ఆ ఇద్ద‌రికి ప్ర‌కాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్‌

ఈ నెల‌ 10న జ‌ర‌గ‌నున్న ‘మా’ ఎన్నిక‌లు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. ప్ర‌శ్న‌ల‌తో మొద‌లై నిల‌దీత‌ల వ‌ర‌కూ వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  ‘మా’ తాజా మాజీ  అధ్య‌క్షుడు న‌రేశ్‌, అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన మంచు…

ఈ నెల‌ 10న జ‌ర‌గ‌నున్న ‘మా’ ఎన్నిక‌లు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. ప్ర‌శ్న‌ల‌తో మొద‌లై నిల‌దీత‌ల వ‌ర‌కూ వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  ‘మా’ తాజా మాజీ  అధ్య‌క్షుడు న‌రేశ్‌, అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన మంచు విష్ణుపై ప్ర‌ధాన‌ ప్ర‌త్య‌ర్థి ప్ర‌కాశ్‌రాజ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. న‌రేశ్ మ‌ర్యాద‌గా మాట్లాడటం నేర్చుకోవాల‌ని, అలాగే మంచు విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ప్ర‌కాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌కాశ్‌రాజ్ సూటిగా మాట్లాడారు. మంచు విష్ణుతో పాటు న‌రేశ్‌పై పంచ్‌లు విసిరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌పై అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించి లౌక్యుడ‌నిపించుకున్నారు. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్, ఆయ‌న‌ అభిమానుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

తాను చెప్పని మాటలను చెప్పానని  ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ అబద్ధాలు ఆడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ప్రకాశ్‌రాజ్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. దమ్ముంటే ఎన్నికల్లో దిగాల‌ని, కృష్ణుడినవుతా, రథం ఎక్కుతాన‌నే మాటలెందుకు అని న‌రేశ్‌ను నిల‌దీశారు. అలాగే తాను స్థానికేత‌రుడ‌నే అంశాన్ని తెర‌పైకి తేవ‌డాన్ని ఆయ‌న తిప్పికొట్టారు.

తాను తెలుగువాడిని కాద‌ని స్ప‌ష్టం చేశారు. కర్ణాటకలో పుట్టాన‌ని చెప్పుకొచ్చారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నటుడిగా ఎదిగిన‌ట్టు తెలిపారు. అంతమాత్రాన తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ‘మా’ నియమాల్లో ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రెండుసార్లు జాతీయ అవార్డులు, 9 నందులు తీసుకున్నాన‌ని, అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా? అని ప్ర‌కాశ్ రాజ్ స‌వాల్ విసిరారు.

ప్ర‌ధానంగా మంచు విష్ణుపై ప్ర‌కాశ్‌రాజ్ విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల నామినేష‌న్ సంద‌ర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌కాశ్‌రాజ్‌కు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్‌రాజ్ వాటిని ప్ర‌స్తావిస్తూ మంచు విష్ణుకు దీటైన కౌంట‌ర్ ఇచ్చారు.

‘మీరు పవన్‌కల్యాణ్‌ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని ప్ర‌కాశ్‌రాజ్ అన్నారు. పవన్‌ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ఆయ‌న  ప్ర‌శ్నించారు. పవన్‌కల్యాణ్  ప్రసంగాన్ని విశ్లేషించాల‌ని కోరారు. మొదట ఆయన సినీ నటుడ‌ని, ఆ తర్వాతే రాజకీయ నాయకుడ‌న్నారు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. అంత‌టితో ప్ర‌కాశ్‌రాజ్ ఆగ‌లేదు.

‘పవన్‌కల్యాణ్‌ మార్నింగ్‌ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్‌. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని మంచు విష్ణుకు ప్ర‌కాశ్‌రాజ్ త‌న‌దైన స్టైల్‌లో హిత‌వు, హెచ్చ‌రిక చేయ‌డం టాలీవుడ్‌లో కాక రేపుతోంది. పొలిటికల్‌ అజెండా ఉంటే మీరు చూసుకోండ‌ని మంచు విష్ణును ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం.  ‘మీరు పవన్‌కల్యాణ్‌ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా’ అంటూ త‌న‌నెందుకు  లాగుతున్నార‌ని ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌శ్నించారు.

అలాగే ‘మా’ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్‌ను లాగొద్దని ప్ర‌కాశ్‌రాజ్ కోరారు. ఆయన పాదయాత్ర చేసి, ప్రజల మనసు గెలుచుకుని సీఎం అయ్యారని తెలివిగా స‌మాధానం ఇచ్చారు. అలాగే  కేసీఆర్‌ ఉద్యమం చేసి, ఒక సీఎం అయ్యార‌న్నారు. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నార‌ని ప్రకాశ్‌రాజ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 

ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ త‌న‌కు బావ అవుతార‌ని, అలాగే కేసీఆర్ స‌ర్కార్‌తో స‌త్పంబంధాలున్నాయ‌ని మంచు విష్ణు అన్న మాట‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌కాశ్‌రాజ్ స్పందించారు.