Advertisement

Advertisement


Home > Politics - Opinion

అందుకే షర్మిలని జగన్ దూరం పెట్టాడా?

అందుకే షర్మిలని జగన్ దూరం పెట్టాడా?

ఈ సారి ఆంధ్రాలో ఎన్నికలు ఎవరి మధ్యన అంటే ఏం చెప్పాలి? జగన్ మోహన్ రెడ్డి ఒక్కడూ ఒక వైపు, తక్కిన పార్టీలన్నీ మరొక వైపు అని చెప్పుకోవాలి. 

ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పవన్ జనసేనతో పొత్తులో ఉన్నారు. కాంగ్రెసులో చేరిన షర్మిలతో కూడా పొత్తుకు ఆయన సిద్ధమే కానీ పైనున్న బీజేపీ కన్నెర్ర చేస్తుందేమోనన్న ఒకే ఒక్క భయంతో ఆగారు. 

పైగా బీజేపీ తమతో పొత్తుకు వస్తుందన్న ఆశ, ఆకాంక్ష ఆయనలో చల్లారలేదు. అలా బీజేపీ కలవబోతోందన్న సూచనలు కూడా కొన్ని చేసారాయన. 

ఇక కమ్యూనిష్టులు... వీళ్లు ఎప్పుడూ చంద్రబాబు వైపే.

"నిండు చందురుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు--నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు" అని మహేష్ బాబులా పాడుకోవాల్సిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డిది. 

ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది కలిసికట్టుగా ఉన్నారంటే జనం దృష్టిలో జగన్ మొహన్ రెడ్డి మళ్లీ హీరో అవుతాడు. అనవసరంగా ఆ హీరోయిజాన్ని ఇచ్చి తమ గొయ్యి తాము తవ్వుకుంటున్నది తెదేపా-జనసేన కూటమే. 

అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని పవన్ కళ్యాణ్ ప్రతినబూని తెదేపాతో కలిసినా ఏం లాభం? కాస్తో కూస్తో షర్మిల చీలుస్తానంటోంది. బీజేపీ వైఖరి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ల సంగతేంటో తెలీదు. 

ఇలా ఎంత మంది జగన్ కి వ్యతిరేకంగా వస్తే అంత అడ్వాంటేజ్ జగన్ కే. ఎందుకంటే వైకాపాకి వెయ్యాలనుకునే ఓటర్లు ఫిక్సైపోయారు. వెయ్యద్దనుకునే వాళ్ళంతా ఆపోజిట్ లో ఉన్నారు. వాళ్లంతా ఒక పార్టీకే వేస్తారా అంటే కాదు. పోనీ ఆ పార్టీలన్నీ అఫీషియల్ గా ఒకే పొత్తులో ఉన్నాయా అంటే లేవు. పైన చెప్పుకున్నట్టు అందరూ ఒకవైపే ఉన్నారు కానీ పొత్తులో మాత్రం కొందరున్నారు కొందరు లేరు. దానివల్ల ఈ వ్యతిరేక ఓట్లన్నీ చీలుతాయి కనుక జగన్ వ్యతిరేక గ్రూపులు ఎన్నుంటే వైకాపాకి అంత బెనిఫిట్. 

ఇదిలా ఉంచి ఒకసారి షర్మిల-అనిల్ జంట గురించి చెప్పుకోవాలి. నిజానికి బ్రదర్ అనీల్ వల్ల అప్పట్లో వై.ఎస్. రాజ్శేఖర రెడ్డికి కూడా చెడ్డ పేరొచ్చింది. 

"డబ్బొస్తుందన్నా, పరపతి పెరుగుతుందన్నా పుట్టిన మతాన్ని, వివాహవ్యవస్థని కూడా పక్కన పెట్టే రకం ఈయన", అని ఒక వైకాపా నాయకుడు అనీల్ గురించి చెబుతూ అన్నాడు. 

అదేమో కానీ, ఇప్పుడు అనీల్ నిర్ణయాలు చూస్తుంటే డిస్పరేషన్లో ఏ వైపు మొగ్గడానికైనా సిద్ధమని, తనకంటూ విలువలు పౌరుషాలు లేవని అర్ధమవుతుంది. 

ఎందుకంటే తెదేపా సానుకూల మీడియా  అధినేత అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే వై.ఎస్.ఆర్ కి అస్సలూ పడేది కాదు. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పరిపాలన చేయించిన పాపాన పోలేదు ఆ మీడియా. అలా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టిన రాధాకృష్ణతో షర్మిల ఆ మధ్యన చక్కగా ఇంటర్వ్యూలో కూర్చోవడం, ఇప్పుడు ఆయనతోటే కాకుండా ఏకంగా చన్ద్రబాబుతో సైతం అనీల్-షర్మిలలు సత్సంబంధాలు పెట్టుకోవడం చూస్తుంటే ఏమనాలి?

నిజానికి తన అన్న జగన్ మోహన్ రెడ్డిని జైలుపాలు చేసి ఇబ్బంది పెట్టినప్పుడు తెదేపా మీద,దాని అనుకూల మీడియా మీద ధ్వజమెత్తిన వనిత ఈ షర్మిల. ఇప్పుడు అన్నగారు ఈమెను రాజకీయంగా ప్రోత్సహించడం లేదని అతని శత్రువులతో స్నేహం చేయడమంటే ఏమనాలి? ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయగల సమర్ధులు ఈ అనీల్-షర్మిల జంట అని గ్రహించే జగన్ పక్కనపెట్టాడేమో అనిపించడం లేదు! 

ఎందుకంటే ఒకవేళ ఆమెను రాజకీయంగా ప్రోత్సహించినా అనీల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అతని స్వలబ్ధి కోసం రాజకీయాన్ని వాడుకునే అవకాశం లేకపోలేదు. అందుకే అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని దూరం పెట్టుంటాడు. 

