Advertisement

Advertisement


Home > Politics - Opinion

పరోపకారార్థమ్

పరోపకారార్థమ్

పరోపకారార్థం ఇదం శరీరం’ అంటారు పెద్దలు. కానీ పరోపకారార్థం ఇదం పార్టీ అనే సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే మహానాయకుడు పవన్ కల్యాణ్. ఎన్ని రంకెలువేసినా, ఎన్ని అరుపులు అరచినా, ఉద్యమాల పేరుతో ఎన్ని నాటకీయ ఎపిసోడ్ లకు నేతృత్వం వహించినా అన్నింటి వెనుక పరమార్థం ఒక్కటే. ఇతరులకు ఉపయోగపడడం.

ఇతరులకు ఉపయోగపడడం’ అనగానే.. మహానాయుడు.. అపరిమితమైన సేవాభిలాష గల వ్యక్తి అని మురిసిపోవడానికి అవకాశం లేదిక్కడ. ‘ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే’ అని కూడా అదే పెద్దలు అన్నారు. అంటే.. ప్రయోజనం ఆశించకుండా ప్రపంచంలో ఎవ్వరూ ఏ పనీ చేయరు- అని! మరి నటుడిగా తన క్రేజ్ ను, రాజకీయ నాయకుడిగా తన ప్రయత్నాన్ని పరులకు ఉపయోగపడడానికి పణంగా పెడుతున్న పవన్ కల్యాణ్ ఆశిస్తున్న ప్రతిఫలం ఏమిటి? అసలు అది దక్కుతుందా? ఆ విశ్లేషణే ఈ వారం కవర్ స్టోరీ ‘పరోపకారార్థమ్’!

నరసింహ శతకంలోని శ్లోకం ఇది-

పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥

ఇతరులకు ఉపయోగపడడం కోసమే చెట్లు ఫలాలను ఇస్తున్నాయి.. నదులు ప్రవహిస్తున్నాయి.. గోవులు పాలు ఇస్తున్నాయి! ఇతరులకు ఉపయోపగడడం కోసమే మన ఈ శరీరం ఉన్నది- అని శ్లోకభావం. కానీ.. ఈ శతకం రాసినటువంటి శేషప్ప కవికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల మర్మం తెలియదు. తెలిసిఉంటే.. పరోపకారం కోసమే పవన్ కల్యాణ్.. పరోపకారం కోసమే జనసేన! పరుల జెండా మోయడం కోసమే, పరులను కీర్తిస్తూ వారి భజన చేయడం కోసమే, పరుల పల్లకీమోస్తూ అధికారానికి చేరువ చేయడం కోసమే, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం కూడా అని ఏదో ఒక మూలన ఇరికించి ఉండేవాడే.

పవన్ కల్యాణ్ చాలా ఆవేశపూరితుడైన రాజకీయ నాయకుడిగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తనతో సమానమైన ఆవేశంగల నాయకులు మరొకరు లేరని.. అడుగడుగునా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. లోతుగా గమనించే వారికి ఆ ఆవేశం కృతకంగా కనిపిస్తూ ఉంటుంది. వేసే రంకెలు అసహజంగా ధ్వనిస్తుంటాయి. ఎందుకంటే.. ఎంతో సీరియస్ గా రాజకీయ ప్రత్యర్థులను దునుమాడుతూ కొన్ని డైలాగులను ఆవేశపూరితంగా అప్పజెప్పే పవన్ కల్యాణ్ మధ్య మధ్యలో హఠాత్తుగా తన సహజమైన వెకిలి జోకుల ప్రస్తావనలతో ప్రసంగధోరణిని మార్చేస్తుంటారు. రాజకీయ నాయకుడిగా తమ విధానాల ప్రకటన విషయంలో తరచూ తత్తరపాటుకు గురవుతూ ఉంటారు. తడబడుతూ ఉంటారు. ఒక విడతకు మరో విడతకు అసలు విధానాలనే మార్చేస్తుంటారు.

పవన్ కల్యాణ్- 2014 లో జనసేన పార్టీ ప్రారంభించినంత మాత్రాన అప్పుడే అరంగేట్రం చేసిన రాజకీయ నాయకుడిగా చూడకూడదు. అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పుట్టినప్పుడే ఆయన ప్రస్థానం కూడా ప్రారంభం అయింది. తెలుగునాట ఆ నాటికి అసమానమైన ప్రజాభిమానం కలిగిఉన్న మెగాస్టార్ చిరంజీవి ఖ్యాతిని నమ్ముకుని అదంతా ఓట్లుగా ప్రతిఫలిస్తుందనే భ్రమల్లో కూరుకుపోయిన పవన్ కల్యాణ్.. అప్పటి ఎన్నికల ప్రచారంలో ఎంతటి దూకుడును ప్రదర్శించారో అందరికీ తెలుసు.

