తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భర్తీ చేయాల్సిన పదవులు నాలుగు ఉండగా, ఆశావహులు అనేకమంది ఉన్నారు. అధిష్టానం మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో లిస్ట్ తయారు చేసినప్పటికీ, పదవులు కోరుకుంటున్న వారు చివరి ప్రయత్నంగా అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, తాము పార్టీకి చేసిన సేవల గురించి, తమ అర్హతల గురించి విన్నవించుకున్నారు.
మంత్రి పదవులు దక్కని సామాజికవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యంగా లంబాడా, మాదిగ సామాజికవర్గాల నేతలు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. ఇక ఈ సామాజికవర్గాలకు సంబంధించి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మంత్రి పదవుల కోసం ఖరారు చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాజగోపాల్ రెడ్డి విషయానికొస్తే, ఇప్పటికే ఆయన అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎలా ఇస్తారనే ప్రశ్న వస్తోంది. ఇక వివేక్ విషయానికొస్తే, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యే. వారి కుటుంబ సభ్యుడే వంశీకృష్ణ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే, నాలుగు పదవులు ఇచ్చినట్లు అవుతుంది. దీనిపైనా మాదిగ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకతకు అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో తెలియదు.
ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేదానిపైన అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎవరికి మంత్రి పదవులు ఇస్తారో, వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా రాశారు. పేర్లు బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి, వివేక్‌కు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ప్రతిపక్ష సభ్యులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. కాబోయే హోం మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి అని భావిస్తున్నారు.
అయన కూడా తనకు హోం శాఖ అంటే ఇష్టమని మీడియాకు చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారో లిస్ట్ కూడా వచ్చింది. దాని ప్రకారం… వివేక్ వెంకటస్వామికి మున్సిపల్ శాఖ, సుదర్శన్ రెడ్డికి విద్యాశాఖ, రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ, శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం హోం శాఖ, విద్యా శాఖ సీఎం దగ్గరే ఉంటాయి. వాటిని కొత్త మంత్రులకు కేటాయించరు. ఇప్పుడున్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.
If it’s true, then that’s the countdown to congress government.