హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!

ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడమంటే…

ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడమంటే రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం గులాబీ పార్టీ ఆ పనిలోనే ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, పార్లమెంటు ఎన్నికల్లో చతికిలబడి, పార్టీ ఫిరాయింపులతో కకావికలవుతున్న గులాబీ పార్టీ మళ్ళీ పైకి లేవడానికి, జవసత్వాలు పుంజుకోవడానికి హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు ఔషధంలా పనిచేస్తున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో ఆ నది పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను కొన్ని రోజులుగా కూల్చేస్తున్నారు.

రివర్ బెడ్ లో, బఫర్ జోన్ లో నిర్మించిన చిన్నా చితక పేదల ఇళ్లతోపాటు పెద్ద భవనాలను , విల్లాలను, అపార్ట్ మెంట్లను కూల్చిపారేస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇస్తున్నారు. కూల్చిన ఇళ్లలో కొత్తగా కట్టినవి, దశాబ్దాల కిందట కట్టినవి కూడా ఉన్నాయి.

ఓట్ల రాజకీయాల కారణంగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఈ ఇళ్ల జోలికి రాలేదు. అసలు పట్టించుకోలేదు. అధికారులు కూడా అవినీతికి పాల్పడి అనుమతులు ఇచ్చారు. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2016 లో నగరంలో అక్రమ కట్టడాలు దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటాయని, వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని వీరంగం వేశాడు.

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హడావుడి చేశాడు. మూసీ సుందరీకరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తామన్నాడు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదు. పైగా ఈ పదేళ్లలో గులాబీ పార్టీ నాయకులే చెరువుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా భారీ భవనాలు నిర్మించారు. అపార్ట్ మెంట్లు కట్టారు. ఫామ్ హౌజ్ లు కట్టారు. అయినా ప్రభుత్వం కళ్ళు మూసుకుంది.

ఇప్పడు రేవంత్ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటుచేసి అక్రమ నిర్మాణాలు కూలుస్తుంటే కేటీఆర్ అండ్ హరీష్ రావు మండిపడుతున్నారు. బాధితులు కూడా తమను గులాబీ పార్టీ తమను రక్షిస్తుందని వారి వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. బావా బావమరిది ప్రభుత్వం మీద రెచ్చిపోతున్నారు. బాధితుల తరపున కోర్టులో పోరాడటానికి లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

ఇళ్ళు కోల్పోయినవారికి పూర్తి సపోర్ట్ గా ఉన్నారు. ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించవచ్చు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బాధితులకు అండగా ఉండటంలో కమలం పార్టీ విఫలమైంది. ఆ పార్టీ వైపు బాధితులు చూడటం లేదు.

ముఖ్యంగా కూల్చివేతల విషయంలో గులాబీ పార్టీకి ఒక విధానముంటే బీజేపీకి అలాంటిది లేదు. నాయకులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ కూల్చివేతలపై ఆగ్రహిస్తుంటే, మరో ఎంపీ రఘునందనరావు సమర్ధిస్తున్నాడు. దీన్ని జిల్లాలకు కూడా విస్తరించాలంటున్నాడు. ఏది ఏమైనా బీజేపీలో ఎన్నికల్లో ఉన్న ఊపు, జోష్ ఇప్పుడు లేవని చెప్పొచ్చు.

9 Replies to “హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!”

Comments are closed.