నాకూ శ్రీమహావిష్ణువుకీ పోలికలున్నాయి. జగత్తును నడిపేది ఆయనే అని అందరూ చెప్పుకోవడమే కానీ దాని గురించి ఆయన పెద్దగా శ్రమిస్తున్నట్టు కనబడదు. హాయిగా పాముమార్కు ఫోంబెడ్ విూద పడుకొని ఆరాము చిత్తగిస్తూన్నట్లుంటాడు. (చేయి తల కింద అలాగే పెట్టుకుని ఉంచుకోవడం కాస్త కష్టమే ననుకోండి)
నేనూ అంతే – అట్టపైన నా బొమ్మ చూసి నా సృష్టి, స్థితి, లయలు సోఫాలోనేనని తమరు పొరపడే ప్రమాదం ఉంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మను ముందునిడుకొని వస్తే వెతుక్కోనక్కర్లేకుండా ఒక అడ్రసంటూ ఉండాలి కాబట్టి మహావిష్ణువు పాల సముద్రాన్ని కేరాఫ్ చేసుకొన్నాడు – పాల వాసన భరిస్తూ. నేనూ సోఫాను కేరాఫ్ చేసుకొన్నాను – ఫోమ్ వాసన భరిస్తూ. అంతే ! మామూలు వ్యవహారాల్లో, అంటే లోకం తనంతట తాను నడుపుకుపోయే వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చను. ఎప్పుడైనా గజేంద్రమోక్షం ఘట్టాలొచ్చినప్పుడు 'అచలపతినిం అడగడు', అన్న స్టయిల్లో పరిగెడతానన్నమాట.
అయితే ఇంద్రాది దేవతలు వచ్చినప్పుడు 'స్వావిూ శివుడు (కొండొకచో బ్రహ్మ) వరాలిచ్చి చెడగొట్టేసిన శాల్తీల కేసు కాస్త చూడండి' అంటూ వస్తారు కానీ 'విూరే కుళ్లబెట్టిన కేసు చూడండి' అంటూ రారు. అందువల్ల వాళ్లు చెప్పేవన్నీ శ్రీమహావిష్ణువు ఖుషీగా (వరాలిచ్చి తప్పు చేసినది అవతలివాళ్లుగా!) చిరునవ్వు చెదరకుండా వింటాడు.
కానీ మనకంతటి లక్కులేదు. సుబ్బుగాడు 'నువ్వూ, నీ అల్లం సబ్బు అయిడియానూ! నా కొంపా, ఫ్యాక్టరీ రెండూ మునిగాయి! ' అంటూ తిట్టిపోస్తున్నప్పుడు నా చిరునవ్వు చెరిగిపోయింది.
నా కథను సినిమాగా తీయబోయే దర్శకుడు 'ఓహో, ఇక్కడ ఫ్ల్లాష్బ్యాక్కు పనిబడుతోందన్నమాట' అనుకొని విగ్గుకీ, పాతకాలం పాంట్లకూ అర్డరిచ్చేస్తారేమో, అవసరం లేదు. ఈ ఫ్లాష్‌బ్యాక్ క్రితం ఏడాదిదే. నా సోఫా వెనకాల క్రితంయేడాది కాలెండరు పెడితే చాలు. పని జరిగిపోతుంది. సుబ్బు వేషధారణలో మాత్రం మార్పు ఉంటుంది. ఇప్పట్లా వెలిసిపోయిన చొక్కాలో కాకుండా, అప్పుడు ఫెళఫెళలాడే రంగుచొక్కాలో దూసుకువచ్చాడు. వచ్చి ''ఏ రకం సబ్బులు తయారుచేస్తే మంచిదిరా?'' అంటూ అడిగేడు.
అదేమిటో నన్ను సలహా అడగడానికి వచ్చేవాణ్ని చూస్తే నాకు మహా ముచ్చట. మనం బాల్చీలతో సలహాలిస్తే వాడు చెంచాలతో తీసుకొన్నా నే నేమనుకోను. 'ఏం చేసుకోను ఇంత వెన్నెలా!' అని సినీహీరోయినే కాదు, చంద్రుడూ వాపోతూండవచ్చు. 'ఏం చేసుకోను ఇంత తెలివీ' అని నేను సాధారణంగా మథన పడుతూంటాను. అడవిగాచిన తెలివిని ఉపయోగించే ఇలాటి సందర్భాలు వచ్చినపుడు నా తడాఖా చూపిస్తాను.
