Advertisement

Advertisement


Home > Politics - Opinion

ప్రజాస్వామ్య హంతకులు

ప్రజాస్వామ్య హంతకులు

ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మెజారిటీ ప్రజలను మెప్పించిన వాడి చేతికే అధికారం ఇవ్వడం! మెజారిటీ అనే పదానికి నిర్వచనం ఏమిటి? వంద మంది ప్రజలు ఉంటే.. కనీసం 51 మంది ఎవడివైపు మొగ్గుతారో.. వాడే మనకు నాయకుడు! రాబోయే అయిదేళ్లపాటు మన జీవితాలను నిర్దేశించేది వాడే. మనం ఎలా బతకాలో.. ఏం తినాలో కూడా వాడే నిర్ణయించగలడు. ‘మెజారిటీ’ అనే  జనాభిప్రాయాన్ని నిర్ణయించడానికి ఇంతకంటె వేరే మార్గం మనకు లేదు.

తెలంగాణలో ఒక నియోజకవర్గంలో 39 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అయింది. అంటే అక్కడ 20 శాతం ఓట్లు సాధించిన వాడు ఎమ్మెల్యే అవుతాడు. 100 శాతం మంది ప్రజల భవిష్యత్తు, వారి జీవితాలు.. సదరు 20 శాతం మంది మెచ్చిన వాడి చేతిలో ఉంటాయి. దీనిని ఎలాంటి ప్రజాస్వామ్యం అనుకోవాలి?

ఇలాంటి ప్రజాస్వామ్య హననానికి బాధ్యులు ఎవరు? బద్ధకమో, నిర్లక్ష్యమో, నిర్లిప్తతో.. నాయకుల పట్ల ఒక రకమైన అసహ్య భావమో ఏదైనా కావొచ్చు గాక..! కానీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా ఇళ్లలోనే కూర్చుండిపోయే పెడబుద్ధుల మన సోదరులే ఇందుకు బాధ్యులు! వారి వైఖరితో నష్టమేమిటి? ఆ నష్టానికి విరుగుడే లేదా? అనే చర్చను రేకెత్తించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఇల్లు కదలని ఓటరు గణాలు.. ప్రజాస్వామ్య హంతకులు’!

భారతదేశం- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం జబ్బలు చరుచుకుంటూ ఉంటాం. 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం గనుక.. సంఖ్యాపరంగా ఆ సంగతి నిజమే. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యానికి దక్కుతున్న గౌరవం ఎంత? దేశగమనాన్ని నిర్ణయించే చట్టసభల ప్రతినిధులను ఎన్నుకునే ఎన్నికల్లో ప్రజలు ఎంత చురుగ్గా ఉత్సాహంగా బాధ్యతగా పాల్గొంటున్నారు? అనేది కీలకమైన ప్రశ్న. కేవలం మనది జనాభాగా పెద్ద దేశం గనుక మాత్రమే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా కీర్తిని పొందుతూ ఉంటే.. అది చాలా అవమానకరం అనుకోవాలి. ఓటు వేయడానికి గైర్హాజరు కావడం అనేది నగరాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సంపన్న, చదువుకున్న వర్గాల నుంచే ఓటు వేయడం పట్ల విముఖత కూడా వ్యక్తం అవుతోంది. ఎవరిని అడిగినా తమదైన ఒక సొంత వాదన వారు వినిపించవచ్చు. కానీ.. పోలింగ్ శాతం తగ్గడం వలన అందరూ కలిసి అంతిమంగా భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాత్రం అంగీకరించాల్సిందే. ఓటు వేయడానికి రాని వారు సగానికంటె ఎక్కువగా ఉన్నప్పుడు.. అక్కడి ఎన్నికలను మెజారిటీ ప్రజల తీర్పుగా మనం ఏ రకంగా భావించగలం.

నాయకులను మనం నిందిస్తుంటాం. పరిపాలన సరిగా లేదని ఆక్షేపిస్తుంటాం. మనలాంటి వాళ్లు కోకొల్లలుగా ఉంటారు. ఎన్నికల్లో పోటీచేసే ప్రతి వ్యక్తి కూడా అవినీతి స్వరూపంగా వారు భావిస్తుంటారు. వారు దుర్మార్గులని ఆరోపిస్తుంటారు. ఆ దుర్మార్గులను కట్టడి చేయడానికి అస్త్రం తమ చేతిలోనే ఉన్నదని మాత్రం విస్మరించరు. అభ్యర్థులు అందరూ కూడా వారికి గంపగుత్తగా దుర్మార్గులుగా కనిపించవచ్చు గాక.. కానీ, తప్పనిసరిగా పోలింగుకు వచ్చి కనీసం నోటాకు ఓటు వేయడమైనా తమ కర్తవ్యం అని మరచిపోతుంటారు. 

