Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 1

ఇది కొత్త సీరియల్‌. పళ్లు పటపటలాడించకండి. అరిగిపోతే కొత్తవి వేయించుకోవాలి. బోల్డు ఖర్చు. నా రాజకీయ వ్యాసాల్లో అప్పుడప్పుడు ఎమర్జన్సీ రోజుల గురించి ప్రస్తావిస్తే ఎమర్జన్సీ గురించి రాయండి అని చాలామంది మెయిల్స్‌ రాసేవారు. 'ఇందిరా గాంధీ గురించి సీరియల్‌ రాసినప్పుడు రాస్తాను లెండి' అంటూ జోకొట్టాను. ఆ సీరియలూ మొదలెట్టలేదు. ఈ లోపున ఎమర్జన్సీకి 40 ఏళ్ల వయసు వచ్చేసి రాయడానికి సందర్భం వచ్చి నెత్తిన కూర్చుంది. రాయడానికి బోల్డు మేటరుంది. ఉద్యోగస్తుడిగా, పౌరుడిగా ఎమర్జన్సీని అనుభవించినవాణ్ని, దాని ఫలితాలను చూసినవాణ్ని, ఆనాటి పత్రికలు, పుస్తకాలు అన్నీ నా దగ్గర భద్రంగా వున్నాయి. ఇప్పుడు సీరియల్‌ ఆరంభింపకపోతే నీచమానవుణ్ని అయిపోతానేమో, టిడిపి ఎట్‌ 30, సిపిఎం ఎట్‌ 25 అని మొదలుపెట్టినట్లే దీన్ని మొదలుపెడితే కనీసం ఉత్తముణ్ని కాకపోయినా మధ్యముణ్ని అవుతాననే భావంతో సీరియల్‌ మొదలెట్టేస్తున్నాను. ఎంతకాలం సాగుతుందో నాకూ తెలియదు. ఎందుకంటే ఎమర్జన్సీ గురించి చెప్పాలంటే ఇందిరా గాంధీ రాజకీయాల గురించి కాస్తయినా  ఫ్లాష్‌బ్యాక్‌లో పరిచయం యివ్వాలి. ఎమర్జన్సీ ఏ పరిస్థితుల్లో విధించారో, అది ఎలా నడిచిందో, దానిలో మంచేమిటో, చెడేమిటో, దానికి ప్రజలు ఎలా రియాక్టయ్యారో, ఎవరి పోరాడారో, ఎవరు లొంగిపోయారో, చివరకు ఎమర్జన్సీ ఎందుకు ఎత్తివేశారో చెప్పాలి. జనతా పార్టీ ప్రయోగం, దాని విజయం, వైఫల్యం అదంతా వేరే భారతం.

ముందుగా జూన్‌ 25 న ఎమర్జన్సీకి 40 ఏళ్లయితే జూన్‌ 26 నుంచి మొదలుపెడుతున్నావేమిటి అనవచ్చు. నిజానికి చాలా ఏళ్లపాటు జూన్‌ 26 నే ఎమర్జన్సీ దినోత్సవంగా జరిపేవారు. గత 10, 15 ఏళ్లగా అనుకుంటా జూన్‌ 25కి దాన్ని మార్చారు. ఎందుకంటే టెక్నికల్‌గా జూన్‌ 25 రాత్రి 11.45కు రాష్ట్రపతి ఎమర్జన్సీ డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. 1975 జూన్‌ 25న ఎమర్జన్సీ ఛాయలు ఏమీ కనబడలేదు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలోని రామలీలా మైదానంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ బ్రహ్మాండమైన సభ నిర్వహించి అలహాబాద్‌ కోర్టు తీర్పు మన్నించి గద్దె దిగాలని ఇందిరా గాంధీకి పిలుపు యిచ్చారు.  రామ్‌ధారి సింగ్‌ దిన్‌కర్‌ పద్యాన్ని ఉటంకిస్తూ ''సింహాసన్‌ ఖాలీ కరో, కె జనతా ఆతీ హై'' అని గర్జించారు. ఆ వేదికపై మొరార్జీ దేశాయ్‌, రాజ్‌ నారాయణ్‌, నానాజీ దేశ్‌ముఖ్‌, మదన్‌ లాల్‌ ఖురానా కూడా వున్నారు. ఇందిరా గాంధీ రాజీనామా చేసేదాకా లోక్‌ సంఘర్ష్‌ సమితి పేర అహింసాత్మక ప్రదర్శనలు, సత్యాగ్రహాలు దేశమంతా నిర్వహిస్తామని తీర్మానం చేశారు. ఆ సమితికి మొరార్జీ చైర్మన్‌, నానాజీ జనరల్‌ సెక్రటరీ, అశోకా మెహతా కోశాధికారి. ఆ రోజే ఎమర్జన్సీ ప్రారంభమైతే యింత భారీ సభ జరిగేదా? 

