Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : హుదూద్‌ పాఠాలు - 6

జనరల్‌ తీసుకున్న నిర్ణయం సైనికుడికి చేరడానికి మధ్యలో అనేక అంచెలుంటాయి. వాటిని కట్‌ చేయడానికి, బైపాస్‌ చేయడానికి చూడకూడదు. ఉదాహరణకి ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో వున్న ఒక క్లర్క్‌కు డైరక్టుగా ఆదేశాలిచ్చి చేయించడం మొదలుపెడితే ఆ తర్వాత అతను తన యిమ్మీడియెట్‌ బాస్‌ను లక్ష్యపెట్టడు. 'ఏవయ్యా పని కాలేదు?' అని అడిగితే 'సిఎంగారితో చెప్పుకుంటాను లెండి' అనేస్తాడు. సిఎం గారు ఎంతమంది క్లర్కులతో డైరక్టుగా డీల్‌ చేయగలరు? అదేవిధంగా ప్రభుత్వాధినేత ప్రజలముందు అధికారగణాన్ని చులకన చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వానికి అధికారగణం పనిముట్టు లాటిది. ఒక పనివాడు తన పనిముట్లను చెక్కవచ్చు, గోకవచ్చు, పదును పెట్టే క్రమంలో అరగదీయవచ్చు, కానీ దానితో పోట్లాట పెట్టుకోకూడదు. ఈ సందర్భంలో బాబు యీ పని చేశారు. ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా చేసింది అనిపించుకోవాలన్న తపన వుంది. ఓకే. 'కానీ ప్రభుత్వం అంటే బాబు ఒక్కరే, అధికారగణం కాదు' అనిపించుకోవాలని ఆయన అనుకున్నారు. ప్రభుత్వం అంటే బాబు ప్లస్‌ బ్యూరాక్రసీ. విఫలమైతే అందరూ విఫలమయినట్లు, సఫలమైతే అందరూ అయినట్లు. విజయం తన ఖాతాలో, వైఫల్యం ఉద్యోగుల ఖాతాలో వేద్దామని బాబు ప్రయత్నించారు. 'నేను అనుకున్నంత వేగంగా పనులు జరగటం లేదు, నేను అనుకున్నంత స్థాయిలో పని చేయలేకపోయారు.' అని వ్యాఖ్యలు చేసి వారికంటె తను అతీతం అని చూపించుకోబోయారు. 

'సహాయక చర్యల్లో పాల్గొనకుండా నా వెనుక వస్తే వూరుకునేది లేదు, 5 వాహనాలు మించి వుంటే అరెస్టు చేయిస్తా...' '..కొందరు నిర్లక్ష్యంతో, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. గత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రభావం నుండి ఇంకా కొందరు బయటపడలేదు. వారికి పనికి పురమాయించాల్సి వస్తోంది...' '..సమీక్షలకు రావటం లేదు, వారిని ఉపేక్షించదలచుకోలేదు...' '...నేను వైజాగ్‌కు రాకపోతే యిక్కడ సాధారణ పరిస్థితులు మరో నెల అయినా వచ్చేవి కావు.' '..విధులను నిర్వర్తించే విషయంలో ఎవరైనా అలక్ష్యం వహిస్తే ఏ మాత్రం ఉపేక్షించను. కఠినంగానే మాట్లాడుతున్నా, చర్యలు తీవ్రంగా వుంటాయి. పోలీసులను యిళ్లకు పంపించి రప్పిస్తా.' '..కొందరు అసమర్థుల కారణంగా అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. సీనియర్‌ ఐయేయస్‌ అధికారులు, అనుభవం వున్నవారు విశాఖలో వున్నా చొరవతో ముందుకు వచ్చి సమన్వయంతో పని చేయడంలో విఫలమయ్యారు...' వంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. పని చేయనివారుంటే వారిని గుర్తించి ఆంతరంగికంగా హెచ్చరించాలి. ఇది యింటి సమస్య. బయటకు వచ్చి మాట్లాడడం తప్పు. 