ప్రజలు కరెక్టుగా స్పందించినట్లయితే.. అభ్యర్థులకు దక్కే ఓట్లు ఎలా ఉన్నప్పటికీ.. కనీసం నోటా ద్వారా తమ అసమ్మతిని తెలియజేయడానికి వీలుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజలు ఓటింగ్ పట్ల స్పందిస్తున్న తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. 

తెలంగాణ ఎన్నికల్లో నగరాల్లో నీరసం 

నవంబరు 30 వతేదీన జరిగిన పోలింగులో తెలంగాణ వ్యాప్తంగా 70.34 శాతం ఓటింగ్ జరిగింది. నిజానికి ఇది 2018 ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కంటె 3 శాతం తక్కువ. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 36.9 శాతం నమోదు అయింది. హైదరాబాదు జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 46.56 నమోదు కావడం విశేషం. ఈ గణాంకాలను గమనిస్తే మనకు సిగ్గు అనిపిస్తుంది. నగర జీవులు కనీసం యాభై శాతం మంది కూడా పోలింగులో పాల్గొనలేదు. ఒక నియోజకవర్గంలో కేవలం 37 శాతం ఓట్లు పోల్ అయితే.. 18 శాతం ఓట్లు దక్కిన వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే కాగలడు. మరి అది నిజమైన ప్రజాస్వామ్యం అని ఎలా అనిపించుకుంటుంది?

నగరాల్లో పెద్దగా చదువుకున్న వాళ్లు, సంపన్నులు, ఉద్యోగవర్గాలు ఎక్కువగా ఉంటారని మనం అనుకుంటాం. అందుకే నగరాల్లో ఇచ్చే తీర్పునకు, గ్రామాల్లో వెల్లడయ్యే ప్రజా తీర్పునకు వ్యత్యాసం ఉంటుందని కూడా అనుకుంటాం. కానీ.. ఆ వ్యత్యాసం ఎప్పుడు ప్రతిఫలిస్తుంది. నగరాల్లో ఉన్నవాళ్లంతా నిజంగా ఓటింగులో పాల్గొంటే మాత్రమే కదా? ఎవరికి వారు పోలింగ్ నాడు వచ్చే సెలవురోజును ఎంజాయ్ చేస్తూ టూర్లు ప్లాన్ చేసుకుంటే ఇళ్లలో కూర్చుంటే ప్రజాతీర్పు ఎలా మారుతుంది? అనేది ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్య. 

నిందలు వేసేవారు ఏరీ? ఎక్కడ?

ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల మన్నన చూరగొనడానికి పార్టీలు తాయిలాలు ప్రకటించడం, సంక్షేమ పథకాల పేరుతో వాటిని అమలు చేయడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. తాయిలాలు ప్రకటించడంలో ఔచిత్యం పాటించడం, హద్దులు దాటిపోయి వ్యవస్థలను సర్వనాశనం చేసేయడం అనే రెండు రకాల పార్టీలు మాత్రమే ఉంటున్నాయి తప్ప.. తాయిలాల జోలికి వెళ్లకుండా వాస్తవికమైన, సంక్షేమాన్ని కాంక్షించే.. సమతుల అభివృద్ధిని లక్ష్యించే పరిపాలన అందించే పార్టీలు, అదే ఎజెండాగా పనిచేసే పార్టీలు మనకు ఇప్పుడు కనిపించవు. 

అయితే చదువుకున్న వర్గాలనుంచి చాలా వరకు సంక్షేమ పథకాల రూపంలో ఉండే తాయిలాలపై వెటకారాలు, జోకులు, నిరసనలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఉద్యోగవర్గాలు పన్నులు కడుతూ ఉంటే వారి సొమ్ముతో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు విచక్షణ లేకుండా సొమ్ములను పంచిపెట్టేస్తున్నాయనే విమర్శ చాలా సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ విమర్శలో మంచి చెడుల సంగతి తర్కించడం సంగతి తరువాత, కనీసం అలా విమర్శించే వారు అలాంటి పార్టీలను ఓడించడానికైనా ఓటింగులో పాల్గొనాలి కదా? అది జరగడం లేదు. 

