Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పంచ్ పటాస్ : ఒక తుగ్లక్ రాష్ర్టంలో...

నమస్తే తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ!

నమస్తే 

మీ రాష్ర్టం అభివృద్ధి కోసం మీరు చాలా పాట్లు పడుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయ్. మీ రాష్ర్ట అభివృద్ధి కోసం మీ ప్రజల సంక్షేమం కోసం ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారు?

మా దృష్టిలో ప్రజల సంక్షేమ కార్యక్రమాలే రాస్ట్రాభివృద్దికి తోడ్పదతాయనేది మా విజన్. అందుకే ప్రజలేమడిగినా అన్నీ వరాలిచ్చేస్తున్నాం.

చాలా గొప్పవారు సార్ మీరు. ఇంతవరకూ ప్రజలకోసం ఏమేం వరాలిచ్చారు?

ఒకటేంటండీ - రైతులకు రుణ మాఫీ చేసాం. వోల్డేజ్ పెన్షన్ లిచ్చాం. పుక్కట్‌గా రేషన్ కావాలన్నారు. ఇచ్చేస్తాం. అందరికీ అన్ని రోగాలకూ ఆరోగ్యశ్రీ కావాలన్నారు. ఇచ్చేస్తాం.పంటలు పండకపోతే పెట్టుబడంతా ఇన్సూరెన్స్ ద్వారా వాపస్ ఇప్పించాలన్నారు. ఇచ్చేస్తాం. ప్రభుత్వమే పంటలన్నిటికీ ఇన్సూరెన్స్ చేయిస్తుంది. మెట్రో రైల్ కావాలన్నారు. ఇచ్చేస్తాం.ఉద్యోగాలు కావాలన్నారు. ఇచ్చేస్తాం. ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భ్రుతి  ఇచ్చేస్తాం. పిల్లలకు ఉచితంగా విద్య ఇచ్చేస్తాం. కాలేజీలు యూనివర్సిటీలూ పెట్టేస్తాం. పరిశ్రమలు స్థాపించేవారికి వెంటపడి లోన్లు ఇచ్చేస్తాం. 24 గంటలూ కరెంట్ ఇచ్చేస్తాం.ఇంతకంటే ప్రజలకు ఎవడు సేవ చేయగలడయ్యా? ఇవన్నీ మా తుగ్లక్ రాష్ర్టం ఒక్కటే చేస్తోంది. ఇంత అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తోన్న ఇంకో రాష్ట్రాన్ని చూబించు.

చాలా గ్రేట్ సార్. హాట్స్ ఆఫ్! కానీ మీదసలే లోటు బడ్జెట్ కదా. ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతారు?

మాకు ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. ఎలాంటి త్యాగాలైనా చేస్తాం. ప్రజలకోసం మేము చేసే మంచి పనులు చూసి ఆ భగవంతుడే మాకు నిధులిస్తాడు.

ఈ డైలాగ్ పౌరాణిక సినిమాల్లో అయితే తప్పట్లు మోగిపోతయ్ సార్. కాని కాష్ నిజంగా కావాలి కదా.

వస్తాయయ్యా. Where there is a will there is a way 

నేనడిగేదదే సార్. ఆ మార్గాలేమిటీ అని.

చాలా ఉన్నాయ్. ఉదాహరణకి కేంద్రం కాళ్ళ మీద పడతాం.

కాని మోడీ ఎవ్వరినీ కాళ్ళ మీద పడనివ్వడని ముఖ్య మంత్రులు చెప్పుకుంటున్నారు..

పడనీకపోతే మా కాళ్ళ మీద మేమే నిలబడతాం.

కాని మీరు చేస్తున్న ప్రామిస్‌ల బరువుకి మీ కాళ్ళు విరిగి పోతాయ్ కదా?

మా దగ్గర  మరేమీ మార్గం లేనప్పుడు వాడు కోడానికి ఒక అస్త్రం ఉంది.

ఏమిటది?

అది మీకు చెప్పలేము.

అదేంటి సార్. మీది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం అని మీరే స్టేట్ మెంట్ ఇచ్చారు కదా?