సినిమాల్లో పంచ్ డైలాగుల మాదిరిగా విజిల్స్ వేయించుకోవడం మాత్రమే లక్ష్యం అన్నట్టుగా.. ‘కాంగ్రెసు నాయకుల్ని పంచెలూడదీసి తరిమికొడతా’ వంటి అర్థపర్థం లేని ఓవరాక్షన్ డైలాగులతో పవన్ కల్యాణ్ అప్పుడు ఎలా భ్రష్టుపట్టిపోయారో కూడా అందరికీ తెలుసు. ప్రజారాజ్యానికి దక్కిన పరాభవం తర్వాత కళ్లు కొద్దిగా తెరచుకున్నాయి. కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్నారు. 2014లో సొంత పార్టీ పెట్టారు. అన్నయ్య రాజకీయ ప్రస్థానం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా.

పేరుకు సొంత పార్టీ ప్రారంభం అయింది తప్ప.. ఆ పార్టీకి ఒక లక్ష్యం.. ఒక చిత్తశుద్ధి ఏమైనా ఉన్నదా? కనీసం ఇప్పటికైనా అలాంటిది ఆ పార్టీకి ఏర్పడిందా? నిత్యం పరుల పల్లకీ మోయడానికేనా? ఎలాంటి డీల్స్ మాట్లాడుకుని అలా పల్లకీ మోయడానికి సిద్ధపడుతున్నారు? అనేవి చర్చనీయాంశాలు! డీల్స్ లేకుండానే అడుగులు వేస్తున్నారని అనుకోవడం భ్రమలు. 

తెలంగాణ ఎన్నికలే పెద్ద ఉదాహరణ

2014లో పార్టీ పెట్టినప్పుటికి కూడా పవన్ కల్యాణ్ కు రాజకీయంగా స్పష్టత లేదు. తనకు అనల్పమైన ప్రజాభిమానం ఉన్నదని.. అప్పటిదాకా సమైక్యాంధ్రకు స్పష్టంగా జైకొట్టినప్పటికీ కూడా రెండు చోట్లా ప్రజలు తనకు నీరాజనాలు పడతారని ఆయన భావించారు. అందుకే రెండుచోట్ల పార్టీని నడిపారు. అప్పటికి తన పార్టీని పోటీకి దింపకపోయినా.. 2014 ఎన్నికల తర్వాత.. తెలంగాణలో ఎదురైన పరాభవం నుంచి పాఠం నేర్చుకున్న వైఎస్ జగన్.. తన రాజకీయ పార్టీని ఏపీకి పరిమితం చేసుకున్నారు. జగన్ కు ఎదురైన దెబ్బనుంచి కూడా పవన్ పాఠం నేర్చుకోలేదు.

తెలంగాణలో దుకాణం సర్దేసి.. తనకు రాజకీయ కోరికలు ఉన్నమాట నిజమే అయితే.. అప్పుడే ఏపీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు ఎందుకు? కేవలం ‘పరోపకారార్థమ్’.. ఇతరులకు ఉపయోగపడుతూ, డీల్స్ మాట్లాడుకుంటూ తద్వారా ముందుకు సాగడం కోసమే అని మనకు ఇప్పుడు అర్థమవుతోంది.

సాధారణంగా అప్పటికి ఆయన హైదరాబాదులో మాత్రమే నివసిస్తున్నారు గనుక.. ఏపీలో ఆఫీసు పెడితే కార్యకలాపాలు కష్టం గనుక.. నామ్ కే వాస్తే తెలంగాణ పార్టీ అస్తిత్వాన్ని కూడా కాపాడుకుంటూ అక్కడ ఆఫీసు నడుపుతున్నారని అంతా అనుకున్నారు. కానీ అసలు అంతరార్థం.. అక్కడ కూడా నిత్యం డీల్స్ మాట్లాడుకుంటూ ముందుకు సాగడమే అని పవన్ నిరూపించారు.

2019 ఎన్నికల్లో సొంతంగా పోటీచేసి అత్యంత దారుణంగా, అవమానకరంగా పార్టీ మొత్తం ఓడిపోయిన తర్వాత.. పవన్ కల్యాణ్ హఠాత్తుగా వెళ్లి కేంద్రంలో భాజపాతో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని తన రక్తంలో కమ్యూనిజం ఉన్నదంటూ.. అనేకానేక సినిమా డైలాగులు వల్లించిన ఈ నటుడు, ఓడిపోయిన వెంటనే.. ఎలాంటి సిగ్గుపడే ఆలోచన కూడా వెళ్లి కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే మతవాద, మతదురహంకార పార్టీ చంకఎక్కారు. ఆ వెంటనే మోడీ భజనను పునఃప్రారంభించారు. అందులో ఆయన ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడను అనుసరించారో ఇవాళ్టికీ ఎవ్వరికీ తెలియదు.

