Advertisement

Advertisement


Home > Politics - Opinion

సాలెగూటిలోకి షర్మిల!

సాలెగూటిలోకి షర్మిల!

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకు తగు మోతాదులో కీర్తిప్రతిష్ఠలు, ప్రజాభిమానం ఉన్నాయి. అన్నయ్య జగన్ పరోక్షంలో, ఆయన వదిలిన బాణంగా ప్రజల హృదయాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉంది! గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించిన పాదయాత్ర మాత్రమే కాకుండా, తానుగా తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత సాగించిన పాదయాత్ర ద్వారా ఆమె పోరాటశీలత గురించి ప్రజలకు నమ్మకం ఉన్నది. అన్నింటినీ మించి ఆమెకు ప్రజలలో ఒక విలువ ఉన్నది. అయితే, ఇప్పుడే కాంగ్రెస్ పన్నిన ఉచ్చులోకి, సాలెగూటిలోకి ఎందుకు చేరుకుంది? అనేదే సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం.

తన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని పణంగా పెట్టి వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి తనవంతు ఉపకరించారు. ప్రత్యుపకారం చేయడాన్ని వెనక్కి నెడుతూ.. ఆమెను మరింతగా వాడుకోడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఆ కూహకాలకు షర్మిల లొంగిపోతుందా? ఈ వైనంమీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సాలెగూటిలోకి షర్మిల’!

ఎట్టకేలకు వైఎస్ షర్మిల మూడు రంగుల కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఒక కీలక రాజకీయ ఘట్టం ఇది. కొన్ని నెలలుగా సంభవిస్తుందా? సద్దుమణుగుతుందా? అనే సస్పెన్స్ లో పలువురిని ఉంచిన సందర్భం ఇది. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చక్రంతిప్పినంత కాలమూ.. ఆమెకు పార్టీ కండువాను ధరించాల్సిన అవసరం వచ్చినట్టుగా మనకు ఎరుక లేదు. తండ్రి దివంగతులైన తర్వాత కూడా ఆమెకు ఆ అవసరాన్  అన్నయ్య జగన్ రానివ్వలేదు.

కాంగ్రెసు పార్టీ  యొక్క అహంకారపూరితమైన దృక్పథం, వారు చులకనగా చూడడం వెరసి జగన్ సొంత పార్టీ పెట్టుకునేలా ప్రేరేపిస్తే.. ఆ పార్టీకి షర్మిల సెకండ్ లెఫ్టినెంట్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ జీవితాంతమూ కాంగ్రెసులోనే ఉన్నారని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి పరిశ్రమించారని, ఆయన లక్ష్యం కోసం తాను కూడా పాటుపడతానని షర్మిల ‘కండువా పర్వం’ తర్వతా ఘనంగా చెప్పుకున్నారు. ఆమె పూర్తి చేయదలచుకున్న తండ్రి లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరినా, అందులో ఆమె కష్టం కీలకంగా నిలవడం అసలు సాధ్యమేనా? అనేవి అంతు చిక్కని ప్రశ్నలు.

షర్మిల కాంగ్రెస్ లో చేరికకు ముందునుంచి వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒక ప్రచారం ద్వారా.. ఆమె కేవలం ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం అనే సంగతి స్పష్టమైంది. ఆ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా..  గిడుగు రుద్రరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటివాళ్లు నివృత్తి చేసేశారు. ఆమెకోసం పీసీసీ సారథ్యం త్యాగం చేయడానికి సిద్ధం అని ఒకరంటే.. ఆమె వెంటే నడుస్తానని మరొకరు స్పష్టం చేశారు. ఆమెకు కాంగ్రెసు పార్టీలో అప్పగించే బాధ్యతలు, హోదాలను బట్టి.. ఏపీలో పలువురు తిరిగి కాంగ్రెసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారని కూడా తెలుస్తోంది. 

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్!

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రెండు చోట్ల కూడా చతికిలపడింది. తెలంగాణలో అంతో ఇంతో అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి గానీ.. ఏపీలో పూర్తిగా శవాసనం వేసింది. వారు ఉత్సాహం పుంజుకుని, గేర్ మార్చి వేగం పెంచడానికి తగిన కీలక పరిణామం కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయం. తెలంగాణపై కూడా వారికి ఆశలు పెరిగాయి. అవే తరహా వ్యూహాలతో ముందుకు వెళ్లాలనుకున్నారు.