రాజకీయాల్లో బంధుప్రీతిని పెట్టుకుంటే ఒక్కోసారి అదే భస్మాసుర హస్తం కావొచ్చు..ఎన్.టి.ఆర్ కి చంద్రబాబులాగ! 

చరిత్ర, వర్తమానం, మనుషుల మనస్తత్వం తెలుసు కనుకనే జగన్ మొహన్ రెడ్డి తన చెల్లెలెని దూరం పెట్టుంటాడని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని బట్టి, షర్మిల-అనీల్ ల ప్రస్థానాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. 

అయినా షర్మిల-అనీల్ ల అంచనాలు, ఆశలు, ఊహలు ఒక రేంజులో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం తెలంగాణాలో తమ రాజకీయానికి ఠికాణా లేదని గ్రహించారు. అందుకే ఆంధ్రా వైపుకి చూసారు. తెలంగాణాలో రాష్ట్రానికి కోడలినని ప్రచారం చేసుకున్న ఆమె, ఇప్పుడు ఆంధ్రాలో వై.ఎస్.ఆర్ బిడ్డనంటూ స్పీచులు మొదలుపెట్టింది. తన మాటలు కూడా కోటలు దాటుతున్నాయి. తెలంగాణాలో తాను తన పార్టీని పోటీలో పెట్టనందువల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటోంది ఆమె. అదెంత హాస్యాస్పదంగా ఉందో! ప్రపంమంతా నవ్వుతున్నా తాను మాత్రం తన భ్రమలో ఉంది. 

ఇప్పుడు ఆంధ్రాలో అన్నగారి క్రైస్తవ ఓట్లని చీల్చేయగలమన్న ధీమాతో ఉంది. తన భర్త "బ్రదర్" అయినంత మాత్రాన క్రైస్తవులు వేసేస్తారా ఓట్లు? ఎలా చూసుకున్నా షర్మిల కాంగ్రెస్ తరపున పోరాడినా గెలిచి ముఖ్యమంత్రయ్యే అవకాశముందా? లేదని ఎవ్వరైనా చెప్తారు. అలాంటప్పుడు తాను చెబితే ఎవరు మాత్రం ఓట్లేస్తారు?

అయినప్పుడు సంగతి కానీ, ఒకవేళ రేపు ఏ కారణం చేతనైనా తెదేపా నెగ్గితే ఆ గెలుపులో భాగస్వామ్యం కోసం ఎంతమంది చంద్రబాబుతో యుద్ధానికి దిగుతారో చెప్పక్కర్లేదు. ముందుగా పవన్ కళ్యాణ్ తాను లేనిదే చంద్రబాబే లేడని తెదేపాకి ఊపిరూదిందే తానని అంటాడు. 

షర్మిల ఇప్పుడంటున్నట్టే మళ్లీ తన డైలాగ్ ని రిపీట్ చేస్తూ తాను ఓట్లు చీల్చడం వల్ల తెదేపా నెగ్గిందని చెబుతుంది. 

కమ్యూనిష్ట్ నారాయణ కూడా షర్మిల లాగానే తాము తెలంగాణాలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం వల్లనే కాంగ్రెస్ నెగ్గిందని అన్నాడు. అదే పద్ధతిలో తమ ఎర్రజెండా అండతోటే పసుపు జెండా నెగ్గిందని వక్కాణిస్తాడు. 

ఇలా గెలుపులో క్రెడిట్ ని తీసుకోవడానికి నానా ఆగం చేస్తారు. 

ఒకవేళ ఓడితే తమతో సరైన విధంగా పొత్తు పెట్టుకోక పోవడం వల్లనే తెదేపా ఓడిందని అందరూ అంటారు. ఆ విధంగా ఎలా చూసుకున్నా చంద్రబాబుకి మనశ్శాంతి లేకుండా చేస్తారు. 

మళ్లీ షర్మిల టాపిక్ కి వస్తే..అన్నగారు పట్టించుకోవడంలేదని స్వయం ఉపాధి కోసం వై.ఎస్.ఆర్.టి.పి ని పెట్తుకున్నారు షర్మిల-అనీల్ దంపతులు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అయ్యింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. 

ఇప్పుడు కనీసం కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కల నిజం చేసుకోవచ్చేమో అని భ్రమ..లేకపోయినా హీనపక్షం ఏ కర్ణాటక నుంచో రాజ్యసభ సభ్యత్వం వస్తుందన్న ఆలోచన ఉందేమో పాపం షర్మిలకి. ఎన్నికలయ్యాక ఈమెని పట్టించుకునే నాథులే ఉండరన్న సంగతి అప్పుడే అర్ధం కాదు. కాంగ్రెస్ ని నమ్ముకుని కలలు సాకారం చేసుకోవాలంటే చాలా డిపెండిబిలిటీ చూపించాలి. లేకపోతే సైలెంటుగా పక్కకు నెట్టేస్తారు. 

మొన్నటివరకు ఈమెను వై.ఎస్.షర్మిల గా పిలిచిన వైకాపా వర్గీయులు మారిన పరిణామాల రీత్యా ఆమె పేరు ముందున్న "వై.ఎస్" అనే అక్షరాలను లేపేసి పెళ్లి ద్వారా ఆమెకు సంక్రమించిన ఇంటిపేరుని తగిలించి మొరుసుపల్లి షర్మిల అని పిలుస్తున్నారు. ఆమె చర్యలకి ప్రతిచర్య అలా ఉంది ఒకనాటి స్వవర్గం నుంచి. 

ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉన్నా రానున్న కాలంలో ఆమె రాజకీయంగా ఎంతవరకూ రిలవెంటుగా మారుతుందో వేచి చూడాలి. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?