దర్శకుడు శంకర్ డైరెక్షన్లో… కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు’ సినిమా అనౌన్స్ అయ్యింది. యూనివర్సల్ స్టార్ బిరుదాంకితుడు అయిన కమల్ అంటే ఏమిటో.. ఆయన ప్రత్యేకతలు ఏమిటో.. అప్పటికే జగద్విఖ్యాతం. అప్పటికే కమల్ నటుడు, దర్శకుడు, కథకుడు… ఇప్పుడు సినీ మేధస్సులో కమల్ స్థాయి ఏమిటో.. భారతీయుడు సినిమా ప్రకటన సమయానికి కూడా ఆయనది అదే స్థాయి. ఇక శంకర్.. అప్పటికి కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు. రొటీన్ రాబిన్ హుడ్ కథాంశానికే కొత్త సొబగులు అద్ది ‘జెంటిల్మన్’ సినిమాను.. ఆ తర్వాత ‘ప్రేమికుడు’ సినిమాను రూపొందించిన శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా ‘భారతీయుడు’ సినిమాను ప్రకటించారు. మరి ఈ కాంబినేషన్ అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరించింది. కమల్ ఏమిటి.. ఆ కుర్రాడి డైరెక్షన్లో ఏమిటి… అతడిని ఒక సీట్లో కూర్చోబెట్టి మొత్తం కమల్ తీసేస్తాడు చూడండి.. అంటూ కామెంట్లు మొదలయ్యాయి. మరి అందరూ ఇలాంటి ఊహాగానాల్లో ఉండగా.. నిర్మాత ఏఎం రత్నంకు ఒక షాకింగ్ న్యూస్. ఈ సినిమాను చేయలేనని కమల్ చెప్పేశాడు!
ఏదో శంకర్ అంటే పడక కాదు.. సినిమా కథ సవ్యంగా లేదనేది కమల్ అభిప్రాయం. ప్రత్యేకించి వృద్ధ కమల్ హాసన్ పాత్రలో లోపం ఉందని కమల్ ఆలోచన. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పోరాడిన వ్యక్తి… స్వతంత్రం వచ్చాకా చాలా సంవత్సరాలకు లంచగొండితనంపై పోరాటం మొదలుపెడతాడు. వృద్ధుడు అయ్యాకా.. లంచగొండిలను చంపడం మొదలుపెడతాడు. మరి అన్ని సంవత్సరాలు ఆయన ఏం చేసినట్టు? నిద్రపోతుంటాడా? లంచగొండితనం స్వతంత్య్రం వచ్చిన్పటి నుంచి ఉంది కదా..ఈ లెక్కన అప్పటి నుంచే పోరాడాలి కదా.. అనేవి కమల్ లాజిక్‌లు. ఈ విషయాలను మొదట దర్శకుడు శంకర్ వద్దే ప్రస్తావించాడు కమల్.
అయితే శంకర్ కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దానికి సంతృప్తిపడని కమల్.. నిర్మాతకు తను ఈ సినిమా చేయబోవడం లేదనే విషయాన్ని తెలియబరిచాడు. ఒక్కసారిగా రత్నం కాళ్ల కింద భూమి కంపించింది. కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో.. గొప్ప ప్రయోగాత్మక సినిమా చేస్తానని ప్రకటించి… అంతలోనే ఆ సినిమా ఆగిపోతుండంటే.. రత్నం భయపడిపోయాడు. కమల్ అభ్యంతరాలు ఏమిటో తెలుసుకుని దర్శకుడు శంకర్ వద్దకు వెళితే.. ఆయన వినడు. తను రాసుకున్నదే స్క్రిప్ట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేసేది లేదు.. అని శంకర్ రత్నం ఎదుట కుండబద్దలు కొట్టేశాడు. కమల్ ఔను అన్నా, కాదన్నా.. ఇదే పరిస్థితి అని తేల్చి చెప్పాడు.