సుబ్బు నా సలహా కొచ్చేడంటే తన పరిమితి తను గుర్తించాడన్నమాట. 'నో దై సెల్ఫ్' అన్న సూక్తికి 'నో' అనకుండా 'మన లెవెల్ ఇంతే' అని తెలుసుకొన్నందుకు ఒక వీరతాడు వెయ్యవచ్చు. అలా తెలుసుకొన్నాక 'ఆనంత్ వంటి మేధావిని సంప్రదించాలి' అన్న అయిడియా వచ్చినందుకు రెండు వీరతాళ్లు. అచలపతి చుట్టుపట్ల మసలుతూ ఉన్నా అతన్ని అడగాలన్న టెంప్టేషన్ని జయించినందుకు మూడు… ఇన్ని వీరతాళ్లు భరించలేడంటారా? దశ తిరిగి రేపొద్దున్న చీఫ్ మినిష్టరవుతే ఛప్పన్న యూనివర్సిటీలు చడామడా ఇచ్చేసే 'గౌరవ(!) డాక్టరేట్లు' భరించద్దూ!
మార్కెట్లో సినిమా తారలు పులుముకుంటామని చెప్పే సబ్బులున్నాయిట. లారీ డ్రైవర్లు రుద్దుకుంటామని చెప్పేవి ఉన్నాయిట. అమ్మమ్మల్ని కాలేజీ స్టూండెట్లగా ఫిరాయించగలిగేవి ఉన్నాయిట.(వయోజన విద్య తాలూకు కాలేజీలు కావుట) పవిత్ర జలాలతో పునీతం చేయబడినవీ ఉన్నాయిట. 'మన సబ్బుని ఏ పేరు చెప్పి అమ్మాలి?' అన్నాడు సుబ్బు.
''వాళ్ళు ఉత్తరాది నదీజలాలు కలిపితే నువ్వు గోదావరి జలాలు కలుపుతున్నామని చెప్పు. రీజనల్ సెంటిమెంటుతో కొట్టు.. ఆగాగు ..మన సబ్బులో విబూది కలుపుతున్నా మని చెప్పు.. ఉండుండు.. మన సబ్బుని శివలింగం ఆకారంలో తయారు చేశామనుకో''.
''ఒరేయ్, నువ్వు సీరియస్‌గా మాట్టాడతావా లేక అచలపతి దగ్గరకెళ్లనా?''
'మాయాబజార్' లో లక్ష్మణకుమారుడికి అభిమన్యుడిలా నాకు అచలపతి ఒకడు! గట్టిగా ఆలోచించి చెప్పా- అల్లం సబ్బులు తయారు చేయమని. వివరణ కూడా ఇచ్చా-
జనాలకు ఆయుర్వేదం వెర్రి బాగా ఉంది. 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయిష' అని నమ్మినట్టే! ఇంగ్లీషు డాక్టరు దగ్గర కెళ్లి ఆయన ఆయుర్వేదం మందులు రాసిస్తే సంతోషించే రకం మనం. అందువల్ల మూలికలు, వేళ్లు, కొమ్మలు, రెమ్మలతో తయారుచేసిన వస్తువులని చెప్పి చాలామంది చాలా సరుకులు అమ్ముకొంటున్నారు. నిమ్మకాయ పిండిన సబ్బు అని ఒకటి ఉంది కానీ అల్లపురసం పిండిన సబ్బులేదు. అది పెడితే అమోఘమైన అమ్మకాలు!
''కానీ అల్లం వాడితే చర్మం శుభ్రపడుతుందని నీకెవరైనా చెప్పారా?''
''చెప్పలేదు, నేను అడగనూలేదు, సబ్బు కొనేవాడూ అడగడు. 'తరతరాలుగా మన ఋషుల ముఖవర్చసుకి కారణం అల్లంతో వారి ముఖాలను రుద్దుకోవడమే' అంటే అందరూ నమ్మితీరతారు. కాదని ఏ ఋషీ వచ్చి పోట్లాడడు''.
''అవునొరే, దేవుళ్ల తలవెనక్కాల ఉండే ఆ లైటింగుచక్రానికి కారణం కూడా అల్లమే అంటే నమ్ముతార్రా?''