రాజకీయాలు మొత్తం దుర్మార్గులు, దుష్టులు, అక్రమార్కులు, అవినీతిపరులు, రౌడీలతో నిండిపోయాయని ఈసడించుకునే వారు మనకు కోకొల్లలుగా కనిపిస్తుంటారు. వారి ఆవేదనలో నిజం లేకపోలేదు. దీనికి విరుగుడుగా మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చే పెద్దలు కూడా మనకు తారసపడుతుంటారు. కేవలం మంచితనం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే తత్వమే మౌలిక లక్షణాలుగా ఎవడైనా ముందుకు వస్తే టికెట్ ఇచ్చి ప్రోత్సహించే పరిస్థితిలో ఇవాళ పార్టీలు ఉన్నాయా? ధనబలం ఎంత ఉన్నదో.. తూకం వేయకుండా అభ్యర్థులను ఎంపికచేసే సంస్కృతి మనకు వాడుకలో ఉన్నదా? అనేది కీలకమైన ప్రశ్న. 

ఈ చర్చను కూడా పక్కన పెట్టేద్దాం. మంచి వాళ్లు ఎన్నికల బరిలోకి వచ్చి.. భంగపడాల్సిన అవసరం లేదు. కనీసం, రాజకీయాల్లో దుష్టులున్నారని నిందించేవాళ్లందరూ తప్పనిసరిగా పోలింగు కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి కదా.. అది కూడా జరగడం లేదు. ఓటు వేయకుండా, రాజకీయ/ ప్రజాస్వామ్య వ్యవస్థ చెడిపోతున్నదని రంకెలు వేస్తూ.. గట్టున కూర్చుని ఆవేదన చెందుతున్న వాళ్లే మనకు సర్వత్రా కనిపిస్తారు. తమ నిష్క్రియాపరత్వంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థను అభాసుపాలు చేస్తుంటారు. 

వ్యవస్థలో లోపాలు లేవనలేం..

ఎన్నికల వ్యవస్థ పరంగా అంతా అద్భుతంగానే ఉన్నదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి లేదా, మరింత మంది పోలిగులో పాల్గొనేలా చేయడానికి వ్యవస్థ అంతా సంపూర్ణంగా కృషిచేస్తున్నదా? ప్రజల్లో ఆ మేరకు విశ్వాసాన్ని పెంచుతున్నదా? అనే చర్చ కూడా ఒకవైపు ఉంది. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు లేవని మనం అనలేం. 

అభ్యర్థులు నచ్చని వారిని కూడా పోలింగుకు వచ్చేలా చేసేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అందరిలోనూ గౌరవం ఉన్నదని నిరూపించేందుకు ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు నోటా! పైన చెప్పుకున్నట్టుగా అభ్యర్థులు అందరూ పనికిరాని వాళ్లేనని అసహ్యించుకునే వాళ్లు నోటాకు ఓటు వేయడం ద్వారా.. తమ మనోగతాన్ని, ప్రాధాన్యాన్ని పార్టీలకు తెలియజేయవచ్చు. అందుకోసం నోటా బటన్ కూడా ఈవీఎం లలో తీసుకువచ్చారు. ప్రతి ఎన్నికలోనూ.. ఓ మోస్తరుగా నోటాకు కూడా ఓట్లు పడుతూనే ఉన్నాయి. కానీ.. నోటా అనేది కూడా ఈ వ్యవస్థలో హాస్యాస్పదం అవుతున్నది.

మనలో చాలా మందికి తెలుసోలేదో గానీ.. నోటాకు ఓటు వేయడం వలన కేవలం మనలోని అసంతృప్తిని బయటకు పంపేయడం మాత్రమే అవుతుంది. అంతే తప్ప.. ఎన్నికల ప్రక్రియలో దాని ద్వారా సాధించేదేమీ ఉండదు. ఈ విషయం సుప్రీం కోర్టు స్థాయిలో చర్చకు వచ్చినప్పటికీ కూడా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటాకు పడిన ఓటును కేవలం ‘చెల్లని ఓటు’గా మాత్రమే పరిగణిస్తారు. 

అంటే ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో పోలైన ఓట్లలో యాభైశాతానికంటె ఎక్కువ ఓట్లు నోటాకు పోలైతే గనుక.. దాని అర్థం ఏమిటి? మెజారిటీ ప్రజలు.. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికూడా తమకు నాయకుడిగా పనికిరాడని అసహ్యించుకుంటున్నట్టు లెక్క. మరి అలాంటి సందర్భంలో ఏం జరగాలి? అక్కడి ఎన్నికను రద్దుచేసి.. మళ్లీ మొత్తం నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహిస్తారేమోనని మనం అనుకుంటాం. కానీ నిబంధనల ప్రకారం అలా జరగదు. యాభై కాదు కదా, అరవై శాతం మంది నోటాకు ఓటు వేసినా.. మిగిలిన 40లో 21 శాతం ఓట్లు ఎవరికి దక్కితే వారు నాయకుడై.. మొత్తం వందమంది నెత్తిన కూర్చుని ఏలుబడి సాగిస్తారు.

