బాహుబలి పార్ట్ 2 కి రెహమాన్ ను సంగీత దర్శకుడిగా నియమిస్తారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు కొత్తగా వినిపించడం లేదు. బాహుబలి హిట్ అయి, పార్ట్ 2 పనులు ప్రారంభమైన దగ్గర నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి..అంతే తేడా. దీనికి ఇన్నాళ్లు ఒక కారణం చెప్పారు. కీరవాణి డిసెంబర్ 2015 నాటికి రిటైర్ అవుతానని ఎపుడో ప్రకటించారు. మాట మీద నిల్చునే మనిషి కాబట్టి, బాహుబలి 2 కు వేరే వాళ్లు సంగీత దర్శకత్వం వహిస్తారని.
అయితే దాని కన్నాబలమైన కారణం ఇప్పుడు వినిపిస్తోంది. బాహుబలి 2 ని కేవలం హిందీకి డబ్బింగ్ వెర్షన్ మాదిరిగా కాకుండా, డైరక్ట్ వెర్షన్ గా తయారు చేయాలని, అందుకోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళి అండ్ కో డిసైడ్ అయ్యారట. అందువల్ల అలాంటపుడు రెహమాన్ సంగీతం అంటే సినిమా చాలా హైప్ వస్తుందని భావిస్తున్నారట.
అయితే బాహుబలి 2 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పూర్తి చేసిన తరువాతే కీరవాణి రిటైర్ అవుతారని, ఇలాంటి మంచి ప్రాజెక్టుకు రాజమౌళి తన అన్నను దూరం చేసుకోరని కూడా వినిపిస్తోంది.
వాస్తవానికి ఈగ నుంచి ఇప్పటి దాకా రాజమౌళి సినిమాలకు నేపథ్య సంగీతానికి కీరవాణి పేరు వుంటోంది కానీ, జెబి అనబడే జీవన్ అందిస్తున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. మరి రాజమౌళి ఇప్పుడు సడెన్ గా కేవలం హిందీ వెర్షన్ ను దృష్టిలో వుంచుకుని రెహమాన్ పేరు పరిశీలిస్తున్నాడా? లేక అంతర్జాతీయంగా కూడా మంచి హైప్ తీసుకురావలనా? కొన్నాళ్ల ఆగితే ఏ విషయమూ తెలుస్తుంది.