూ ఉండవచ్చు గాక.. కానీ.. ‘ఎమ్మెల్యే ద్వారా’ ఏం జరుగుతున్నది గనుక.. ప్రజలు వారిని గుర్తుంచుకుని ఆదరించాలి? అనేది ప్రశ్న!

అలాంటి ప్రతికూల వాతావరణంలోనే మెజారిటీ ఎమ్మెల్యేల గ్రాఫ్ తేడా కొడుతోందని అర్థమవుతోంది. మరి ఇప్పుడు వారిని బలిపశువుల్ని చేస్తూ.. కొందరిని బరిలోంచి ఏరి పక్కనపెట్టేస్తూ మరికొందరిని.. అటు ఇటు మారుస్తూ ఉంటే అది సరైన పద్ధతి అని ఎలా అనిపించుకుంటుంది?

ఇక్కడ చెల్లని నాణెం.. అక్కడ చెల్లుతుందా?

అభ్యర్థులను అటు ఇటు మార్చే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు తమ చర్యలను సమర్థించుకుంటున్న మాట ఒకే ఒక్కటి! ప్రత్యర్థి పార్టీలు కులాల ప్రాతిపదికగా ఒక్కటై సమరానికి వస్తున్నాయని.. ఆ నేపథ్యంలో కుల సమీకరణాల పరంగా మార్పు చేర్పులు తప్పవని మాత్రమే అంటున్నారు. కానీ ఇదొక్కటీ సరైన కారణంగా నిలబడదు. ఇంచుమించుగా యాభై చోట్ల అభ్యర్థులను మారుస్తామని పార్టీ అంటోంది. వారికి అర్థమవుతోందో లేదో గానీ.. ఏ రకమైన కారణాలు చెప్పుకున్నా సరే.. ప్రస్తుత వాతావరణంలో అన్ని సీట్లలో ఓడిపోయే అవకాశం ఉన్నదని పార్టీ భయపడుతున్నట్టు లెక్క! పార్టీలోని భయానికి ఇది సంకేతం!

పార్టీ గమనించాల్సిన అంశం మరొకటి ఉన్నది. గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేశారు. ఆ నియోజకవర్గ ప్రజలు అయిదేళ్లు గడుస్తుండగా ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేను ఈసడించుకుంటున్నారు. అసమర్థుడిన గుర్తించేశారు. మరైతే.. అతడిని తీసుకువెళ్లి మరో చోట పోటీ చేయించినంత మాత్రాన ఏం జరుగుతుంది. ఆ మనిషి అక్కడి ప్రజలకు కొత్తవాడు గనుక.. అతని అసమర్థత గురించి తెలియక ఆ ప్రజలు జగన్ మొహం చూసి అతణ్ని మళ్లీ గెలిపించవచ్చు. కానీ మరో అయిదేళ్లలో మళ్లీ జనం అసహ్యించుకునేలా తయారవుతాడు కదా? అనేది ప్రశ్న.

ఒక చోట చెల్లని  నాణెం, మరో చోట ఎలా చెల్లుతుంది- అనేది కోణంమైనా ఉండాలి! లేదా, వేరే సీటు ఇస్తున్నాం గనుక.. ప్రజలు గమనించరు.. ఆ రకంగా జనాన్ని బురిడీ కొట్టించేద్దాం అనే కుట్రకోణమైనా ఉండాలి. ఈ విషయంలో ప్రజలకు మరింత సమర్థంగా పార్టీ నాయకత్వం తమ వివరణ చెప్పగలగాలి. 

