Advertisement

Advertisement


Home > Politics - Opinion

తెదేపా-జనసేన 'వ్యూహం': ఎవడిగోల వాడిది

తెదేపా-జనసేన 'వ్యూహం': ఎవడిగోల వాడిది

ఆర్జీవీ తెరమీద చూపించబోయే "వ్యూహం" ఏమో గానీ, తెదేపా-జనసేన కూటమిలో ఎవడికీ వాడే పర్సనల్ "వ్యూహం" తో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు. 

ఎన్నికల సమరశంఖం పూరించే సమయం దగ్గరపడింది. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి సీటు ఎక్కనీయకుండా చేయడమే తెదేపా-జనసేన లక్ష్యం అని బాహాటంగా అంటున్నా ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. 

ముందుగా లోకేష్ గోల ఏంటో చూద్దాం. ఇతగాడికి తన తండ్రి తర్వాత తానే పార్టీకి సర్వస్వం కావాలని ఉంది తప్ప ఏ పవన్ కళ్యాణ్ కో కమ్మపార్టీని కాపుగాసే క్రెడిట్ ఇవ్వదలచుకోవట్లేదు. 

ఆ మాటకొస్తే సాధ్యమైనంతవరకూ అసలు సీట్లే ఇవ్వకుండా దత్తసోదరుడిని ఉత్తచేతులతో కూర్చోపెట్టే మార్గాలు అన్వేషిస్తున్నాడు. ఒకవేళ తప్పక ఇచ్చినా ఒడిపోవడం ఖాయమనుకునే సీట్లు ఓ పదో పరకో పారేయాలనే ఆలోచన ఉన్నట్టుంది. 

తాను, తన తండ్రి, తన వర్గం విసిగిపోయినట్టుగానే రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ పాలనతో విసుగెత్తిపోయారని గట్టిగా నమ్ముతూ, ఆ జనమే తెదేపాకి అధికారాన్ని పూల్లో పెట్టి ఇస్తారని విశ్వసిస్తూ, ఇక జనసేనకి ఈ విజయంలో భాగస్వామ్యం ఇవ్వడం అవసరమా అనే ఆలోచనల చుట్టూ తిరుగుతోంది అతని మనసు. 

దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నాడు. ఎన్నికలకి మూడు నెలల ముందు జనం మూడ్ ని పూర్తిగా తనవైపే కేంద్రీకృతమయ్యేలా ఏం చేయొచ్చో సలహాలకని పెట్టుకున్నాడు. ఎక్కువడబ్బు పెడితే కోరుకున్న ఫలితమొచ్చేస్తుందని నమ్మి, తన తండ్రి బెయిల్ విషయంలో కోట్లు పోసి సిద్ధార్థ లూథ్రా అనే లాయర్ ని పెట్టుకున్నట్టు ప్రశాంత్ కిషోర్ కి అత్యంత భారీ పారితోషికం కూడా ఇచ్చాడని ప్రచారంలో ఉంది. 

అయితే తన తండ్రి ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా తాను కావాలి కానీ మధ్యలో పక్కపార్టీ నాయకుడు లైన్లో దూరితే ఎలా అని ముందే జాగ్రత్తపడుతున్నాడు. ఇతని గోలంతా పార్టీలో తన స్టాండుని, ప్రజల్లో ఇమేజుని పెంచుకుని చంద్రబాబు తర్వాత నెంబర్-2 గా తానే సర్వంసహా యువరాజుని అని ప్రూవ్ చేసుకోవడమే లోకేష్ గోల. 

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గోల గురించి చెప్పుకుందాం. వ్యూహకర్త పేరుతో రకరకాల పార్టీలకి సేవలు చేసి, వాటిల్లో ఏవో కొన్ని లాటరీలు తగిలి ఈయనొక చాణక్యుడి టైపులో ఇమేజుని సంతరించుకున్నాడు. 

పార్టీల వెనుక మీడియా అధినేతలు ఉండడం ఎప్పటి నుంచో ఉంది. గత దశాబ్దంగా ఈ వ్యూహకర్తలకి కూడా మన రాజకీయ పార్టీలు ప్లాట్ఫాం కల్పించి ఆ రంగాన్ని పోషించాయి. 

అయితే కాలక్రమంలో ఈ వ్యూహకర్తలు అవసరం లేదని వాళ్ల దగ్గర సర్వీసులు పొందిన అన్ని పార్టీలకు అర్ధమయ్యింది. అందుకే ప్రశాంత్ కిషోర్ ని పక్కనపెట్టారు. 

"ఎవరూ పిలవట్లేదా?" అని అడిగే ప్రశ్న ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా "నేనిక వ్యూహకర్తగా ఏ పార్టీకి పని చేయను" అని ప్రకటించాడు పీకే అనబడే ఈ ప్రశాంత్ కిషోర్. 

మొత్తానికి ఏదో ఒకటి చేసుకోవాలి కనుక తానే ఒక పార్టీ పెట్టుకుని బీహార్ లో ఇక్కడ మన పవన్ కళ్యాణ్, కే.ఏ. పాల్, జేడీ లక్ష్మీనారాయణ టైపులో ఉనికి కోసం పోరాడుతున్నాడు. పక్క పార్టీకి స్ట్రాటిజీలు అమ్మినవాడు తన పార్టీకి ఆక్సీజన్ ఇవ్వలేకపోతున్నాడు. 