కానీ ఏ రెడ్డి సామాజిక వర్గమైతే కాంగ్రెస్ కు అండగా ఉంటుందో, అదే వర్గంలో తనకంటూ సొంత పాపులారిటీ కలిగి ఉన్న వైఎస్ షర్మిల, పార్టీల సంగతి ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రతి నియోజవర్గంలోనూ ఒకటిరెండుశాతం ఓట్లను సాధించగలిగిన షర్మిల అప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీతో దూసుకుపోతున్నారు. ఆమె పార్టీని విలీనం చేసుకోవాలనే ప్రతిపాదన అప్పుడు తెరమీదకు వచ్చింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ మంత్రాంగంలో కీలకంగా వ్యవహరించారు. షర్మిల వలన ఓట్లు చీలకుండా ఆమెను కాంగ్రెసులో కలుపుకునే ప్లాన్ ఆచరణలో పెట్టారు.

కాంగ్రెస్ అతి తెలివితేటలు ఏంటంటే.. తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిలను పార్టీలో చేర్చుకోలేదు. విలీనం జరగలేదు. కానీ ఆమె తమ పార్టీ పోటీలో ఉండదని విరమించుకుని కాంగ్రెసుకు పూర్తి మద్దతు ఇచ్చారు. అయినా ఆమెను కనీసం ప్రచారానికి కూడా తెలంగాణలో వాడుకోలేదు. ఇదంతా వ్యూహాత్మకం. విభజనను అప్పట్లో వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు తెలంగాణలో ప్రచారం చేస్తే.. ఆ అంశాన్ని భారాస తమకు నెగటివ్ గా వాడుకుంటుందని వారు భయపడ్డారు. షర్మిలను కనీసం దగ్గరకు రానివ్వకుండా తెలంగాణ ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసి లబ్ధిపొందారు. ఆ సమయంలోనే.. ఆమె ఏపీ బిడ్డ.. అక్కడ రాజకీయాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు.. అని స్థానిక కాంగ్రెసు నాయకులతో వారి సొంత అభిప్రాయంగా చెప్పించారు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఆమెను  పార్టీలో చేర్చుకున్నారు. అక్కడి పార్టీ సేవలకు వాడుకోబోతున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ అనే చెప్పాలి. 

జగన్ మీద కక్షసాధింపునకు అస్త్రం!

కాంగ్రెసు పార్టీ అహంకారానికి, పెత్తందారీ పోకడలకు కొరుకుడు పడకుండా మిగిలిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి మరణం తర్వాత.. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి లేఖ ఇచ్చినా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అందరి మనోగతాన్ని పక్కన పెట్టింది. కనీసం తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారిని పరామర్శించడానికి యాత్ర చేస్తానని అన్నా కూడా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఆంక్షలు పెట్టింది.

వ్యక్తులు ఎవరైనా తమ పార్టీ నీడలో బతకాల్సిందే తప్ప.. వ్యక్తిగతంగా ఎదగడాన్ని సహించలేమనే తమ సంకుచిత బుద్ధిని బయటపెట్టుకుంది. అటువంటి అత్యంత దుర్మార్గమైన పరిస్థితుల్లో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలివిడతలో దెబ్బతిన్నప్పటికీ, తర్వాత ప్రజల ఆశీస్సులు పొందగలిగారు. తెలుగురాష్ట్రంలో కనీవినీ ఎరుగని సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. మరి కొన్ని సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగలరనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాదుగొల్పుతున్నారు.

తమను ధిక్కరించి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలను సహజంగానే కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది. ఇప్పుడు అదును చూసి.. షర్మిలను ఆయన మీదికి ప్రయోగించాలని సిద్ధమవుతోంది. జగన్ సంక్షేమ పాలన నిర్మించిన ఓటు బ్యాంకు సంగతి పక్కన పెడితే, సాంప్రదాయ వైఎస్సార్ అభిమాన ఓటు బ్యాంకు ఏదైనా జగన్ కు అనుకూలంగా ఉండేట్లయితే, షర్మిలను మోహరించడం ద్వారా, దానిని చీల్చవచ్చుననేది కాంగ్రెస్ ఆశ! అయితే కేవలం అలాంటి ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ పార్టీ విజయాలను నమోదు చేయగలుగుతుందా?

