సీనియర్లకు ఒక పదవి చాలదంట!

చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల పందేరం గురించి కసరత్తు ప్రారంభించారని వార్తలు వస్తుండగా.. అధికార కూటమిలోని సీనియర్ నాయకులకు కొండంత ఆశలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాము గరిష్టంగా లబ్ధి పొందకపోతే ఎలా…

చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల పందేరం గురించి కసరత్తు ప్రారంభించారని వార్తలు వస్తుండగా.. అధికార కూటమిలోని సీనియర్ నాయకులకు కొండంత ఆశలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాము గరిష్టంగా లబ్ధి పొందకపోతే ఎలా అని వారు మధనపడిపోతున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కని సీనియర్లది ఒక బాధ అయితే.. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ మంత్రి పదవికి దూరంగా ఉండి పోవాల్సి వచ్చిన సీనియర్లది మరొక బాధగా ఉంది.

చంద్రబాబు నాయుడు రకరకాల భవిష్యత్తు వ్యూహాల నేపథ్యంలో ఇప్పటి మంత్రివర్గ కూర్పును చేశారు. అప్పట్లో ఆయనకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయిన సీనియర్ నాయకులు- ఇప్పుడు ఒత్తిడి పెంచుతున్నారు. ఎటూ తమకు మంత్రి పదవి ఇవ్వలేదు కనుక.. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో క్యాబినెట్ హోదా ఉండే పెద్ద పదవులు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరానికి సంబంధించి కసరత్తు ప్రారంభించిన నాటి నుంచి అధినేత మీద ఈ ఒత్తిడి పెరుగుతోంది.

సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం దక్కకుండా మిగిలిపోయిన నాయకులు, ఎన్నికల అవసరాల కోసం త్యాగాలు చేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కుతూ ఉంటుంది. అయితే ఈదఫా ట్విస్ట్ ఏమిటంటే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నామినేటెడ్ పదవుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు. తమను విస్మరించడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు.

రాష్ట్రంలో మంత్రి పదవితో సమానమైన అంతకంటే ఎక్కువ అని భావించగలిగే నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో టీటీడీ చైర్మన్ పదవి అన్నింటి కంటే ముందు వరసలో ఉంటుంది. దీనికోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య బాగానే ఉన్నట్టు సమాచారం.

చంద్రబాబు దృష్టిలో పార్టీ కోసం పనిచేసిన బయటి వ్యక్తుల పేర్లు ఉండగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు కూడా తపన పడిపోతున్నారు. ఎమ్మెల్యేలే నామినేటెడ్ పదవులకు పోటీపడుతుండడం పట్ల తీవ్రమైన అసహనం పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఒక పదవి చాలదన్నట్టుగా ఉన్న వారి తీరు గురించి నాయకులు చర్చించుకుంటున్నారు. మరి చంద్రబాబు ఈ ఒత్తిళ్లను తట్టుకుని.. ఎలా పదవులు పంచుతారో వేచిచూడాలి.

5 Replies to “సీనియర్లకు ఒక పదవి చాలదంట!”

Comments are closed.