సినిమాల్లో తప్పులు పట్టుకుని రివ్యూలు రాసే వాడు సొంతంగా హిట్ సినిమా ఎలా తీయాలేడో ఈ పీకే పరిస్థితీ అంతే. 

అలా మూలన కూర్చున్న మాజీ వ్యూహకర్తని లోకేష్ పిలిచాడు. అత్యంత భారీమొత్తం ఇస్తానన్నాడు. వదులుకోవడమెందుకని ఓకే అన్నాడు పీకే. ఇక్కడ పీకేకి కావాల్సింది డబ్బు. అదొక్కటే అతని గోల. తెదేపా నెగ్గితే క్రెడిట్ తీసుకుంటాడు. ఓదితే తాను అన్నమాట ప్రకారం అసలు వ్యూహకర్తగా పని చెయ్యలేదని, చేసిందంతా రాబిన్ శర్మ అని, తన సలహాలు పూర్తిగా పాటించలేదని చెప్తాడు. వ్రతం చెడ్డా డబ్బు రూపంలో ఫలితం ఎలాగైనా దక్కేదే. 

ఇక ఆంధ్రాలోనూ, అమెరికాలోనూ ఉన్న కొందరు కమ్మవారి గోల ఏంటంటే...వీళ్లకి చంద్రబాబు కాకుండా లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఉంది. ఎందుకంటే ఇతన్ని ఈజీగా ఏమార్చవచ్చు. చంద్రబాబు లాంటి సీనియర్ ని ఆడుకోవడం కష్టం. లోకేషునైతే పొగిడో, పూలదండ వేసో, తాయిలమిచ్చో, తీయని మజ్జిగిచ్చో  తమ కాంట్రాక్టుల పర్వాన్ని, దోపిడీని కొనసాగించే అవకాశముంటుంది. అందుకే వారిలో కొందరు నేరుగా చంద్రబాబుకే సలహా రూపంలో యువరాజుకి రాజ్యాధికారం అప్పగించి తమరు ఆరొగ్యం సంగతి చూసుకోండి అని చెప్తున్నారట. 

చంద్రబాబు గోల చాలా సింపుల్. ముందుగా జగన్ ఓడిపోవాలి, ఆ తర్వాత తానో తన కొడుకో సీయం కావాలి. జగన్ ఓటమి విషయంలో కొన్ని భయాలు, కాసిన్ని అనుమానాలున్నా చుట్టూ ఉన్నవాళ్ల ధైర్యం చూసి తాను కూడా ధైర్యం తెచ్చుకుంటున్నాడు. కానీ ఒకవేళ తేడా వస్తే పరిస్థితి ఏంటా అనే భయం పీకుతూనే ఉంది. ఆయన ముఖ్యంలో జైలు జీవితం వల్ల కోల్పోయిన ఆత్మస్థైర్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మునుపటి ఊపు, తెగింపు ఇప్పుడు కనపడట్లేదు. 

ఇక పవన్ కళ్యాణ్ గోల వేరు. తనని తేదేపా ఇన్నాళ్లు పోషించింది రెండు పనులు చేసిపెట్టమని. ఒకటి భాజపాతో పొత్తు కలపమని, రెండు రాష్ట్రంలోని కాపు ఓట్లు తనకు పడేలా చేయమని. మొదటిది ఇప్పటి వరకు జరగలేదు. జరుగుతుందన్న సూచనలు కూడా కనిపించడం లేదు. కనీసం రెండోది అయినా జరుగుతుందా అంటే అది ఇంకా అనుమానంగా ఉంది. 

ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేనకి 45 సీట్లు కావాల్సిందే అని కాపులు పవన్ మీద ఫోర్స్ పెడుతున్నారు. చంద్రబాబేమో అన్ని ఇచ్చేలా లేడు. ఇద్దామనుకున్నా లోకేష్ అడ్డుపడేట్టు ఉన్నాడు. ఆ మాత్రం సీట్లు ఇవ్వందే కాపులు ఓట్లేసేలా లేరు. 45 ఇస్తే వేస్తారట అంటే.. ఆ మాత్రం వాళ్ల నోళ్లు మూయించలేనివాడివి నువ్వేం లీడరువయ్యా అని చంద్రబాబు తిడతాడేమో అని పవన్ కి భయం. 

కాపుల గోల విషయానికొస్తే ఇన్నేళ్ల తమ ఆశలు ఈ సారి కూడా అడియాసలే అవుతున్నాయన్న సంకేతాలు వాళ్లని చుట్టుముడుతున్నాయి. నిజానికి వీళ్లది "గోల" కాదు "బాధ". ఎవరి జెండా మోయాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరు రాజుని చేయాలి...దాని వల్ల ఒనగూరే ఫలితమెవరికి అనే ప్రశ్నలు వేసుకుంటూ కడుపులో ఉన్న బాధకి పూర్తిగా కక్కలేక, అలాగని ఆ చేదు సత్యన్ని మింగలేక నీరసంగా ఉన్నారు జనసేన కాపులు. ఈ చదరంగంలో అందరికంటే దారుణంగా మోసపోతున్నది మాత్రం వీళ్లే. 

ఈ విధంగా ఎవరిగోల వారిది అన్నట్టుగా ఉంది ఏపీలో తెదేపా-జనసేన రాజకీయ చిత్రపటం. ఇలాంటి గోలలో ప్రజల్లో ఎంత ప్రభుత్వవ్యతిరేకత ఉంది? ఉంటే వాళ్లల్లో ఎంతమంది ఈ కూటమికి వేస్తారు అనేది కాలమే చెప్పాలి. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?