విభజన నిర్ణయం ద్వారా ఏపీ ప్రజల గుండెల్లో క్షోభ నింపిన కాంగ్రెసు పార్టీకి ఎన్ని గిమ్మిక్కులు చేసినా సరే.. ఆరాష్ట్రంలో మళ్లీ నిలదొక్కుకోవడం సాధ్యమేనా? కాదని వారికి కూడా తెలుసు. కానీ వారి లక్ష్యం కాంగ్రెస్ గెలవడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడడం మాత్రమే.. అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వారి కలను షర్మిల తీర్చగలుగుతుందా? అనేది ప్రశ్న.

ఆమె పోరాటం శాపంగా మారుతుందా

అన్నయ్య జగన్ తో విభేదించిన తర్వాత షర్మిల తెలంగాణ రాష్ట్రాన్ని తన రాజకీయ వేదికగా మార్చుకున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి మీద సమానమైన శ్రద్ధ చూపినప్పటికీ, ఆ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన తండ్రి పేరును కలిపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. నేను తెలంగాణ కోడలిని అని చెప్పుకుంటూ.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని చాటుకుంటూ ప్రజల్లోకి దూసుకువెళ్లారు. సుదీర్ఘమైన పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ మీద అవ్యాజమైన ప్రేమను ఆమె ఒలకబోశారు.

షర్మిల తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత.. ఆమె తల్లి విజయమ్మ కూడా కూతురుకు తను అండగా ఉండాలనే వాదనతో.. ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవిని ఆమె వదలుకున్నారు. ఆ రకంగా తల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా.. తమ రాజకీయ భవిష్యత్తు మొత్తం తెలంగాణతో మాత్రమే ముడిపడి ఉంటుందన్నట్టుగా వ్యవహరించారు.

షర్మిల తెలంగాణ మీద అవ్యాజమైన ప్రేమానురాగాలను కురిపించారు. ఏపీ వ్యవహారాలతో తనకు సంబంధం లేదన్నట్టుగా కొన్నేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం మీద, పాలన మీద అలుపెరగని పోరాటం సాగించారు. ఆ పోరాట పటిమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారనుందా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. నిన్నటిదాకా తనకున్న ప్రేమనంతటిని తెలంగాణ మీద కుండపోతగా కురిపించి, ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి ఏపీలో అడుగుపెట్టి.. జగన్ పాలనను నిందిస్తూ.. తండ్రి కలను తీర్చాలి, రాహుల్ ను ప్రధానిని చేయాలి.. కాబట్టి అందరూ హస్తం గుర్తుకు ఓటేయండి అని షర్మిల అడిగితే ప్రజలు ఎలా నమ్ముతారు?.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజల మనోభిలాషలను అత్యంత పాశవికంగా అణిచేసిన, కనీసం ఏపీకి న్యాయం చేసేలాగా కూడా విభజన చట్టం రూపొందించని, ప్రత్యేకహోదా అనేది పొందుపరచకుండా చట్టం రూపొందించి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరోసారి నమ్మాలని షర్మిల ఏ రకంగా నచ్చజెప్పగలరు? అది సాధ్యమేనా? అనేది కీలక చర్చీనాయంశం. 

సామాన్యుడి విశ్వాసం సాధ్యమేనా

‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ తన గురించి తాను షర్మిల ఇదివరకు పరిచయం చేసుకున్నారు. ఆ రకంగా ప్రజల్లోకి దూసుకువెళ్లారు. ప్రజల మన్నన చూరగొన్నారు. అయిదేళ్లు కూడా గడవలేదు. ఇప్పుడు మళ్లీ అదే జగన్ మీద విమర్శన బాణాలు ఎక్కుపెడుతూ సమరానికి సిద్ధమైతే..  ఆమెను అదే ప్రజలు ఎందుకు నమ్మాలి? జగనంటే కిట్టని, ఆయన తమను అందలాపై కూర్చోబెట్టడం లేదని కినుక వహించి ఉన్న అసంతృప్తి వాదులు ఆమె వెంట నిలవొచ్చు గాక! కానీ ప్రజల్లో విశ్వసనీయత సాధ్యమేనా?