కీలకం ఏంటంటే.. నోటాకు వేసిన ఓటును ఎన్నికల ప్రక్రియలో చెల్లని ఓటుగా మాత్రమే పరిగణిస్తారు. ఇంతమంది నోటాకు ఓటు వేశారని మనం లెక్కలు వేసుకోవాల్సిందే తప్ప.. అవని చెల్లని ఓట్లే. మెజారిటీ నోటాకు పడితే.. రీపోలింగ్ నిర్వహించే ఏర్పాటు ఉన్నట్లయితే కొంచెం మార్పు ఉంటుందని కనీసం ఊహించవచ్చు. కానీ.. అలాంటి ఏర్పాటు మన వ్యవస్థలో లేదు. ప్రజల ఓటు హక్కును, ఏదైతే పాశుపతాస్త్రం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అలాంటి- ప్రజల చేతిలోని ఓటు హక్కును సాక్షాత్తూ ఎన్నికల సంఘమే నవ్వుల పాలుచేస్తున్న నిబంధన ఇది. 

నిర్బంధఓటు సాధ్యం కాదా?

ఎన్నికల వ్యవస్థలో ఏ మంచి మార్పును తీసుకురావాలన్నా సరే.. ఇది అతి పెద్ద దేశం.. 150 కోట్ల జనాభా ఉన్న దేశం.. వివిధ భౌగోళిక, వాతావరణ వైవిధ్యాలున్న దేశం.. ఆచరణలో అలాంటి మంచి మార్పులు సాధ్యం కావు అనే నకారాత్మక భావనతోనే ప్రతిదానిని ప్రారంభించడం మనకు అలవాటు అయిపోయింది. కానీ మనకంటె చిన్న దేశాలే అయినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవిస్తున్న అనేక దేశాల్లో నిర్బంధ ఓటు విధానం అమలులో ఉంది. ఓటును అనుమతించే వయసు వచ్చిన ప్రతి ఒక్కరూకూడా ఓటు వేసి తీరాలి. లేకపోతే శిక్షలుంటాయి! ఈ శిక్షలు ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా అమలవుతున్నాయి. 

ఆస్ట్రేలియాలలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. వేయకపోతే.. 20 డాలర్ల జరిమానా విధిస్తారు. బెల్జియంలో మొదటిసారి ఓటు హక్కు వాడుకోకపోతే 80 యూరోలు, రెండోసారి కూడా వేయకపోతే 200 యూరోలు జరిమానా ఉంటుంది. వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే ఓటరు లిస్టులో వారి పేరు తీసేస్తారు. పోతే పోయింది అనుకోడానికి వీల్లేదు. 

అలాంటి వారికి ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఉండదు. అలాంటి అన్ని అవకాశాలను వారు కోల్పోతారు. బ్రెజిల్ లో కూడా జరిమానా ఉంది. గ్రీసు, ఈజిప్టు దేశాల్లో అయితే.. ఓటు వేయని వారిపై విచారణ చేపడతారు. సరైన కారణం చెబితే సరే, లేకపోతే జైలుశిక్షే. పెరూలో ఓటు వేయని వారి డ్రైవింగు లైసెన్సు రద్దవుతుంది. ఇలా ఒక్కోదేశంలో ఒక్కో రకమైన నిబంధనలతో ప్రజలందరూ కూడా అనివార్యంగా ఓటింగులో పాల్గొనే ఏర్పాట్లున్నాయి. 

సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందుతున్నాం. అద్భుతాలు సృష్టిస్తున్నాం ఇంత చేస్తుండగా.. సాకులు వెతుక్కోకుండా మనదేశంలో కూడా నిర్బంధ ఓటు విధానాన్ని మనం తీసుకురాలేమా? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

ప్రజాస్వామ్యం అనేది ప్రజలు వేసే ఓటు మీదనే ఆధారపడి నిర్మాణం అయ్యే అతిగొప్ప వ్యవస్థ. అలాంటప్పుడు అసలు ఓటు వేయకుండా ఉండే వారికి.. ప్రజాస్వామ్యంలో దొర్లే లోపాల గురించి మాట్లాడే హక్కు లేదు. దేశం సరైన అభివృద్ధిని, సరైన దిశలో సాధించాలంటే.. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే సాధ్యమవుతుంది. 

ప్రతి ఒక్కరూ ఓటింగులో పాల్గొన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని కూడా గుర్తుంచుకోవాలి. ఓటు వేయకుండా ఆగిపోయేవారు.. అలాంటి పనిద్వారా.. తమ నిరసనను ప్రకటిస్తున్నామని సమర్థించుకోవచ్చు గాక.. కానీ.. ఎంతో ఉన్నతమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థను హత్య చేస్తున్నారని కూడా గ్రహించాలి. 

..ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?