నిజానికి ప్రజలు ఉద్యోగులపై ఫిర్యాదు చేస్తే వారి తరఫున మాట్లాడి నచ్చచెప్పవలసిన బాధ్యత - అధినేతది. ఏ కంపెనీలోనైనా అదే చేస్తారు. కస్టమర్‌కు నచ్చచెప్పి, ఆ తర్వాత బాధ్యుడిపై డిపార్ట్‌మెంటల్‌గా చర్య తీసుకుంటారు. తన స్టాఫ్‌ను వాళ్ల ముందు వెధవలను చేయరు. 'నేను రాకపోతే పని చేసేవారు కారు' అంటే ఏమిటర్థం? ప్రభుత్వ యంత్రాంగం పనికిమాలినదనా? ఇదే యంత్రాంగంతో తమరు స్వర్ణాంధ్ర ప్రదేశ్‌, జిల్లాకో స్మార్ట్‌ సిటీలను నిర్మించాలని చూస్తున్నారు స్వామీ, గుర్తుంచుకోండి. తమరి పాలన ఐదేళ్లే, వచ్చే ఐదేళ్ల తర్వాత ఏమవుతుందో ఎవరూ జోస్యం చెప్పలేరు. వాళ్లు మీ ముందూ వున్నారు, తర్వాతా వుండబోతారు. 30 ఏళ్ల కెరియర్‌ వాళ్లది. వాళ్లను డీమోరలైజ్‌ చేస్తే పనులెలా సాగుతాయి? నిజానికి మీ నిందలు మోస్తున్న ఉద్యోగులు ఓ పక్క సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నా, మరో పక్క స్వయంగా బాధితులు. ఇంట్లో నీళ్లు వచ్చేసి వుంటాయి, కరంటు లేక భార్యాబిడ్డలు అవస్థలు పడుతూంటారు, తిండిలేక అలమటిస్తూ వుంటారు, మందుల కోసం తిరుగుతూ వుంటారు, వాళ్లను వాళ్ల కర్మానికి వదిలేసి విధులకు వచ్చారు. అది గ్రహించాలి. తుపాను టైముకి జివిఎంసి కమిషనర్‌, వుడా విసి, పోలీసు కమిషనర్‌ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. మార్గదర్శనం చేసేవాళ్లు కరువయ్యారు. అయినా ఉద్యోగులు కష్టపడి పని చేశారు. వైజాగ్‌ ప్రజలు అది అర్థం చేసుకునే వాళ్లను విమర్శించలేదు. కానీ బాబులో మాత్రం ఆ సంయమనం కొరవడింది. 

తనను తాను హైలైట్‌ చేసుకునే క్రమంలో వాళ్లను బలి వేశారు. టీము లీడరు ఆంతరంగిక సమావేశాల్లో కాని, బహిరంగ సమావేశాల్లో కాని ఎన్నడూ 'నేను' అనకూడదు. 'మనం' అనాలి. ముఖ్యంగా పొరపాట్లు జరిగినపుడు. మనవలన తప్పు జరిగింది, సర్దుకుందాం అనే అనాలి. ఇది మేనేజ్‌మెంట్‌లో చెప్పే ప్రథమపాఠం. ఈయన తన పార్టీ నాయకులతో కూడా 'నేను స్వభావరీత్యా మారాను, పార్టీ కోసం కష్టపడుతున్నాను, మీరేం చేయటం లేదు' అంటూ మాట్లాడినదంతా పేపర్లలో వచ్చేస్తూ వుంటుంది. ఇవన్నీ భరించి పార్టీలో వుండేవాళ్లు వుంటారు, లేనివాళ్లు వెళ్లిపోతున్నారు. కానీ ఉద్యోగులయితే ఉద్యోగం విడిచి వెళ్లలేరు. తిట్టుకుంటూనే కొనసాగుతూ మనస్ఫూర్తిగా పనిచేయరు. 