ఎన్డీయేలో జనసేన భాగస్వామి అయినా కూడా తెలంగాణ భాజపా వారిని చాలా చులకనగా చూస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే ఒక పార్టీగానే గుర్తించలేదు. తెలంగాణలో తమకు పొత్తులు లేనే లేవని నాలుగేళ్ల పాటు చిలకపలుకులు పలికి.. చివరికి ఎన్నికల ముంగిట్లో వెళ్లి పవన్ ను ఆశ్రయించారు. అప్పటికే తెలంగాణలో తమ పార్టీ 39 స్థానాల్లో ఒంటరిగా పోటీచేస్తుందని జనసేన ప్రకటించి ఉంది. తమాషా ఏంటంటే నియోజకవర్గాల పేర్లు మాత్రమే ప్రకటించింది. అభ్యర్థులు సిద్ధం అని చెప్పింది. తీరా బిజెపి వారిని ఆశ్రయించిన తర్వాత.. పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్లి మరీ బేరాలు ముగించుకుని వచ్చారు. ఇంతా చేస్తే తమ బలం 39 సీట్లలో ఉన్నదని ప్రకటించిన జనసేనకు పొత్తుల్లో దక్కినది కేవలం 8 స్థానాలు. అక్కడికే ఆ పార్టీ పరువు 90 శాతం హరించుకుపోయింది. అంతకంటె నీచమైన సంగతి ఏంటంటే.. ఆ 8 స్థానాల్లో కూడా ఆ పార్టీకి (డిపాజిట్లు దక్కలేదనే అందరికీ తెలిసిన సంగతి పక్కన పెడదాం) అభ్యర్థులు లేరు.

రెండురోజుల ముందు పార్టీలో చేరిన వారికి నాలుగు చోట్ల టికెట్ కేటాయించారు. ఇది అచ్చంగా టికెట్ అమ్ముకునే ప్రహసనం కాక మరేమిటి? ఈ నిర్ణయం తర్వాత.. పాత ప్రకటనను గమనిస్తే.. 39 స్థానాల్లో పోటీచేయబోతున్నాం అని నియోజకవర్గాల పేర్లతో  చేసిన రాజకీయ ప్రకటన కూడా ఇలాంటి అమ్మకాల కోసం చేసిన ప్రకటనగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడా టికెట్ దొరకని ఆశావహులు.. తమను ఆశ్రయిస్తే.. ఏదో ఒక ధర కిట్టకపోతుందా.. అనే ఆశతో ప్రకటించారు. దానికి ఉపశమనంగా బిజెపి డీల్ దొరికింది. దక్కిన 8లో నాలుగు విక్రయాలు సాగాయి.

అయితే అలాంటి దుస్థితి గురించి పవన్ కల్యాణ్ సమర్థించుకున్న తీరు ఇంకా చిత్రమైనది. ఆ నిర్ణయాల వెనుక మాకు కొన్ని వ్యూహాలు ఉంటాయి.. అని ఆయన ప్రకటించుకున్నారు. అక్కడికేదో ఆ వ్యూహాలవల్లనే కాంగ్రెసు గెలిచిందన్నంత బిల్డప్ ఇచ్చారు. దారుణంగా ఓడిపోయినందుకు అవమానం ఫీల్ కాకుండా.. అతిశయమైన డైలాగులు చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కూడా జరుగుతున్నది అదే. 

అద్దెకివ్వడానికి రెడీ!

తన పార్టీని, రాజకీయంగా అంత లేదు గానీ- సినీ నటుడిగా తనకున్న క్రేజ్ ను అద్దెకివ్వడానికి పవన్ కల్యాణ్ నిత్యం సిద్ధంగా ఉంటున్నారు. ఎప్పుడు ఎవ్వరికైనా సిద్ధం. ఒక తడవ బిజెపితో పొత్తు, రెండో తడవ బీఎస్పీ-వామపక్షాలతో పొత్తు, మళ్లీ బిజెపి కూటమిలోకి చేరడం, అక్కడ ఉంటూనే ఆ కూటమికి సంబంధం లేని తెలుగుదేశం జెండాను భుజానేసుకుని చంద్రకీర్తనలతో తరించిపోతుండడం.. ఈ పరిణామాల సంకేతం ఏమిటి? పవన్ కల్యాణ్ తాను కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డితో కూడా చేతులు కలపగలరు. ఆయనను కూడా కీర్తించగలరు.