ఆ మాట నిజమే అనుకో. సరే సీక్రెట్ నీకు చెప్తా గాని మళ్ళీ ఎవరితోనూ అనకూడదు. మీ పేపర్లో రాయ కూడదు. ఏ చానెల్‌కీ లీక్ చేయకూడదు.

మీరింతగా చెప్పాలా?    

మరేం లేదు. మన దేశంలో ఏ రాష్ర్టమైనా సరే. కావలసినంత రెవిన్యూ సమకూర్చు కోడానికి ఒక రాజ మార్గముంది.

ఏమిటి సార్ అది?

అదేనయ్యా.. మద్యం! మనం ఎంత ఎక్కువ మద్యం అమ్ముకుంటే అంత డబ్బు. దేవుడి దయ వల్ల ఇంతవరకూ దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ ఎంతో శ్రమపడి మెజారిటీ దేశ ప్రజలను పరమ తాగుబోతులుగా తయారుచేయగలిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు హై కమాండ్లూ ఈ ఒక్క విషయంలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగారు. గత డెబ్బయ్ ఏళ్ల పాలనలో ఎన్నో మద్యం పరిశ్రమలు స్తాపించారు. దేశంలో మద్యం  ఏరులై ప్రవహింప జేశారు. ప్రజలు నీళ్ళు కావాలని గొడవ చేసినప్పుడల్లా వారి దాహం మద్యంతో తీర్చారు.అందువల్ల ప్రజలు ఇప్పుడు మాకు అది కావాలి.. ఇది కావాలి అని అడిగే పరిస్తితిలో లేరు. అలా వారందరినీ తాగు బోతులను చేయటం వల్ల ప్రతి రాష్ట్రానికీ కొన్ని వేల కోట్లు ఆదాయం వస్తుంది కదా-ఇంకా నిధులకు కొదవేముందీ? ఇప్పు డర్ధమయిందా? ఎందుకు ప్రజలడిగినవన్నీ ఇచ్చేస్తున్నామో..

ఆహా.. రాజకీయ భగవద్గీత ఎంత అద్భుతంగా చెప్పారు సార్. కానీ మీరు ఇచ్చిన వరాలేమో లక్షల కోట్లు ఖర్చయే వరాలు. మద్యం వల్ల మీ కొచ్చేదేమో వేల కోట్లు.. ఆ గాప్ సంగతేంటి?

నువ్వు వట్టి మబ్బు జర్నలిస్ట్ లాగున్నావే. ఇకముందు నేనేం చేస్తానో చూసుకో. ప్రతి గ్రామానికీ ఒక మద్యం దుకాణం తెరుస్తా. ప్రతి ఇంటికీ మద్యం పైప్ లైన్లు వేయిస్తా. వాటికి మీటర్లు ఫిట్ చేయిస్తా. ప్రజలందరికీ మద్యం డెబిట్ కార్డ్ లిస్తాం. బాంక్‌ల ద్వారా మద్యం రుణాలు ఇప్పిస్తా. రేషన్ కార్డ్ ద్వారా చౌక మద్యం అందిస్తాం. అసలు వారానికి మూడు రోజులు మద్యం దినాలుగా ప్రకటిస్తాం. ఆ మూడు రోజులూ మద్యం తాగటం కంపల్సరీ చేస్తాం.అప్పుడు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందా లేదా?

ఆహా.. ఎంత గొప్ప స్కీమ్స్ సార్. కానీ ఇంకొక్క డవుట్ సార్.

ఏంటది?

ఎంత పెరిగినా మీరు చేసిన వాగ్దాలన్నిటికీ ఆ ఆదాయం చాలదనుకోండి. అప్పుడేన్చేస్తారు?

పిచ్చివాడా!  వాగ్దానాలు అమలు చేయం. అంతే.

మరి ప్రజలు వాగ్దానాలు అమలు చేయాలని పట్టు పడితే? 

నువ్వెక్కడ మబ్బు గాడివి రా.. వాళ్ళను డెబ్బయ్ ఏళ్ళు కస్టపడి తాగుబోతులుగా తయారు చేసింది ఎందుకురా? వాగ్దానాలేమీ గుర్తుండ గూడదనేగా?

-యర్రంశెట్టి సాయి        

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?