''నువ్వు బాటరీల కంపెనీ పెట్టినప్పుడు దాని సంగతి ఆలోచిద్దాంలే. ఇప్పటికి ఋషుల్తో కానీ… వెంటనే స్లోగన్ కూడా రాయించేయ్, ''అల్లపు సబ్బు – ఆరోగ్యపు సబ్బు' ; 'సుబ్బు మార్కు సబ్బు – శుభాలెన్నో తెచ్చు''
''సబ్బువాడితే శుభం ఏమిట్రా?''
''ప్రాస కోసం కూశా, సాగదీయకు''.
xxxxxxxxxxxxxxxxxxxxxxxx
'అది నాయనా కథ' అని నేను ఫ్లాష్‌బాక్ ముగించేలోపులే సుబ్బుగాడు తిట్టిపోసేసాడు. అల్లపు సబ్బులు అట్టరు ఫ్లాపట. ఆ ప్లాంటంతా ఏం చెయ్యమంటావని అరుస్తున్నాడు.
పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిలా నేనూ ప్రతిభ కంటే విధేయతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కథ అడ్డం తిరిగినా కథకుడిని ఏవిూ అనని వాడివిూద అభిమానం కలగదూ! మరోడైతే ఈపాటికి అచలపతి దగ్గరకి పరిగెత్తేవాడు. మనని నమ్ముకొన్నవారి మాటలకు నొచ్చుకోకూడదు.
కాస్సేపాలోచించి, 'ఆయుర్వేదం చాక్లెట్లు' పెట్టమన్నా.
''మళ్లీ ఆయుర్వేదం అంటావ్'' అంటూ కోకోకోలాపై జార్జి ఫెర్నాండెజ్లా నాలుక పీక్కోబోయేడు.
''ఒరేయ్, ఈ ఏడాదికాలంలో ఆయుర్వేదం విూద మోజు ఇంకా పెరిగింది కానీ తరగలేదు. రామర్ పిళ్లేను అడిగిచూడు. అతని పెట్రోలు వాహనాల్ని నడుపుతోందో లేదో కానీ ప్రజలకు మూలికల మీద ఉన్న నమ్మకం అతన్ని నడిపిస్తోంది''.
''అయినా సబ్బుల ఫ్యాక్టరీతో చాక్లెట్లు ఏమిట్రా? నురగ వచ్చేయదూ?''
''వస్తుంది. అది పళ్లను పరిశుభ్రం చేస్తుందని ప్రచారం చెయ్యి. 'సాధారణ చాక్లెట్లు విూ పళ్లను పాడుచేస్తాయి. ఈ ఆయుర్వేదం చాక్లెట్లు పళ్లనూ, ఇగుళ్లనూ శుభ్రం చేస్తాయి. ఇది ఆయుర్వేద తయారీ కాబట్టి సైడుఎఫెక్టులుండవ్' అని అడ్వర్టయిజ్మెంట్లు గుప్పించేయ్''.
''అయిడియా బాగానే ఉంది. కానీ సైడుఎఫెక్టుకు తెలుగేమిట్రా? తెలుగు ప్రకటనల్లో ఏం రాయించాలి?''
''ఒరే, తెలుగు అడ్వర్టయిజుమెంట్లో సరైన తెలుగు ఎప్పుడైనా చూసేవా?ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో అతి కృతకంగా రాయించు. సైడు ఎఫెక్టుకి 'పక్కప్రభావం' అని అనువాదం చేయించు. యాడ్ భాష చూసి ఇదేదో ఫారిన్ కంపెనీ తయారీ అనుకొని జనాలు చాక్లెట్లు వేలంవెర్రిగా కొనేస్తారు''.
xxxxxxxxxxxxxx
''వేలంవెర్రిగా కొనలేదు. ఫ్యాక్టరీ వేలం వేసే స్థితికి తెచ్చారు''. అన్నాడు అర్నెల్ల తర్వాత సుబ్బు వచ్చి.
అచలపతికేసి పక్కచూపులు చూడడం నా దృష్టిని దాటిపోలేదు. అచలపతిని అర్జంటుగా పనిమీద బయటకు పంపించేశా.
పబ్లిసిటీ తెచ్చుకోవడానికి మార్గాలు వేనవేలు. 'బద్నామ్ భీ తో నామ్ హై' అన్నాడు ఉర్దూవాడు. ఓ సినిమా సరిగ్గా ఆడిచావటం లేదనుకోండి అందులో ఎవరివో మతవిశ్వాసాలు దెబ్బతిన్నాయనో, ఓ కులనాయకుణ్ని కించపరిచారనో ఓ నిరసన, ఓ ప్రదర్శన, ఓ కోర్టు కేసు – తగిలిస్తే చాలు. విూరూ, నేనూ ఉలిక్కిపడి సినిమాకేసి దృషి ్టసారిస్తాం. నిజానిజాలు తేల్చడానికి స్వయంగా వెళ్లి చూస్తాం. కలక్షన్లు పెంచుతాం.