గమనించవలసినది ఏమిటంటే ఎమర్జన్సీ ఆ రోజు అమలులో లేదు, దాని గురించి ప్రకటనా లేదు. ఇంకో పావుగంటలో 26 వస్తుందనగా సంతకమైతే అయింది కానీ ఎమర్జన్సీ ప్రారంభమైంది 26 నుండే. తెల్లవారుఝామునే అరెస్టులు జరిగాయి. ప్రజలకు తెలియపరచినది ఉదయం 10 కి! అది నేను వినడం సంభవించింది. అప్పటికి నేను బ్యాంకులో చేరి రెండేళ్లయింది. అవేళ రేడియోలో (అప్పటికి హైదరాబాదుకి టీవీలు రాలేదు) 8 గం||ల నుంచి 'ఇంపార్ట్‌మెంట్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఎట్‌ 10 ఎఎమ్‌' అంటూ చెప్తూ వచ్చారు. అది విని వెళితే బ్యాంకుకి ఆలస్యమై పోతాను. అయినా ఇంపార్టెంటు అంటున్నారు కదా వినే వెళదాం అంటూ యింట్లో వుండిపోయి విన్నాను. 'ఇంటర్నల్‌ ఎమర్జన్సీ హేజ్‌ బీన్‌ డిక్లేర్‌డ్‌' అని ఎనౌన్స్‌ చేశారు. దానికి గల ప్రాముఖ్యత ఏమిటో అర్థం కాలేదు. బ్యాంకుకి వెళ్లి ఆలస్యమైనందుకు క్షమాపణ చెపుతూనే దీని గురించి చెప్పాను. మా మేనేజరుకూ (ఆయన చాలా సీనియర్‌, విదేశాల్లో కూడా పనిచేశాడు) దాని  ప్రభావం ఏమిటో తెలియలేదు. యుద్ధం వచ్చినపుడు ఎమర్జన్సీ ప్రకటిస్తారని, యిప్పుడు ఏమైనా మళ్లీ అలాటి భయాలున్నాయేమో అన్నాడు. అంతేకానీ ఇందిరా గాంధీ తన రాజకీయప్రయోజనాల కోసం అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అలాటిది యింతకుముందు ఎన్నడూ లేదు. కోర్టు తీర్పు దృష్ట్యా ఆమె దిగిపోతుందా లేదా, ఆమె స్థానంలో సంజయ్‌ను కూర్చోబెడుతుందా, లేక వైబి చవాన్‌కో, జగ్జీవన్‌ రామ్‌కో అప్పగిస్తుందా అనే చర్చించుకుంటున్నాం. సాయంత్రం బ్యాంకు విడిచి వస్తూంటే అప్పుడు పుకారులు, వార్తలు వినబడసాగాయి - ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లల్లో కుక్కారనీ, పత్రికలపై సెన్సార్‌షిప్‌ విధించారనీ, ఊరంతా నిషేధాజ్ఞలని, ఊరేగింపులు, ప్రదర్శనల విషయం యిక మర్చిపోవాలని! పోనుపోను ఎమర్జన్సీ ఎలా వుంటుందో తెలియవచ్చింది. దాన్ని ఎంత అసహ్యకర పరిస్థితో అనుభవించిన మాబోటివారికి తెలుసు. 

అందుకే యీ సీరీస్‌ రాయడానికి పూనుకున్నాను. ఎందుకంటే మనందరికీ అధికారం చలాయించేవాడంటే మోజు. మా నాన్న తన ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొట్టే రోజుల్నుంచి వింటూ వచ్చాను - 'మన వాళ్లకు డిసిప్లిన్‌ లేదండి, మనకు ప్రజాస్వామ్యం పనికి రాదు. డిక్టేటర్‌ రావల్సిందే. నోరెత్తితే నాలుగు తన్ని జైల్లో కూర్చోబెట్టాలి.' అనడం. సైనికపాలన వస్తే అన్నీ చక్కబడిపోతాయని మనకో గుడ్డి నమ్మకం. సైనిక పాలనలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఏం బావుకున్నాయో చూశాం. నియంతల చేతుల్లో రష్యా, ఆఫ్రికా, దక్షిణమెరికా ఏం బాగుపడ్డాయో చూశాం. అయినా మనకు నియంతలాటి వాడిపై మోజు. ఇందిరను తన కాబినెట్‌లో ఏకైక మగాడుగా వర్ణించేవారు. కాబినెట్‌ సహచరులకు, ప్రతిపక్ష నాయకులకు అందరికీ గౌరవం యిచ్చిన నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంటే ఓ మోతాదులో మోజు వుంటే తన పార్టీలోనే అడ్డు వచ్చిన వారందరినీ మర్దించి, దాసోహం అనిపించుకున్న ఇందిర అంటే జనాలకు ఆరాధన. అమ్మ, అపర దుర్గ అని కీర్తించారు. రాష్ట్రస్థాయిలో తన పార్టీకి చెందిన ఏ గట్టి నాయకుడున్నా సరే, వాడికి కింద కుంపటి పెట్టి, అసమ్మతి రాజేసి, శరణు శరణు అంటూ తన వద్దకు పరిగెత్తుకుని వచ్చేట్లా చేసి దేశం మొత్తం మీద నాయకుడంటూ లేకుండా చేసిన దారుణమైన వ్యక్తి ఆమె. అయినా ఆమె శక్తిమంతురాలు, బలవంతురాలు అంటూ గుడ్డిగా హారతులు పట్టారు ప్రజలు. ఆ మదంతోనే ఆమె ఎమర్జన్సీ విధించింది. తన యిష్టం వచ్చినట్టు పాలించింది. 