వైఎస్సార్ కాంగ్రస్ పార్టీలో ఇప్పుడు అనేక మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అసంతృప్తి వాదులు నెమ్మదిగా గళం విప్పుతున్నారు. నీకు ప్రజాబలం లేదు.. ఓడిపోతావు అని అధినేత చెబితే.. తలెగరేస్తున్న వాళ్లు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అలాంటి వారు షర్మిల వెంటనడుస్తూ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అలాంటి చెల్లని నాణేలను చూసి కాంగ్రెస్ మురిసిపోవాల్సిన అవసరం లేదు.

గత ఎన్నికల్లో వారికి అభ్యర్థులు కూడా దొరకలేదు. షర్మిల సారథ్యం వలన ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థులకు కొరత ఉండకపోవచ్చు. కానీ.. సామాన్యులు ఆ పార్టీని నమ్ముతారా? ఏపీ పట్ల షర్మిల ఎలాంటి హామీలు ఇచ్చినా, మాటలు చెప్పినా.. వాటిని ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు? ఇదే షర్మిల.. అయిదేళ్ల కిందట తన అన్న జగన్ పాలనా సామర్థ్యాన్ని గుర్తించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పుడు అదే అన్నను ఓడించాలని పిలుపు ఇస్తే ఎందుకు పట్టించుకుంటారు అనేది ప్రశ్న.

రుణం తీర్చుకునే పద్ధతిదేనా?

మంచో చెడో తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకోవడం ద్వారా వైఎస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి అంతో ఇంత తోడ్పడ్డారు. ఆమె మాత్రం చాలా ఘంటాపథంగా.. 31 నియోజకవర్గాల్లో- కేవలం తమ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల మాత్రమే- కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా వారి విజయంలో ఆమె పాత్ర ఉంది. మరి అందుకు గాను.. కాంగ్రెస్ ఆమె రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా? శవాసనం వేసి ఉన్న పార్టీని ఉద్ధరించే బరువును ఆమె భుజం మీద పడేసి వేడుక చూడాలని అనుకుంటున్నారా? అని పలువురు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో తన పార్టీ విలీనానికి షర్మిల సిద్ధపడినప్పుడు.. వినిపించిన పుకారు ఏమంటే.. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతారని! నిజానికి బేషరతుగా వారు ఆ పని చేసి ఉండాలి. కానీ.. ఇప్పుడు ఈ బాధ్యతలు ఆమెపై పెట్టడం ద్వారా.. ఏపీలో పార్టీని కూడా ఉద్ధరించిన తర్వాత అదే ఎంపీ పదవి ఇస్తాం అనే మాట వారు అనవచ్చు. ఉద్ధరించలేకపోతే ఏమిటి సంగతి? తెలంగాణలో చేసిన సాయానికి రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా అనే మాట వినవస్తోంది. 

చంద్రదళంలో పండగ !

మొత్తానికి ఏపీ కాంగ్రెసు సారథ్యానికి షర్మిల వస్తున్నదంటేనే చంద్రదళంలో, పచ్చ కోటరీలో పండగ వాతావరణం నెలకొంటోంది. జగన్ కు ఉండగల సాంప్రదాయ ఓటుబ్యాంకుకు షర్మిల గండి కొడతారనేది వారి ఆశగా ఉంది. ఈ పరిణామాలపై ఎక్కువగా మాట్లాడకుండా వాళ్లు తమ సంతోషాన్ని జాగ్రత్తగా దాచుకుంటున్నారు. తెలుగుదేశం వ్యతిరేక ఓటు బ్యాంకును జగన్ - షర్మిల చీల్చుకుంటే.. తమ విజయం నల్లేరుపై బండి నడక అవుతుందనేది వారి కోరిక.