రాజ్నారాయణ్లు, కల్పనాధరాళ్లు, సుబ్రహ్మణ్యస్వాములు, ఉపేంద్రులు ప్రజల స్మృతిపథం నుండి తాము ఫేడవకుండా జాగ్రత్తపడే పద్ధతి ఒక్కసారి తలచుకోండి. 'వచ్చే ఏడాది నేనే ప్రధానమంత్రిని', 'తలచుకుంటే ప్రభుత్వం కూల్చేస్తా', 'రహస్యాలు బయట పెట్టేస్తా' లాటి స్టేటుమెంట్లు గుప్పిస్తే చాలు. 'ఓహో ఈయన ఇంకా యాక్టివ్గానే ఉన్నాడ'ని పదిమందికీ తెలుస్తుంది.
అలాగే ఈ చాక్లెట్లు అమ్మకాలకై జనాల దృష్టిని ఆకర్షించేటట్లు, వాళ్లను షాక్ చేసేటట్లు ఏం చెయ్యాలో సుబ్బుకి చెప్పేశా.
రెండ్రోజుల తర్వాత పేపర్లో ఓ న్యూస్ – 'మత్తు కలిగించే చాక్లెట్లు?' పై వారం -''పిల్లలు ఆయుర్వేదం చాక్లెట్లకు బానిసలవడానికి కారణం?' అని వ్యాసం. అదే సమయంలో ఇంకో పత్రికలో చర్చ- 'ఆయుర్వేదం చాక్లెట్లను నిషేధించాలా? వద్దా?' అని. అన్నిట్లోనూ విషయం ఒకటే.-'ఆయుర్వేదం చాక్లెట్లలో వాడే ఒక మూలిక ప్రజలకు మత్తు కలిగిస్తోంది. అది తినేవాళ్లకు దాని అలవాటు మాన్చుకోవడం కష్టంగా ఉంది. రోజుకి కనీసం నాలుగు చాక్లెట్లు తిన్నవాళ్లకి రంగురంగుల కలలు వస్తున్నాయి. దీన్ని నిషేధించే విషయం ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాలి.
పొడుగు ఎక్కువైందని నా కథలు సగం సగం చదివి వదిలేసినవాళ్లు కూడా ఇంతటి బ్రహ్మాండమైన అయిడియా నాదేనని గ్రహించగలరు. అయినా నాకు వినయం ఎక్కువ కాబట్టి ఆ విషయం నేను స్వయంగా నా నోటితో చెప్పను. 'పేపరు వాళ్లకు సుబ్బుచేత మంచి కాంప్లిమెంటరీలు ఇప్పించారా?' అని అడిగితే తల ఊపుతానంతే!
జర్నలిస్టులందరూ మేం రాసిచ్చినదే వేసినా ఓ పాత్రికేయుడు మాత్రం కాస్త ముందుకు వెళ్ళాడు. 'ఈసారి మా కాంగ్రెసుపార్టీకి ఎన్నికల్లో తిరుక్షవరం అయిపోతుంది' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంగ్రెసు నాయకుడు స్వయంగా మాతో చెప్పారు' అన్న ధోరణిలో వార్తలు రాసిరాసి, 'పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ కంపెనీ ఫ్యాక్టరీ అధికారి ఒకరు మా చాక్లెట్లలో మత్తు పదార్థాలు కలపబడుతున్నాయి' అని ఒప్పేసుకోవడం మా విలేఖరి చెవిన బడింది' అని రాసేశాడు.
దానివల్ల కొంప మునిగింది. 'వాళ్లే ఒప్పుకున్నారు కదా, ఇదేవిూ కట్టుకథ కాదన్న మాట' అనే నమ్మకంతో ఓ పరిశోధకుడు తీవ్రంగా శోధించడం మొదలెట్టాడు. సాధారణ పరిశోధనలు ఏళ్లూపూళ్లూ సాగినా ఆయన మాత్రం దీన్ని అర్నెల్లలో రీసెర్చి ముగించి పురాతన ఆయుర్వేద గ్రంథం 'అప్ప సంహిత'లో ఫలానా పేజీలో రాసినదాని ప్రకారం ఈ చాక్లెట్లలో ఉపయోగించే ఫలానా మూలిక, మాదక ద్రవ్యాలతో సమానమైనదే అని ఓ ప్రకటన ఇచ్చేశాడు.
