విద్యార్థుల్లో నైరాశ్యం.. దేనికి సంకేతం.?

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షురూ అయ్యింది. కానీ తొలి రోజు ధృవపత్రాల పరిశీలన కార్యక్రమానికి విద్యార్థుల స్పందన అంతంతమాత్రంగానే వుంది. హాజరైన విద్యార్థులు కూడా, ‘నమ్మకం లేదుగానీ..’ అనే వ్యాఖ్యలు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.…

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షురూ అయ్యింది. కానీ తొలి రోజు ధృవపత్రాల పరిశీలన కార్యక్రమానికి విద్యార్థుల స్పందన అంతంతమాత్రంగానే వుంది. హాజరైన విద్యార్థులు కూడా, ‘నమ్మకం లేదుగానీ..’ అనే వ్యాఖ్యలు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కౌన్సిలింగ్‌ సజావుగా సాగుతుందనీ, విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుందనీ విద్యార్థుల్లో నమ్మకం కన్పించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ నిర్వహించుకునే దిశగా తెలంగాణ సర్కార్‌ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం విదితమే. ఇదే అసలు వివాదానికి కారణం ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా ఉన్నత విద్యను పదేళ్ళపాటు ఉమ్మడిగా కొనసాగించాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానికి భిన్నంగా, ‘మా రాష్ట్రం.. మా కౌన్సిలింగ్‌.. మా ఇష్టం..’ అంటోంది తెలంగాణ రాష్ట్రం.

ఉన్నత విద్యా మండలి మాత్రం సుప్రీం కోర్టు సూచనల మేరకు.. అంటూ కౌన్సిలింగ్‌కి తెరలేపింది. తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ధృవపత్రాలకు ఓకే చెప్పినా, ముందు ముందు తెలంగాణలో పరిస్థితులు ఎలా వుంటాయో ఎవరికీ అర్థం కావడంలేదు కౌన్సిలింగ్‌ పరంగా. దాంతో తెలంగాణలో చదవాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అవడం కన్నా, వేరే కోర్సుల్లో చేరడం ఉత్తమం అన్న నిర్ణయానికి చాలామంది విద్యార్థులు వచ్చేశారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణల్లో ఇంజనీరింగ్‌ చదవడం వల్ల ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేసినవారు, పొరుగు రాష్ట్రాలకు ఇప్పటికే వెళ్ళిపోయారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంభవించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందే తప్ప, ‘అందరం తెలుగువారమే’ అన్న విశాల దృక్పథం మాత్రం కన్పించడంలేదు. ఇదే విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

నేటి విద్యార్థులే.. భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులు. దేశం అభివృద్ధి చెందాలంటే అందులో యువత పాత్రే కీలకం. కానీ, ఆ యువత రెండు రాష్ట్రాల ఆధిపత్య పోరులో నలిగిపోవడం అత్యంత దారుణమైన విషయం. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ మనోడే అనీ, అమెరికాలో కీలకమైన రాజకీయ పదవుల్లో తెలుగువారున్నారనీ మురిసిపోతున్న మనం.. మన గడ్డమీద మన విద్యార్థుల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నామంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.?