బాబు అడ్మినిస్ట్రేటరే కాదు, సుదీర్ఘ అనుభవం వున్న రాజకీయవేత్త కూడా. ఇలాటి సందర్భాల్లో ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుందో ఆయనకు తెలియదా? నిజానికి ఆంధ్ర ప్రతిపక్షం మరీ అంత అల్లరి చేయలేదు. ఓర్పు చూపారు. అయినా బాబుకి అది సరిపోలేదు. వాళ్లపై అసహనం చూపారు. రాహుల్‌ గాంధీ వస్తే 'రాహుల్‌ వచ్చి ఏం చూస్తారిక్కడ?' అని మండిపడ్డారు. జగన్‌ వచ్చి విమర్శలు చేస్తే కావాలంటే ఆయనకూ పులిహార పొట్లాలు పంపుతాం అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు యీ రోజు చేస్తున్నదానికి పదిరెట్లు తమరు ప్రతిపక్ష నాయకుడిగా వుండగా చేశారని మా అందరికీ గుర్తుంది. నిరసనలు, దీక్షలు, ప్రదర్శనలు.. బోల్డు చేశారు మీరు. లోపాలు హైలైట్‌ చేయాలని మీడియాను కోరారు. ఇప్పుడు తను అధికారంలోకి రాగానే స్వరం మారింది. కెజిఎచ్‌లో యిబ్బందుల గురించి మీడియా అడిగితే - 'ఏం బాధితులను భయభ్రాంతులను గురిచేయాలని చూస్తున్నారా? ఉన్నవీ లేనివీ పెద్దగా చూపుతున్నారు. మనోధైర్యం కల్పించాలి, లోపాలుంటే సర్దుకోవాలి.' అంటూ హితబోధ మొదలుపెట్టారు. ఫలానా కాలనీలో మంచినీళ్లు లేవని ఓ రిపోర్టరు అంటే 'మీ యింట్లోంచి తెచ్చి యివ్వవయ్యా' అని ఎకసెక్కమాడారు. 

ఇలాటి సమయాల్లో ఓపికతో పాటు ఓర్పు కూడా వుండాలి. భాష జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రీమియం కట్టకపోవడం తమ నిర్వాకం వలన అయితే ఇన్సూరెన్సు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ డైరీ గురించి మాట్లాడుతూ '..తీరు మారకుంటే జైలుకు పంపిస్తా.'  అన్నారు. ఇదంతా అతి. చేసేదేమైనా వుంటే కూల్‌గా చేయాలి తప్ప చండశాసనమ్ముండావాడిగా పేరు తెచ్చుకోవాలనే కాంక్షతో యిలాటి మాటలు మాట్లాడితే అది కౌంటర్‌ ప్రొడక్టివ్‌ అవుతుంది. బాబును అనవసరంగా తప్పుపడుతున్నానని కొందరు పాఠకులు నాపై విరుచుకు పడవచ్చు. కానీ బాబే 23 వ తారీకున తన మాటలకు క్షమాపణ చెప్పారని వారు గుర్తించాలి. 'పనులు త్వరగా జరగాలన్న ఆతృతతో కఠినంగా మాట్లాడాను. క్షమించండి' అన్నారు. ఒత్తిడి వున్నపుడు సంయమనంతో వ్యవహరించినవాడే వ్యవహారదకక్షుడు. బండిమీద వున్న భారాన్ని మోయలేక ఎద్దు మొరాయించినపుడు, దానికి విశ్రాంతి యివ్వడమో, అనునయంగా దువ్వడమో చేస్తాడు బండివాడు. పక్క బండివాడి ముందు పరువు పోతోందన్న కోపంతో దాన్ని చావగొట్టి బండి నడిపిద్దామని చూసేవాడు అజ్ఞాని. ఎద్దు కూలబడిన తర్వాత అప్పుడు ఎన్ని అనునయవాక్యాలు పలికినా ఎద్దు సమాధాన పడదు. చేసిందంతా చేసి, అనాల్సిదంతా అని యిప్పుడు సారీ అంటే గాయపడిన మనసులు ఊరడిల్లవు. తుపాన్లలో మనకు హుదూద్‌ తొలిదీ కాదు, తుదిదీ కాదు. రాష్ట్రం సరైన గాడిలో పడాలంటే ఎందరో కష్టపడాలి, ఎంతో శ్రమించాలి, ఎంతమందినో కలుపుకుపోవాలి. ఈ నాటి పొరపాట్లు పునరావృతం కాకుండా వుంటే ఆ మేరకు తృప్తి. (సమాప్తం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?