పుకార్ల ఖండన ఇలా కాదు కేటీఆర్!

‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’ అని పెద్దలు అంటూ ఉంటారు. తోచుబాటు కాకుండా యథాలాపంగా పుట్టిన సామెత కాదు ఇది. చాలా అర్థవంతమైన సామెత! ప్రత్యేకించి రాజకీయ నాయకులు సదా గుర్తుంచుకోవాల్సిన సామెత. ఎందుకంటే కేవలం…

‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’ అని పెద్దలు అంటూ ఉంటారు. తోచుబాటు కాకుండా యథాలాపంగా పుట్టిన సామెత కాదు ఇది. చాలా అర్థవంతమైన సామెత! ప్రత్యేకించి రాజకీయ నాయకులు సదా గుర్తుంచుకోవాల్సిన సామెత. ఎందుకంటే కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని అర్థంపర్థం లేకుండా ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండేది ఆ రంగంలో మాత్రమే.

నిరాధార ఆరోపణలు పుకార్ల విషయంలో స్పందించకుండా ఉండడం మాత్రమే విరుగుడు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, పదేళ్లు అధికారం చలాయించిన పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా చలామణి అయినప్పటికీ కేటీఆర్ కు ఈ తత్వం బోధ పడినట్టుగా లేదు. ఆయన పుకార్లకు స్పందించి మీరందరూ వివరణ ఇవ్వాలి అంటున్నారు.

ఇలా భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తానే స్పందించి ప్రకటనలు చేస్తే ఆ పుకార్లకు కూడా మరింత విలువ వస్తుందని సత్యాన్ని ఆయన తెలుసుకోవడం లేదు.

భారాస త్వరలోనే మరో పార్టీలో విలీనం కాబోతున్నదంటూ ఇటీవలి కాలంలో పుకార్లు వినిపిస్తున్నట్టున్నాయి. ఈ పుకార్లు కేటీఆర్ ను నొప్పించినట్లుగా ఉన్నాయి. ఆ పుకార్లను ఆయన ఖండించారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వివరణ ఇవ్వాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

నిజానికి ఇలాంటి విషయాల్లో చట్టపరమైన చర్యలు అనేవి తేలడం చాలా కష్టం. కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా కాకుండా.. సదరు వ్యక్తులకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపి.. ఆ తర్వాత ఇదే మాట చెప్పి ఉంటే బాగుండేది. ఇంకాస్త బలంగా ఉండేది.

కానీ ప్రత్యేకించి రాజకీయాల్లో ఇలాంటి పుకార్లకు సంబంధించి.. కౌంటర్ చేయడానికి ఒక మార్గం ఉంటుంది. ఏ పార్టీతో ముడిపెట్టి పుకార్లను లేవనెత్తుతున్నారో.. ఆ పార్టీ మీద నిశిత విమర్శలతో విరుచుకుపడడం ఒక్కటే మందు. ఈ సత్యం, సూత్రం కేటీఆర్ కు తెలియనిది కాదు. ఎన్నికలకు ముందు బిఆర్ఎస్, బిజెపితో అంటకాగుతున్నట్టుగా అనేక పుకార్లు వచ్చాయి. గులాబీ దళాలు ఖండించి ఊరుకోలేదు.. నోటీసులు ఇవ్వలేదు. బిజెపిని నానా మాటలు తిట్టడం ద్వారా, వారి వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా మాత్రమే జవాబిచ్చారు. అదే కౌంటర్ అయింది.

ఇప్పుడు విలీనం వార్తలు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ అలా చేస్తే బాగుండేది. కానీ.. ఆయన వివరణ ఇవ్వకుంటే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఒకవైపు పార్టీని కాపాడుకోవడంలో, మరోవైపు చెల్లెలిని లిక్కర్ స్కాం కేసు నుంచి కాపాడుకోవడంలో బిజీగా ఉన్న కేటీఆర్.. ఇంకాస్త స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

4 Replies to “పుకార్ల ఖండన ఇలా కాదు కేటీఆర్!”

Comments are closed.