వ్యూహలోపాలు

బాలినేనే ఏదో తనకు తోచిన రీతిలో మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను తప్ప.. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూపాయైనా తీసుకోలేదు అన్నారే అనుకుందాం. నిజం చెప్పాలంటే ఆ వ్యాఖ్యకు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. కానీ.. పార్టీ పెద్దల్లో ఎవరు మార్గదర్శనం చేశారో గానీ.. ఆయనతో మరో సవరణ ప్రకటన చేయించారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు నేను డబ్బు తీసుకోలేదు.. పార్టీ ఫండ్ గా మాత్రమే తీసుకున్నా’ అని ఆయన అన్నారు. దీంతో ఇంకా పెద్ద నష్టమే జరుగుతంది.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లంచాలను పార్టీ ఫండ్ రూపంలో తీసుకుని.. పనులు చేసి పెడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం ప్రమాదం. మంత్రి ఒక వ్యక్తిగా బద్నాం అయ్యే మాటలు తొలుత చెప్పి, వాటిని దిద్దుకునే ప్రయత్నంలో పార్టీని, ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకున పడేశారు. నియోజకవర్గాల్లో ముఠాకక్షలు రేగుతుండడం వైసీపీలో ఎంతోకాలంగా ఉంది. అధికారంలో ఉండే పార్టీలకు ఇది సహజం కాగా.. ఒకే సెగ్మెంట్లో అనేకమంది బలమైన నాయకులు ఉండే పార్టీలకు ఇలాంటి చికాకులు తప్పవు. 

అయితే.. ఈ నాలుగున్నరేళ్లుగా.. ఇలాంటి అనేక వర్గపోరులు బయటపడుతున్నా సరే.. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఎన్నింటి విషయంలో జోక్యం చేసుకున్నారు. ఎన్నిచోట్ల రాజీ కుదర్చడానికి స్వయంగా ప్రయత్నించారు.. అనే ప్రశ్న వేసుకుంటే వేళ్లమీద లెక్కపెట్టగల జవాబులే వస్తాయి. ఇన్నాళ్లూ ఆయన ఇలాంటి చికాకుల్ని పట్టించుకోలేదు. అన్నీ శృతిమించాయి. ఇప్పుడు అన్నీ పట్టించుకునే పనిలో పడ్డారు. కానీ.. ఇప్పటికే కొన్ని చేయి దాటిపోతున్నాయి కూడా. ఇలాంటి వ్యూహలోపాలు మనకు అనేకం కనిపిస్తాయి. 

నిజంగా బలమేనా?

అభ్యర్థులను విచ్చలవిడిగా మార్చేయడం అనేది నిజంగా పార్టీకి బలమే అవుతుందా? లేదా, ఉన్న బలహీనతను బయటపెడుతున్నదా? అనేది మీమాంస. ఎంపీలను ఎమ్మెల్యే బరిలోకి తీసుకురావడం ఒక మంచి ప్రయోగమే. అయితే ఏకపక్షంగా ఇవన్నీ సత్ఫలితాలే ఇస్తాయని అనలేం. ఎందుకంటే తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే.. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన  ముగ్గురు ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అదే సమయంలో బిజెపి తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు పరాజయం పాలయ్యారు. కాబట్టి ఇది ఏకపక్షమైన ఫలితం ఇస్తుందని అనుకోలేం. కానీ.. జగన్ ఎంపీలు పలువురిని ఎమ్మెల్యే బరిలో మోహరించే వాతావరణం కనిపిస్తోంది.

ఆ సంగతి ఎలా ఉన్నా మంత్రులుగా చేస్తున్న వారిని, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని వారి సొంత నియోజకవర్గాల నుంచి పక్కకు ట్రాన్స్‌ఫర్ చేయడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. వ్యూహకర్తల పేరుతో వస్తున్న సలహాల మీద గుడ్డిగా ఆధారపడుతున్నారా అనే భయాలు కూడా జగన్ అభిమానుల్లో ఉన్నాయి. 

యాభైమందికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని భావిస్తే.. అది తగ్గేలా.. వారికి దన్నుగా నిలిచి వారిని ప్రజలకు చేరువ చేైసే పనులు చేయాలి. చేరువ చేయడం అంటే గడపగడపకు తిరగమని వెంటపడడం మాత్రమే కాదని తెలుసుకోవాలి. వారి ద్వారా నియోజకవర్గాల్లో పనులు జరిగే వాతావరణం కల్పించాలి. అలా కాకుండా.. వారిని పక్కన పెట్టి.. వారిలో అసంతృప్తిని  పెంచితే.. ఎన్నికలు మరింతగా సమీపించే సమయానికి  విపక్షాలు ఎడ్వాంటేజీగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇలాంటి మార్పు చేర్పుల పట్ల జగన్ తన నిర్ణయాలను ఒకటికి పదిసార్లు పునస్సమీక్షించుకుని ముందుకు అడుగు వేస్తే పార్టీకి మేలు జరుగుతుంది.

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?