ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోవాల్సిందే!

కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారుగానీ మంత్రులెవరూ రేవంత్ ను అదే పనిగా పొగడటంలేదు.

రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ప్రజలను నమ్మించాలి. అంటే తమ పాలనకు సంబంధించి గొప్పలు చెప్పుకోవాలి. మసాలా దట్టించి మీడియాలో ప్రచారం చేసుకోవాలి. గత ప్రభుత్వ పాలనకంటే తమ పాలనే బాగుందని అదే పనిగా పాట పాడాలి.

కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే తీరు. ఇదే ధోరణి. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఆ పార్టీ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్, ఇతర నాయకులు అదే పనిగా గొప్పలు చెప్పుకునేవారు. డెబ్బయ్ ఏళ్లలో జరగని అభివృద్ధి అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండగా తెలంగాణలో జరగని అభివృద్ధి గులాబీ పార్టీ పాలనలో పదేళ్లలో జరిగిందని ప్రచారం చేసుకునేవారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి అదే పనిగా ఊదరగొట్టేవారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. తేడా ఏమిటంటే గులాబీ పార్టీలో మంత్రులందరూ కేసీఆర్ ను విపరీతంగా పొగిడేవారు. కానీ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారుగానీ మంత్రులెవరూ రేవంత్ ను అదే పనిగా పొగడటంలేదు. గులాబీ పార్టీ పాలనలో కేసీఆర్ అంటే నాయకులకు, మంత్రులకు భయభక్తులు ఉండేవి.

కానీ కాంగ్రెస్ మంత్రులకు అలాంటిది లేదు. వాళ్లందరికంటే రేవంత్ రెడ్డి పార్టీలో జూనియర్. అధిష్టానం రేవంత్ ను సీఎం చేసింది కాబట్టి లోపల ఏమనుకుంటున్నా పైకి గమ్మున ఉంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగానే గులాబీ పార్టీ సర్కారు పదేళ్లలో చేయని అభివృద్ధిని తాము పది నెలల్లో చేసి చూపించామంటున్నాడు. ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. కేసీఆర్ మాదిరిగానే ప్రధాని మోడీకి సవాళ్లు విసురుతున్నాడు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కూడా బాగానే ఉన్నాయి. అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానాల్లో కొన్నిటిని అమలు చేయలేదు. హామీల్లో కొన్ని విపరీతమైన ఆర్ధిక భారం మోపేలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్ధిక సాయం చేయడంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. అది అమలు చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీకి భారమైందని చెబుతున్నారు.

మహిళలకు నెలకు రెండు వేల ఐదొందల పథకం కూడా భారమే. అయినా జనవరి నుంచి అమలు చేస్తామని చెబుతున్నారు. మరికొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ అధికారంలో వచ్చిందంటే కేసీఆర్ పాలనలో వైఫల్యాలు, నియంతృత్వ ధోరణే కారణమని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. కేసీఆర్ సక్రమంగా వ్యవహరించినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదంటారు.

8 Replies to “ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోవాల్సిందే!”

Comments are closed.