షర్మిల కాంగ్రెస్ లో చేరిక, ఆ రాజకీయాల్ని పచ్చమీడియా కూడా ఎగదోస్తోంది. షర్మిలకు బలం చేకూర్చడానికి వారు ప్రయత్నిస్తున్నారు. షర్మిల ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ ఏ ఒక్క శాతం పెరిగినా కూడా ఆమేరకు జగన్మోహన రెడ్డికే నష్టం జరుగుతుందనేది వారందరి ఆశ. అయితే గత ఎన్నికల నాటినుంచి ఈ ఎన్నికల వరకు జగన్ తన సంక్షేమ పథకాల ద్వారా.. ఎంత మేర ఓటు బ్యాంకును పెంచుకుని ఉంటారు.. అనేది అందరూ మరచిపోతున్నారు. షర్మిల చీల్చగల ఓటు బ్యాంకు కంటె, జగన్ కు పెరిగి ఉండే ఓటు బ్యాంకు ఎక్కువ ఉండచ్చుననే వాస్తవాన్ని చాలా కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు. 

అందమైన సాలెగూడు!

మొత్తానికి వైఎస్ షర్మిల చాలా అందమైన సాలెగూడులోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను తమ స్వార్థానికి, అవసరానికి అనేక రకాలుగా వాడుకుంటోందనే సంగతి ఆమెకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు. ప్రస్తుతానికి బలంగా వినిపిస్తున్న పుకార్ల సారాంశం ఏంటంటే.. వైఎస్ షర్మిలకు ఏపీసీసీ సారథ్యం అప్పగించే అవకాశం ఉంది. లేదా ఏఐసీసీ లో కీలకహోదా ఇస్తారు. మొదటిదానికే అవకాశం ఎక్కువ. అదేమీ ఆమె సామర్థ్యాన్ని గుర్తించి ఇస్తున్న హోదా అనుకుంటే పొరబాటు. ఆ పార్టీకి అంతకంటె గతిలేక ఇస్తున్నారు.

ఆమె రెక్కలు ముక్కలు చేసుకుని, ధన వనరులను కరగదీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కష్టం తాను పడాలి. పనిలో పనిగా రాబోయే ఎన్నికల్లో  ఆమెకు కడప పార్లమెంటు టికెటు ఇచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఆ ఎన్నికల ఖర్చులు అదనంగా భరించాలి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ ప్రస్తావన వచ్చినప్పుడు.. తమ కుటుంబం నుంచి భర్త అనిల్, తల్లి విజయమ్మ కూడా ఎమ్మెల్యేలుగా పోటీచేస్తారని షర్మిల తొలుత ప్రకటించారు. ప్రజలు అలా కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెసులో ఆమే కీలకంగా ఉంటుండగా.. భర్తకు, తల్లికి కూడా టికెట్లు ఇస్తారా? అనేది ఒక ఆసక్తికరమైన చర్చ.

భర్త బ్రదర్ అనిల్.. ఢిల్లీలో షర్మిల పార్టీలో చేరిక కార్యక్రమానికి హాజరై, వేదికమీద కూడా ఆసీనులు అయినప్పటికీ.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి మాత్రం నిరాకరించారు. ఎందుకో మర్మం తెలియదు! మరి ఆయన ఏపీలో పోటీచేస్తారా? లేదా, షర్మిల కు అనుకూల ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారా చూడాలి.

విజయమ్మ కూతురుకు అండగా ఉండగలదు గానీ.. కాంగ్రెస్ రాజకీయ విషక్రీడలో పావుగా మారి.. కొడుకు పార్టీ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీచేస్తుందని అనుకోలేం. షర్మిల ఎంపీగా గెలిస్తే దిగులే లేదు. కానీ ఓడిపోతే.. అప్పుడిక రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెడతామని కాంగ్రెస్ ఆమెకు ఆఫర్ చేయవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గిస్తే.. ఏదో ఒక శాఖకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేయవచ్చు.

ఇవన్నీ జరిగినా కూడా రాజకీయ జీవితం స్థిరంగా పురోగమిస్తుందనే గ్యారంటీ లేదు. మెగాస్టార్ చిరంజీవి అందుకు చక్కటి ఉదాహరణ. అందుకే షర్మిల తాను సాలెగూటిలోకి చేరుకున్నాననే స్పృహ కలిగిఉండి, అందులో క్షేమంగా మనగలగడం, జాగ్రత్తగా భవిష్యత్తును దిద్దుకోవడం ఎలాగో ఆలోచించుకుంటే ఆమెకు మంచిది!

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?