తగలబడ్తోన్న తిరుమల.. నేరమెవరిది.?

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైనది. కేవలం ఆలయమొక్కటే కాదు, తిరుమలగిరులు.. అంటే దేవాలయం విస్తరించి వున్న కొండలన్నిటినీ పరమపవిత్రంగా భక్తులు భావిస్తారు. తిరుపతిలో విస్తరించిన కొండలన్నిటికీ ఏదో ఒక…

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైనది. కేవలం ఆలయమొక్కటే కాదు, తిరుమలగిరులు.. అంటే దేవాలయం విస్తరించి వున్న కొండలన్నిటినీ పరమపవిత్రంగా భక్తులు భావిస్తారు. తిరుపతిలో విస్తరించిన కొండలన్నిటికీ ఏదో ఒక రూపంలో ఆధ్మాత్మిక ప్రత్యేకతలున్నాయి. 

వేసవి కాలంలో కొండల మీద అగ్గి రాజుకోవడం అనేది సర్వసాధారణమైన విషయమే అయినా, గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో అగ్గిరాజుకుంది. అగ్ని కీలలు తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర్లోకి రాకపోయినా, ఆ మంటల కారణంగా భక్తులు భీతిల్లుతున్నారు. పాపవినాశనం వంటి పుణ్యక్షేత్రాలకు దగ్గర్లోకి మంటలు వ్యాపించడమే అందుక్కారణం.

అసలీ అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు.? అగ్ని కీలలు మొదలై రోజులు గడుస్తున్నా, ఎందుకు అధికారులు నిర్లక్ష్యం బాట పట్టారు.? అనే ప్రశ్నలు భక్తుల్ని వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ తరహా అగ్ని కీలలు అడవువుల్లో సర్వసాధారణం కావడంతో, అక్కడ హుటాహుటిన మంటలు ఆర్పేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. మన దేశంలో అలాంటి ఏర్పాట్లు లేకపోవడం దురదృష్టకరం.

నిత్యం వేలాదిమంది భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వెళ్తారు. నిత్యం లక్షకు పైగానే భక్తులు తిరుమల కొండపై వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. ఈ నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. విలువైన అటవీ సంపద, వన్యమృగాలు.. వీటి భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయా.? లేదంటే, భక్తులో ఇంకొకరో.. చేసిన అల్లరి పని కారణంగా అగ్గి రాజుకుందా.? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నా, ప్రస్తుతానికి మంటల్ని తగ్గించడమ్మీదనే అధికారులు దృష్టిపెట్టారు. హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నప్పటికీ, వాటి వల్ల ఉపయోగం వుండదన్న అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.

భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా వుండాలంటే, తిరుమల కొండపై భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు, అగ్నిమాపక శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.