ఈ దర్శకుడి మొండితనం చూసి… సూటిగా కమల్ ఇంటికి వెళ్లి.. రత్నం ఆల్ మోస్ట్ కమల్ కాళ్ల మీద పడ్డాడు.. అంటారు! ఈ సినిమా ఆగిపోనివ్వవద్దని.. చేయాలని కమల్‌ను రత్నం ప్రాధేయపడి చివరకు ఒప్పించుకొన్నాడు. శంకర్ మొండితనాన్ని చూసి కాదు.. రత్నంపై జాలితోనే కమల్ భారతీయుడు సినిమాను చేశాడని అంటారు. మరి ఏదేతేనేం.. ఆ సినిమా తెరెకక్కింది. విడుదల అయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యుంటే.. ఎవరు ఎవరిని తిట్టేవాళ్లో కానీ.. హిట్ అయ్యింది కాబట్టి .. అందరికీ మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టింది కాబట్టి… ఆ యూనిట్లో సినిమా విడుదల తర్వాత సఖ్యత కనిపించింది! 1996 నాటి ఎపిసోడ్ అది.
అప్పటికి ఆ విధంగా కమల్, శంకర్‌లది హిట్ పెయిర్‌గా నిలిచింది. దీంతో ‘రోబో’ సినిమా ప్రతిపాదన వచ్చింది! ఔను.. ‘రోబో’ సినిమాను శంకర్ మొదటగా కమల్‌తోనే తెరెకక్కించాలని భావించాడు. అందుకోసం …2002లోనే రంగం సిద్ధం చేసుకొన్నాడు శంకర్. తమిళ, తెలుగు భాషల్ ‘‘ఒకేఒక్కడు’’ చేస్తే.. అది సూపర్ హిట్ అయ్యింది. దాన్నే హిందీలో శంకర్ రీమేక్ చేయగా అట్టర్ ప్లాఫ్ అయ్యింది. అలాంటి సమయంలో శంకర్ వెళ్లి కమల్‌ను కలిశాడు. ‘రోబో’ కాన్సెప్ట్ గురించి వివరించాడు. దాన్ని కమల్ కూడా ఓకే చేయడంతో… అప్పటికి బాలీవుడ్లో మంచి ఫామ్‌లోఉన్న ప్రీతిజింతాను హీరోయిన్గా అనుకున్నారు. కమల్ , ప్రీతిలపై ఫోటోషూట్ కూడా జరిగింది. అంతా ఓకే అనుకొంటున్న సమయంలో.. ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి అనుకొంటున్న సమయంలో.. ఆ సినిమా ఆగిపోయింది!
టెక్నోథ్రిల్లర్ ‘రోబో’ ఫోటో షూట్‌తో ఆగిపోయింది. కమల్ , శంకర్లు ఈసారి ఒదిగి ఉండలేదు. ప్రత్యేకించి ఈ ఇద్దరినీ కన్వీన్స్ చేసి..సినిమాకు ఒప్పించుకోగల రత్నం వంటి నిర్మాత ఈసారి లేకుండా పోయాడు. దీంతో ‘రోబో’ ఫోటో షూట్ తోనే ఆగిపోయింది. కమల్ తన సినిమాలతో బిజీ అయిపోతే… శంకర్ ‘బాయ్స్’ సినిమాను ప్రారంభించాడు. అప్పటి నుంచి మాత్రం మళ్లీ కమల్ హాసన్, శంకర్లు కొంచెం కూడా దగ్గరైన దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ ‘భారతీయుడు’ సమయంలో కూడా నిర్మాత రత్నం చొరవలేకపోతే.. ఎలాగైనా సినిమాను తెరెకక్కించాలన్న ఆయన తపన లేకపోతే.. శంకర్, కమల్‌లు అప్పటికే ఎవరికి వారయ్యేవాళ్లు అనుకోవడానికి సందేహించనక్కర్లేదు.
అయితే శంకర్‌లో ఒక తెగింపు ఉంది.. తన స్క్రిప్ట్‌కు కమల్ ఓకే చెప్పనంత మాత్రానా.. ఆదర్శకుడు వెనుకడుగు వేయలేదు. భారతీయుడు సినిమా విషయంలో రత్నం చాలా బతిమాలినా.. కమల్ చెప్పినట్టుగా కథను మార్చమని కోరినా శంకర్ తగ్గలేదు. ఇక ‘రోబో’ సినిమా విషయంలో కమల్‌తో విబేధాలు ఆ సినిమాను ఆపేసినా శంకర్ తగ్గలేదు. చాలా పోరాటమే చేశాడు. ఆ సినిమాను తెరెకక్కించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో కూడా ఎదురుదెబ్బలే తగిలాయి. .కొంతమంది స్టార్ హీరోలతో విభేదాలు వచ్చాయి. అయినా శంకర్ ఒంటరిగా నిలిచాడు. రోబో కాన్సెప్ట్ కమల్‌తో ఆగిపోయాకా.. బాయ్స్ సినిమా ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడ్డ శంకర్‌కు ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో రోబో కాన్సెప్ట్‌కు మార్పు చేర్పులు చేశాడు. అయితే అందుకు సరైన హీరో దొరికే పరిస్థితి లేదప్పటికి. దీంతో ఆయన విక్రమ్‌తో ‘అపరిచితుడు’ రూపొందించి హిట్ కొట్టి తన సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ‘రోబో’ సినిమా స్క్రిప్ట్ దుమ్ము దులిపాడు.