ఈ అర్నెల్లలోనూ చాక్లెట్ల అమ్మకం భారీ ఎత్తున సాగుతూండడంతో కాలరెగరేసి తిరుగుతున్న నేను, ఈ ప్రకటన చూడగానే కాలర్ దాచేసుకున్నాను. అది పట్టుకొని సుబ్బు నిలదీస్తాడేమోనని. సుబ్బు కాలర్ కోసం వెతికి, అది కనబడక పీక పుచ్చుకుని ''ఏరా ఈ దగుల్బాజీ అయిడియా ఎందుకిచ్చావురా? నన్ను జైలు కీడుద్దామనా? గవర్నమెంటు వాళ్లు ఎంక్వైరీ కమిషన్ నియమిస్తార్ట. ఆ రిపోర్టు వచ్చేలోగా అమ్మకాలు నిషేధిద్దామనుకొంటున్నార్ట తెలుసా. అవునొరే, జైల్లో తినడానికి స్టీలు కంచం ఇస్తార్రా?'' అని అదీ ఇదీ అడిగాడు.
అసలు కొందరు పరిశోధకులు పరిశోధనలెందుకు చేస్తుంటారో పరిశోధించా లనిపించింది. ఈ మధ్య మరీనూ, కనబడే ప్రతీదాని గురించీ పరిశోధనలే. ప్రశాంతంగా బతక్క, బతకనివ్వక ఎందుకొచ్చిన పన్లివి? 'అప్పసంహిత' పుస్తకం ఎందుకు దొరకాలి? దొరికినా దాన్ని ఆయనెందుకు నమ్మాలి?
ఈ ఆలోచనలు సుబ్బుతో పంచుకొందామని చూస్తే వాడు కనబడలేదు. ముందస్తు బెయిలు కోసం ముందస్తుగా మేజిస్ట్రేటుగారితో మాట్లాడానికి వెళ్లాడేమో! పోనీ అచలపతికైనా చెప్దామని చూస్తే అతనూ కనబడలేదు, కొంపదీసి సుబ్బుగాడు అచలపతిని బయటకు తీసుకెళ్లి సంప్రదించటం లేదు కదా !
నాకు మన సినిమాలంటే మహాఇష్టం. హీరో ఏవేవో గొడవల్లో అన్యాయంగా ఇరుక్కు పోయినా నేను బెంగపడను. ఢోకా లేకుండా చివర్లో ఎలాగోలా నెగ్గుకొస్తాడని తెలుసుకాబట్టి. ఫారిన్ సినిమాల్లో ఆ గ్యారంటీ లేదు. అందర్నీ రక్షించిన హీరో ఆఖరి నిమిషంలో పుటుక్కుమన్నా పుటుక్కుమనేస్తాడు. అందువల్ల ఆ సినిమాలు చూస్తున్నంత సేపూ ఆందోళనగా ఉంటుంది. మన సినిమాలు చూసేటప్పుడు కాస్త ముందుకు కాళ్లు చాచుకుని, తల వెనక్కు వాల్చి, అర్ధనిమీలిత నేత్రాలతో తెరకేసి చూస్తూంటే చాలు, చిక్కులు వాటంతట అవే విడిపోతాయి.
సుబ్బుగాడి గొడవలో నేను చేసినదదే. పేపర్లో 'అప్పసంహిత' పై బాక్స్ ఐటమ్ న్యూస్ వచ్చేవరకు కళ్లు అర్ధనిమీలితంగానే ఉంచుకున్నాను. అవాళే విప్పార్చి చదివా- అప్పసంహితలో ఆ ఆయుర్వేద పరిశోధకుడు ఉటంకించిన సదరు భాగం ప్రక్షిప్తమని కనుగొన్నారనీ. దాని ఆధారంగా, సాగిన ఆయన పరిశోధన పొరబాటనీ, అందుచేత ఆయుర్వేదం చాక్లెెట్లు నిరపాయకరమైనవనీ.
హమ్మయ్య ! సినిమాలో శుభం దానంతట అదే వచ్చింది. సుబ్బుగాడు వచ్చి పూలదండవేస్తే 'నేను పడ్డ కష్టమేముంది, ఏదో నాకు తోచిన మంచి సలహా చెప్పడం తప్ప..' అన్న డైలాగును వినయం ఒలకబోస్తూ ఎలా చెప్పాలో ప్రాక్టీసు చేస్తూంటే అచలపతి కాఫీ తీసుకొచ్చేడు.