2019లో చంద్రబాబు అవినీతిని తిట్టిన నోటితోనే.. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అని.. ఇప్పుడు ఎలాగైతే పొల్లు మాటలు మాట్లాడుతున్నారో.. అదే నోటితో.. తనకు కుదరగల డీల్ ను బట్టి, అంతా ఓకే అనుకుంటే.. జగన్మోహన్ రెడ్డి వంటి దార్శనికుడైన యువనేత నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని కూడా అనగలరు. మాటలు మార్చడంలో ఆయనకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. కాకపోతే.. జగన్ తన స్వశక్తినే నమ్ముకున్న వాడు గనుక.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పార్టీతో జతకలిసే వ్యక్తి కాదు గనుక.. అక్కడ తనకు ఎంట్రీ లేదు గనుక.. మళ్లీ చంద్రప్రాపంకంలో తరించాలని చూసుకుంటున్నాడు. అంతకు మించి వేరే పరమార్థం లేదు.

పవన్ కల్యాణ్ తీరు ఎలాంటిదంటే.. 2019 ఎన్నికల సమయంలో ఆయన నారా లోకేష్ అవినీతి గురించి అసమర్థత గురించి అనేకానేక మాటలు అన్నారు. సంకీర్ణం ఏర్పడుతుందనే కలల్లో ఉన్నారు కాబట్టి.. అప్పట్లో ప్రచార సభల్లో ప్రతిచోటా చంద్రబాబును తక్కువ తిట్టి, లోకేష్ ను ఒక రేంజిలో ఆడుకున్నారు. అలాంటి లోకేష్ పాదయాత్ర చేస్తే.. ఆయనకు జై కొట్టడానికి తగుదునమ్మా అంటూ ప్రత్యేక విమానం వేసుకుని మరీ అక్కడకెళ్లాడు. జనం నవ్వుతారనే చింత కూడా లేదు ఆయనకి. 

పవన్ కల్యాణ్ టైంపాస్ కోసం రాజకీయాలు చేస్తున్న నాయకుడు. సినిమాల షూటింగుల మధ్యలో విరామ సమయాన్ని ఖాళీగా ఉంచుకోవడం ఎందుకని.. దాన్ని కూడా డబ్బుగా మార్చుకోవడానికి రాజకీయాన్ని ఒక మార్గంగా మార్చుకున్న వ్యక్తి తప్ప.. మరొకటి కాదు. నా బతుకు తెరువు కోసం సినిమాలు చేస్తున్నా.. నాకు మీలా వ్యాపారాలు  లేవు అని అంటూ ఉంటారు.

కానీ సినిమాల విషయంలో కూడా నిర్మాతల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ.. దానిని ఎన్ క్యాష్ చేసుకోవడానికి.. కౌలు రైతులకు సాయం పేరిట ప్రభుత్వంపై నిందలు వేస్తూ సాగే ఈ నటుడు.. తన నిర్మాతలకు సినిమాలను ఒక పట్టాన పూర్తి చేయకుండా.. వారిని కోట్లకు కోట్ల అప్పుల్లో ముంచేస్తూ ఎంతగా వేధిస్తున్నాడో మాత్రం బయటకు చెప్పడు. కాళ్ల మీద పడుతుందనే భయంతో కడుపు చించుకోకుండా దాచుకునే సినిమా రంగం యొక్క అతి జాగ్రత్త ఆయన పాలిట వరం.

అలాంటి నటుడు.. రోజుకు నాలుగు కోట్లు వంతున రెమ్యునరేషను తీసుకుంటూ సగం లెక్కలు చూపిస్తూ.. అక్కడికే తాను మహా ట్యాక్సులు కట్టేస్తున్నానని డప్పు కొట్టుకునే ఆయన సినిమా రంగంలో సాగించే వంచననే ఏపీ ప్రజలకు రుచి చూపించడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంగతి ప్రజలకు కూడా అనుమానం ఉన్నది గనుకనే.. సభలకు వస్తారు విజిల్స్ కొడతారు తప్ప ఓట్లు మాత్రం వేయరు. తమ బలం పెరిగిపోయిందని చాటుకునే పవన్ కల్యాణ్.. విజిల్స్ ను చూసి అలాంటి లెక్కలు వేసుకుంటున్నారేమో.. ఓట్ల దాకా వెళ్లినప్పుడు మరో పరాభవం తప్పదు. 

..ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?