తనకు ఆప్తులు, సన్నిహితులు అయిన క్రియేటివ్ జీనియస్లో సుజాత, రంగరాజన్‌లతో కూర్చొని స్క్రిప్ట్‌ను సరిచేశాడు. ఈసారి స్క్రిప్ట్ షారూక్ చేతిలో పడింది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి.. హిందీలో రూపొందిస్తే.. తమిళ, తెలుగు భాషల్లోకి కూడా డబ్ చేయవచ్చనేది శంకర్ లెక్క. అయితే ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం మీద రూపొందించడానికి ముందుకొచ్చిన షారూక్‌కు లెక్కలు వేరే ఉన్నాయి. కథలో తను అడిగిన మార్పులు చేయమని షారూక్ తన మెదడు వాడాడు. మరి కమల్ లాంటి దర్శకత్వ ప్రతిభ ఉన్న హీరో అడిగితేనే శంకర్ కాదన్నాడు. అలాంటిది షారూక్ అడిగితే మార్పులు చేస్తాడా? కాదు పొమ్మన్నాడు. షారూక్ కూడా అదే మాట అన్నాడు. దీంతో ‘రోబో’ మళ్లీ ఆగిపోయింది. ముంబై నుంచి వచ్చేసి రజనీకాంత్‌ను కలిసి ‘శివాజీ’ పని మొదలుపెట్టాడు శంకర్. చాలా సంవత్సరాల తర్వాత మరో స్టార్ హీరోతో పని!
శంకర్ కెరీర్ ఆరంభం హీరో అర్జున్‌తో జరిగింది. అప్పటికి అర్జున్ అంత స్టార్ కాదు. ఆ తర్వాత ప్రభుదేవా తను తయారు చేసిన నటుడు. మధ్యలో కమల్‌తో పనిచేయబోతే ఇబ్బందులే. ప్రశాంత్‌తో ఇబ్బంది రాలేదు, మళ్లీ పాత స్నేహితుడు అర్జున్‌తోనే ‘ఒకేఒక్కడు’ అలా గడిచిపోయింది. అయితే రజనీకాంత్‌తో ‘శివాజీ’ సినిమా చేస్తున్న సమయంలో మాత్రం భలే గాసిప్స్ వచ్చాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని… శంకర్ పనితీరుపై రజనీ అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే ‘శివాజీ’ మరీఎక్స్ పెక్టేషన్లను అందుకోలేకపోయింది. ఓపెనింగ్ సీన్లో ఉన్నంత జోష్.. సినిమా అంతా కనిపించలేదనే విశ్లేషణలు వినిపించాయి. ఇది రజనీకి అసంతృప్తికి గురించేసిందనే ప్రచారం కూడా జరిగింది.
అయితే.. విశేషం ఏమిటంటే.. రజనీతో కూడా శంకర్‌కు పడటం లేదు.. అని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ‘ రోబో’ సినిమా ప్రకటన వచ్చింది! సూపర్ స్టార్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో రెండో సినిమా వచ్చింది. దేశ వ్యాప్తంగా ‘రోబో’ సంచలన విజయం సాధించింది. ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోలతో ప్రతిపాదనలోకి వచ్చిన సినిమా.. చివరకు మరో సూపర్ స్టార్‌తో పట్టాలెక్కింది. సంచలన విజయం సాధించింది. విజయ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో శంకర్ రూపొందించిన ‘నన్బన్’లో కూడా శంకర్ మార్కు అంతగా కనపడలేదు. ఇదీ ఇప్పటి వరకూ సూపర్ స్టార్లతో శంకర్.. జర్నీ. ఇక ముందు ముందు ఈ ప్రయాణం ఎలా ఉంటుందో!