కృష్ణవంశీ చెప్పినంత వుంటుందా.?

‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్‌ విడుదలైంది. చరణ్‌ సినిమాల్లో ఇది నిజంగానే వెరైటీ టీజర్‌. చాలా ఆహ్లాదంగా వుందనే రిపోర్ట్స్‌ సినీ వర్గాల నుంచీ, ప్రేక్షకుల నుంచీ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇంత కూల్‌ టీజర్‌…

‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్‌ విడుదలైంది. చరణ్‌ సినిమాల్లో ఇది నిజంగానే వెరైటీ టీజర్‌. చాలా ఆహ్లాదంగా వుందనే రిపోర్ట్స్‌ సినీ వర్గాల నుంచీ, ప్రేక్షకుల నుంచీ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇంత కూల్‌ టీజర్‌ ఇంకోటి లేదా.? అంటే, ‘మనం’ టీజర్‌ వుందిగా.. అనే సమాధానమొస్తుంది. అయినాసరే, ఓ యంగ్‌ హీరో.. అందునా వరుసగా మాస్‌ మాస్‌ సినిమాలు చేస్తోన్న హీరో నుంచి ఈ తరహా టీజర్‌ అంటే కొత్తగా వుందని అనకుండా ఎలా వుండగలం.?

కృష్ణవంశీ సినిమాలంటేనే ఆహ్లాదానికి కేరాఫ్‌ అడ్రస్‌. యాక్షన్‌ కూడా సినిమాల్లో పవర్‌ఫుల్‌గా చూపించినా, కృష్ణవంశీ సినిమాలు చాలా అందంగా వుంటాయన్నది నిర్వివాదాంశం. ఫ్రేమ్‌ నిండా జనం వుంటారు కృష్ణవంశీ సినిమాల్లో. అదే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా టీజర్‌లోనూ కన్పించింది. ఇక, ఈ సినిమా గొప్ప సినిమా అని తాను చెప్పనుగానీ, అందమైన సినిమా.. 50ఏళ్ళపాటు అందరి గుండెల్లో వుండే సినిమా.. అని అంటున్నాడు కృష్ణవంశీ.

ఇటీవలి కాలంలో అలా చాన్నాళ్ళు గుర్తుపెట్టుకునే సినిమాలు రావడంలేదన్నది నిర్వివాదాంశం. ఎంత గొప్ప సినిమా వచ్చినా, అప్పటికప్పుడు దాని గురించి చర్చించుకోవడం.. ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. ‘మనం’, ‘అత్తారింటికి దారేది’ అలాంటి సినిమాలే. మాస్‌ కమర్షియల్‌ సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరి, మాస్‌ హీరోతో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే క్లాస్‌ టైటిల్‌ పెట్టి, యాభై ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా.. అని కృష్ణవంశీ అంటున్నాడంటే, కాస్తంత ఆలోచించాల్సిందే.

అయినా కృష్ణవంశీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవల కొన్ని వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా, టాలీవుడ్‌లో క్రియేటివ్‌ దర్శకుడంటే విన్పించే తొలిపేరు కృష్ణవంశీదే. తన చావు బతుకుల గురించీ టీజర్‌ ఆవిష్కరణలో ఉద్విగ్నంగా మాట్లాడిన కృష్ణవంశీ, మాటలకు తగ్గట్టే సినిమాని అద్భుతంగా మలిచే వుండొచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం.. కృష్ణవంశీ చెప్పినంత విషయం ‘గోవిందుడు అందరివాడేలే’లో వుంటుందో లేదో.!