మనస్సు అహ్లాదంగా ఉంది కాబట్టి మాట్లాడ బుద్దేసింది.
''వాతాపి జీర్ణం యథావిథాయ -ఆహాఁ ఎక్కడో చదివేనో, ఘంటసాల పాడగా విన్నానో యథావిథిగా జీర్ణం కాకపోతే వాతం వస్తుందని ఎంత సింపుల్‌గా చెప్పాడో చూడు. ఈ ఘంటసాల భలేవాడోయ్. ఆయుర్వేదం గురించి కూడా పాటలు పాడాడు''.
''విూరు భగవద్గీత శ్లోకాన్ని మార్చి….'' అనబోయేడు అచలపతి.
''అవునవును భగవద్గీత కదూ! అదేదో కావ్యం రామాయణపరంగానూ, భారతపరంగానూ.. అర్థం వస్తుందంటారు చూడు. అలాగే భగవద్గీతకు ఆయుర్వేద పరంగా కూడా అర్థం ఉందన్న మాట. సుబ్బుగాడికి చెప్పి వాడి కంపెనీ ఎంబ్లమ్కి కింద ఈ వాక్యాన్ని ఇరికించమంటాను. జనాలకి,అర్థం కాకపోయినా మహా డిగ్నిఫైడ్‌గా ఉంటుందిలే. సంస్కృతం కదా..''.
''భగవద్గీతను ద్వర్థికావ్యంగా ఎవరూ పేర్కొనలేదు సర్''.
''ఎలా కొంటారు? రవికి తోచనిచో కవికి తోచున్' అని తెనాలి రాముడు తన డెంటిస్ట్‌తో అన్నాడట. కవికి తోచనిది క్రిటీకుడికి తోచాలి. తోచి తీరాలి. లేకపోతే వీడి గొప్ప బయట పెట్టుకోవడం ఎలా? అవునూ. అచలపతీ, ప్రక్షిప్తాలు ఎందుకు చేస్తారోయ్?''
''తర్వాతితరం రచయితలు మూల గ్రంథంలో చొప్పించిన వాటిని ప్రక్షిప్తాలంటారు సర్. వాటిని దురుద్దేశ్యంతో గానీ, మూలగ్రంథంలో కొన్ని భాగాలు దొరక్కపోతే పూరించడానికి గానీ చేస్తారు''
''బాగానే ఉంది కానీ వాటిని ఎలా కనిబెడతారు?''
''భాషలో మార్పులున్నా, మూల రచయిత ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా కనబడినా, అసంబద్ధంగా ఉన్నా, సందర్భశుద్ధి లేకున్నా వాటిని కనిబెడతారు. వాటిని ప్రక్షిప్తాలంటే లాభపడేవాళ్లు కొందరు, పండితులకు డబ్బు తినిపించి ప్రక్షిప్తాలని అనిపించడం కూడా కద్దు..''
''ఆగాగు, స్టాప్… రివైండ్ చెయ్యి. కాస్త స్లోగా ప్లే చెయ్యి''.
ఏక్షన్ రీప్లేలో నాకు ఏదో అనుమానం తోచింది. క్రమంగా అది పెనుభూతాకారం దాల్చింది. నిష్కర్షగా అడిగేశా –
''సుబ్బు ఇక్కడకు వచ్చినపుడు నేను వినయం ప్రదర్శించే అవసరం ఉండదంటావా?''
''సుబ్బుగారు ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువని తోస్తోంది సార్''.
''ఎందుకలా తోస్తోంది? ఇంకోవైపు ఎందుకు తొయ్యటం లేదు''.
''నిన్నరాత్రి నాకు డిన్నర్ ఇచ్చేటప్పుడు విూ గురించి చేసిన ప్రస్తావన ఆ దిశలో సాగలేదు సర్''.
డిన్నరా ? అచలపతికా? అంటే, గండం గట్టెక్కించింది.. కొంపదీసి..!?
గరుత్మంతుడు అచలపతిలా ఉంటే శ్రీ మహావిష్ణువుకి అంత పేరు వచ్చి ఉండేది కాదు.
('రచన' మాసపత్రిక, 1995)
– ఎమ్బీయస్ ప్రసాద్