Advertisement

Advertisement


Home > Politics - Opinion

వైకాపా-తెదేపా: అంత నమ్మకం-కొంత అపనమ్మకం

వైకాపా-తెదేపా: అంత నమ్మకం-కొంత అపనమ్మకం

ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. ఏ రోజుకారోజు రాజకీయ వార్తలతో వాతావరణం వేడెక్కుతోంది. 

ఒక పక్కన జగన్ మోహన్ రెడ్డి ఈ సారి ఎవరికి టికెట్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు అనేదే పెద్ద చర్చగా ఉంది. మరో పక్క తెదేపా-జనసేన కూటమి నుంచి అప్డేట్స్ వినడానికి ప్రజలు చెవులు రెక్కించి ఎదురు చూస్తున్నారు. ఈ వాతావరణంలో గమనిస్తున్న విషయాలను బట్టి ఎవరు గెలుస్తామని నమ్మకంగా ఉన్నారు? ఎవరు అపనమ్మకంగా ఉన్నారు అనేది చెప్పుకుందాం. 

వైకాపా బాస్ జగన్ మొహన్ రెడ్డికి గెలుపుపై నమ్మకముంది..కానీ కేడర్ కు ఎక్కడో అనుమానం. తెలంగాణాలో ఎన్నికల ఫలితం చూసాక ప్రజలు ఊహించని ట్విస్ట్ ఇస్తారేమో అన్న అనుమానాలు కింది స్థాయి నాయకుల్లో కనిపిస్తోంది. వారి మాటల్లో తిరుగులేని ఆత్మస్థైర్యం అయితే కనిపించడంలేదు. అయితే టంచనుగా అందుతున్న పథకాలు, వాలంటీర్ వ్యవస్థ పార్టీని గట్టెక్కిస్తాయిలే అని సర్ది చెప్పుకుంటున్నారు. అంతలోనే...అన్నీ బానే ఉన్నా జనం మార్పు కోరుకుంటే పరిస్థితి ఏంటనే ఆలోచన!! ఇలా ఉంది వాళ్ల పరిస్థితి. 

కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అసలు ఆయన ఎత్తుకున్న నెంబరే 175/175 అని. పోనీ అంత కాకపోయినా కచ్చితంగా ప్రస్తుత 151 కంటే ఎక్కువ సీట్లే వస్తాయన్న ఆశాభావం ఆయన మాటల్లో బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తోంది. 

ఆయన్లో ఇంత అత్మస్థైర్యానికి కారణమేంటి? ఆయన గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమయ్యి లేరు. పాదయాత్రల వంటివి చేసి ఓటర్ల మనోగతం పై ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ సంపాదించున్న దాఖలా లేదు. ఆయన కాంఫిడెన్స్ కి కారణమల్లా చుట్టూ ఉన్న వ్యక్తులు ఇస్తున్న సర్వే రిపోర్టులు. వాటికి తోడు ఆయన కంటికి బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థులు. 

బాహుబలి సినిమాలో ఒక యుద్ధ సన్నివేశంలో అపనమ్మకంతో ఉన్న సైనికుల్ని ఉత్తేజపరిచే విధంగా ప్రభాస్ ప్రసంగం చేసినట్టు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ విధంగా తన కేడర్ కి ధైర్యాన్ని నూరిపోసుకోవాల్సిన సమయమిది. 

ఇక తెదేపా విషయానికొస్తే కంప్లీట్ రివర్స్. అక్కడ ఎవర్ని కదిపినా "ఈ సారి వచ్చేస్తున్నాం" అనే అంటున్నారు. ఎన్నికల్లో గెలుపు గ్యారెంటీ అని నమ్మి కౌంట్ డౌన్ చేసుకుంటూ వేచి చూస్తున్నారు. కానీ చంద్రబాబులో మాత్రం ఆ నమ్మకం ఆవగింజంతైనా కనిపించడం లేదు. అందుకే పావలాకి పనికి రాని జనసేనతో పొత్తు, భారీగా ఖర్చుపెట్టుకుని మరీ ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల సలహాదారుగా పెట్టుకోవడం, ఇప్పటికీ భాజపా అభయం కూడా ఏదో రకంగా దక్కుతుందేమోనని ఆశపడుతుండడం...ఇలా ఉంది పరిస్థితి. 

అంటే ఇక్కడ కేడర్ అంతా కలిసి చంద్రబాబుకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి. బహుశా ఊహించని విధంగా జైల్లో పడ్డప్పటి మెంటల్ ట్రామా ఇంకా ఆయనను వీడినట్లు లేదు. తనకి ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డి చాలా బలంగా కనిపిస్తున్నాడు. ఆయన తీరులో అది ప్రస్ఫుటంగా తెలుస్తోంది.

జగన్ లాగ ధైర్యం చేసి టికెట్స్ ఇచ్చే విషయంలో మునుపటి అభ్యర్థుల్ని మార్చడం లాంటి పనులు ససేమిరా చేయలేని పరిస్థితి చంద్రబాబుది. ఎవరిని నొప్పిస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే విధంగా భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే దయనీయంగా, అయోమయంగా ఉంది. ఈయనని నమ్ముకున్న జనసైనికులకి ధైర్యాన్ని, నమ్మకాన్ని పంచకపోగా వార్ణింగులు ఇస్తున్నాడు. 

తెదేపా-జనసేన పొత్తు మీద నమ్మకం లేకపోతే పార్టీని వీడి పొమ్మంటున్నాడు. ముందు కూటమిని గెలిపించండి...ముఖ్యమంత్రి ఎవరనేది తాను, చంద్రబాబు చూసుకుంటామని చెప్తున్నాడు. ఈ తింగరితనమేంటో అర్ధం కాక జనసైనికులే తలలు పట్టుకుంటున్నారు. 

దానికి తోడు తెలంగాణా ఎన్నికల్లో నిలబడ్డ 8 చోట్ల జనసేన పర్ఫార్మెన్స్ చూసి జనసైనికులు డీలాపడితే, ఈ పార్టీతో పొత్తు అవసరమా అనుకుంటున్నారు తెదేపా కేడర్. బాబుకి నచ్చజెప్పి జనసేన లేకపోతేనే బెటరని చెప్పాలని వాళ్లల్లో అధికశాతం మంది అనుకుంటున్న మాట వాస్తవం. 

ఇలా నమ్మకాలు, అపనమ్మకాలు ఇరు శ్రేణుల్లోనూ ఉన్నాయి. ఎవరి గందర్గోళంలో వాళ్లున్నారు, ఎవరి ఆనందంలో వాళ్లు తేలియాడుతున్నారు. అంతిమంగా విజయం ఎవర్ని వరిస్తుందో, ఎవరి అంచనాల్ని కాలం నిజం చేస్తుందో చూడాలి. 

రానున్న మూడు నెలలు ఓటర్ల ఆలోచనల్ని ప్రభావితం చేసే విషయంలో చాలా కీలకం. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కూడా చివరి మూడు నెలలే లెక్కల్ని మార్చాయి. దానిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల బరిలోకి దిగబోతున్న పార్టీలు అడుగులు వెయ్యాలి. ఆపైన ఓటర్ల నిర్ణయం, దైవాధీనం. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?