ఎమర్జన్సీ మళ్లీ వచ్చే పరిస్థితులు వున్నాయి అని ఆడ్వాణీ అనగానే మోదీ గురించే అని సందేహించారు కొందరు. కాదు, కాంగ్రెసు యింకా సజీవంగా వుంది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన సంస్థలు బలహీనంగా వుండడం చేత అలా అనవలసి వచ్చింది అని ఆయన వివరణ యిచ్చినా ఆయన మోదీని వుద్దేశించే అన్నాడని బిజెపి నాయకుల సందేహం. అందుకే బిజెపికి అనుబంధంగా వుండే దీన్‌దయాళ్‌ సంస్థ నిర్వహించిన ఎమర్జన్సీ వార్షికోత్సవ సభకు ఆయనను ఆహ్వానించలేదట. ఆడ్వాణీ చెప్పిన పాయింట్లు కరక్టే. ప్రజా హక్కులు కాపాడవలసిన కోర్టులు, కాగ్‌, ఎన్నికల కమిషన్‌, పిఎసి వంటి అనేక సంస్థలను స్వతంత్రంగా వ్యవహరించ నిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుంది. లేకపోతే మళ్లీ ఎమర్జన్సీ రావచ్చు. దీనితో బాటు ఆయన మాటల్లో యింకో ధ్వని కూడా వుంది. నియంతలను ఆరాధించే మనస్తత్వం, వ్యక్తిపూజ ప్రజల్లో మళ్లీ పెరుగుతోంది, యిదే ఎమర్జన్సీకి ద్వారం తెరుస్తోంది. 

'నాది 56 యించిల ఛాతీ' అని చెప్పుకోవడం నియంతలకే చెల్లు. ఎక్కడ చూసినా ఒకే వ్యక్తి మాస్క్‌లు, అతని నామభజన, వాన కురిసినా అతని దయే, అతను ఉపవాసం వున్నా న్యూసే, సోషల్‌ వెబ్‌సైట్‌లో అతని ప్రశంసలే. కాబినెట్‌లో వున్న సహచరులందరూ డూడూబసవన్నలే. ఎదురాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇందిర విషయంలో యివే జరిగాయి. మోదీ విషయంలో అవే జరుగుతున్నాయి. ప్రస్తుతం మోదీ వచ్చి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ నిలిపాడని, అతని దయ వల్లనే భారతీయులంతా గర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతున్నారనీ తెగ ప్రచారం సాగుతోంది. మోదీ ఏం చేసినా కరెక్టే అనే భావోద్వేగపు వెల్లువలో విద్యావంతులే పడి కొట్టుకుని పోతున్నారు. కొన్ని విషయాల్లో మోదీ ప్రజాస్వామికంగా వ్యవహరించకపోయినా, ఆశ్రితపక్షపాతం చూపినా, అవినీతి సహించినట్లు తెలిసినా కాంగ్రెసుతో పోల్చి ఫర్వాలేదులే అని సర్దుకుపోతున్నారు. గట్టిగా విమర్శించి మోదీని కూడా లేకుండా చేసుకుంటే దేశం గతేమిటి, అనాథ అయిపోదా అని బెంబేలు పడుతున్నారు. ఇందిర విషయంలో సేమ్‌ యిలాగే జరిగింది. దాన్నే ఉపయోగించుకుని ఆమె తన స్వార్థానికి ఎమర్జన్సీని వాడుకుంది. అప్రమత్తంగా వుండకపోతే, వ్యక్తిపూజ మానుకోకపోతే మోదీ కూడా అలాటి తెగింపే చూపవచ్చు అనే హెచ్చరిక ఆడ్వాణీ మాటల్లో వుంది. దాన్ని బిజెపి వారు సరిగ్గానే గ్రహించారు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?